కంది పంట పూత దశలో..ఏయే చీడపీడలు ఆశిస్తాయి ? వాటిని ఎలా నివారించుకోవాలి ?
వర్షాధారంగా సాగుచేస్తున్న పప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైన పంట. తొలకరి వర్షాలకు విత్తుకున్నపంట ప్రస్తుతం పూతదశలో ఉంది. ఈ సమయంలో సరైన యజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు. వర్షపాతం లేనిచోట పూతకు ముందు ఒకసారి 19:19:19 ఎరువును లీటరు నీటికి 5 గ్రా.చొప్పున కలిపి పిచికారి చేయాలి. నీటి వసతి ఉన్నవారు ఒక రక్షక నీటి తడిని పూత ఏర్పడే దశలో ఇవ్వాలి. పప్పుదినుసుల పంటలు పూతదశలో నీటి ఎద్దడికి గురైనా, పూతదశలో నీరు ఎక్కువైనా పూత అంతా రాలిపోతుంది. కాబట్టి సరైన సమయంలో నీటితడులు ఇచ్చుకోవాలి. కొన్నిచోట్ల పూత రాలిపోవడం ప్రధాన సమస్య. ఈ సమస్య ముఖ్యంగా ఇసుక నేలల్లో సాగుచేసిన పంటలో కనిపిస్తుంది. అందుకే పూత రాలుట నివారించడానికి ప్లానోఫిక్స్ 0.2 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకున్నట్లయితే పూత, పిందె రాలటాన్ని అదుపు చేసుకోవచ్చు. కాయ ఏర్పడే దశలో బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు ఒకసారి 13-0-45 లేదా పొటాషియం నైట్రేట్ 10 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
కందినాశించే పురుగులు :
మారుకా మచ్చల పురుగు :
ముఖ్యంగా పూత దశలో మారుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదం ఉంటుంది. ఈ పురుగు ఆశించిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. ఈ పురుగు లేత ఆకులు, అప్పుడే ఏర్పడుతున్న పూత మీద గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి పొదిగిన లార్వాలు ఆకులు, పూతను గూడుగా చేసుకొని అందులో ఉన్నపచ్చదనాన్నితింటాయి. దీని వల్ల పూత రాలిపోతుంది. కాయ ఎదుగుదల లోపిస్తుంది. అందుకే మారుకా మచ్చల పురుగును గమనించినట్లయితే ముందుగా వేప గింజల కషాయం 5 శాతం లేదా వేపనూనె (అజాడిరాక్టిన్ 1500 పి.పి.ఎం) 5 మి.లీ. లీటరు నీటికి కలిపి చల్లాలి. పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు ఒకసారి స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి. లీ.చొప్పున లీటరు నీటికి కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారి చేయాలి.
శనగపచ్చ పురుగు :
ఈ పురుగు లేత కాయ, పూత దశలో ఆశిస్తుంది. పూత, పూమొగ్గల మీద విడిగా గుడ్లను పెడుతుంది. తొలిదశలో లేత ఆకులను పూలను తింటుంది. ఆ తర్వాత కాయలు ఏర్పడే దశలో ఆశించినట్లయితే కాయలలోకి సగభాగం చొచ్చుకొని పోయి మిగిలిన భాగం బయటకు ఉంచి గింజలను తింటుంది. దీని వల్ల గింజల పరిమాణం తగ్గి నాణ్యత దెబ్బతినడం, గింజలు రాలిపోవడం జరుగుతుంది. నివారణకు పూత ఏర్పడే దశలో ఎకరాకు 20 ‘వై’ ఆకారపు పంగల కర్రలను అమర్చుకోవాలి. పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. పురుగు ఉధృతి ఆర్ధిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కాయతొలిచే ఈగ:
బెట్ట వాతావరణ పరిస్థితులు, ఏదైనా కారణం చేత పంట కాలం పొడిగించినప్పుడు ఉధృతి అధికంగా కనిపిస్తుంది. పూత, లేత కాయలు లేదా పిందెల్లోకి గుడ్లను పెడుతుంది. వీటి నుంచి పొదిగిన తెల్లని పిల్లపురుగులు గింజలను తింటూ గింజల మీద తెల్లని చారలను ఏర్పరుస్తాయి. ఈ పురుగు ముఖ్యంగా దీర్ఘకాలిక రకాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు 1.5 గ్రా. లేదా లామ్డాసైహలోత్రిన్ ఒక మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆశించే తెగుళ్లు :
పైటోఫ్తోరా ఎండు తెగులు :
ఈ తెగులు అధిక వర్ష పాతం, నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తుంది. తొలిదశలో ఆశిస్తే మొక్కలు గుంపులు గుంపులుగా ఎండిపోతాయి. తెగులు తీవ్రమైతే కొమ్మలు, కాండం విరిగిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రా. లేదా మెటలాక్సిల్ 2 గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వీలైనంత వరకు బోదెలు, కాల్వల పద్ధతిలో పంట విత్తుకోవాలి. మధ్య మధ్యలో లోతైన గొడ్డు సాలు (బోదె) ఏర్పాటుచేసి నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేయాలి.
ఎండు తెగులు :
కంది పంటను ప్రతియేటా ఒకేపోలంలో సాగుచేయడం ద్వారా ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్కలు పూర్తిగా లేదా మొక్కలో కొంతభాగం ఎండిపోతుంది. ఎండిపోయిన మొక్కల కాండాన్ని చీల్చి చూస్తే గోధుమరంగు నిలుపు చారలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు మందులు లేవు కాబట్టి తెగులును తట్టుకునే రకాలు ఐ.సి.పి.ఎల్. 87119, డబ్యు.ఆర్.జి. 65, టి.డి.ఆర్.జి. 4, ఐ.సి.పి. 8863, ఐసిపిహెచ్ 2740 రకాలను సాగుచేయాలి. జొన్నలేదా మొక్కజొన్న లేదా పొగాకు పంటలతో పంట మార్పిడి చేయాలి. వర్షపు నీరు పొలంలో నిల్వ ఉండకుండా బోదె కాల్వల ద్వారా బయటికి పంపాలి.
స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ లేదా గొడ్డుమోతు తెగులు :
ఈ వైరస్ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కలు చిన్నచిన్న లేత ఆకులను ఎక్కువగా కలిగి ఉంటాయి. నల్లి పురుగుల నివారణకు స్పైరోమెసిఫిన్ ఒక మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. గత సంవత్సరం పండిరచిన పంటను పూర్తిగా తీసివేయాలి. గట్లపై అలాగే కళ్ళం దగ్గర స్వతహాగ మొలిచిన మొక్కలను కూడా తీసివేయాలి. ఈ తెగులును తట్టుకునే ఐసిపిఎల్ 87119, బి.ఎస్.ఎం.ఆర్. 853, బి.ఎస్. ఎం.ఆర్. 736, ఐ.సి.పి.ఎల్. 85063 వంటి రకాలను సాగు చేయాలి.
పి. విజయ్ కుమార్, డా.బి.వి. రాజ్ కుమార్, డా. శ్వేత,
కృషి విజ్ఞాన కేంద్రం, రుద్రూర్, నిజామాబాద్ జిల్లా.