పెట్రో ధరలు, ముడి సరుకుల పెంపు ప్రభావం ఎరువుల రూపంలో రైతులపై భారం పడనుంది. జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీష్ సీజన్ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచాలని కంపెనీలు నిర్ణయించడమే దానికి కారణం. ఈ మేరకు టోకు వ్యాపారులకు సమాచారం అందింది. పెంపు సుమారు 58 శాతం ఉండటంతో అన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. మొదలే సాగు వ్యయం పెరిగి, పండిన పంటలకు మద్దతు ధర దొరకని పరిస్థితుల్లో నానా ఇబ్బందులుపడుతున్న అన్నదాతలకు ఈ నిర్ణయం ఆశనిపాతమేననే ఆందోళన వ్యక్తమవుతోంది.
డై అమ్మోనియం ఫాస్ఫెట్ 50 కిలోల బస్తా గరిష్ట చిల్లర ధర ప్రస్తుతం రూ. 1200 ఉండగా, పెరిగిన ఉత్పత్తి వ్యయంతో రూ. 1900 అవుతోందని “ఇఫ్కో” కంపెనీ వ్యాపారులకు పంపిన సమాచారంలో తెలిపింది. ప్రస్తుతం చిల్లర, టోకు వ్యాపారుల వద్ద నిల్వ ఉన్న సరుకును పాత ధరలకే అమ్మాలని, ఈ నెల ఒకటి నుంచి సరఫరా అయ్యే వాటికి మాత్రమే కొత్త ధరలు వర్తిస్తాయని పేర్కొంది. ఇదే కాదు ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచుతున్నట్లు జిల్లాలోని వ్యాపారులకు సమాచారం ఇచ్చాయి. ఆయా కంపెనీలు డీఏపీ ధరను రూ. 1200 నుంచి 1700 వరకూ పెంచాయి. తాజా పెంపుతో సాగువ్యయం గణనీయంగా పెరగనుంది. డీఏపీ సహా పెరిగే అన్నింటి ధరలను పరిగణలోకి తీసుకుంటే అదనంగా కనీసంగా ఎకరానికి రూ. 2 వేలు భారం పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. వరి సాగు చేసే రైతులపై ఈ భారం దాదాపు రూ. 3 వేల వరకు ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత వేసవిలో పంటల సాగు లేనందున ఎరువులను రైతులు కొనడం లేదు. వచ్చే నెలాఖరు నుంచి కొనుగోళ్లు మొదలవుతాయి. అప్పటికి కొత్త ధరలతో కొత్త నిల్వలు జిల్లాలకు వస్తాయని ఓ కంపెనీ చెప్పింది. తెలంగాణలో వానాకాలం, రబీ సీజన్లలో కలిపి 3 లక్షల టన్నుల డీఏపీ, 10 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువుల విక్రయాలు జరుగుతాయి.
పాత డీపీని పాత ధరలకే విక్రయించనున్నట్లు సహకార రంగంలోని ఇఫ్కో ప్రకటించింది. 50 కిలోల డీఏపీ సంచిని రూ. 1200 కు, ఎంఓపీ, ఎన్ పీకే లను రూ. 11.26 లక్షల టన్నుల సరకును అమ్మకానికి పెడతామని పేర్కొంది. కొత్త సరుకుకు కొత్త ధర ఉన్నా అవి ప్రస్తుతానికి రైతులకు విక్రయించడానికి కాదు. ఆ సరకును నిల్వ చేస్తారు. పాత నిల్వలు పూర్తయిన తరువాతనే కొత్త నిల్వలు రైతులకు అందుబాటులోకి వస్తాయి అని ఇఫ్కో ఎండీ అవస్థీ ట్విటర్ లో తెలిపారు. భవిష్యత్తులో ధర తగ్గే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.
ఎరువుల రూపంలో రైతులపై భారం..
Leave Your Comments