తెలంగాణవార్తలు

ఆయిల్ పామ్ సాగులో శాస్త్రీయ అధ్యయనం కోసం…  మలేషియా వెళ్లిన మంత్రి తుమ్మల

0
Minister Tummala went to Malaysia  : ఆయిల్ పామ్ విస్తరణవకాశాలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఆయిల్ పామ్ ఉత్పాదకాలు వగైరా అంశాల గురించి శాస్త్రీయ అధ్యాయానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ మరియు ఎం.డి. ఆయిల్ ఫెడ్ యాస్మిన్ బాషా, వారి బృందం మూడు రోజుల మలేషియా పర్యటనకు వెళ్లారు.ఇందులో భాగంగా ఈ రోజు (అక్టోబర్ 23)మలేషియా ప్లాంటేషన్, కమోడిటీస్ మంత్రి జోహరి అబ్దుల్ ఘనిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకోసం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రస్తుత పరిస్థితి, రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్దికి గల అవకాశాలను వివరించి, ఆయిల్ పామ్ సాగులో అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉన్న మలేషియా నుంచి సహకారం అందించగలరని కోరారు.
మలేషియా మంత్రి మాట్లాడుతూ 143 కోట్ల జనాభా గల దేశానికి ఆహారం అందించడం చాలా గొప్ప విషయమని, ప్రపంచ దేశాలు అన్నీ భారతదేశం ఆ దిశలో అవలంబిస్తున్న విధివిధానాలను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పామ్ఆయిల్ వృద్దికి తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఆ దిశలో త్వరలోనే వారి బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని తెలియజేసారు.
 బ్రోకెన్ రైస్ వ్యాపార అవకాశాలపై చర్చ:
పర్యటనలో భాగంగా తర్వాత వ్యవసాయశాఖ మంత్రి MATRAOE చైర్మన్ డాటో సెరి రీజల్ మెరికన్ ను కలిసి మలేషియాతో వ్యవసాయపరంగా గల వ్యాపార అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఇండియాతో వ్యాపారాభివృద్ధికి తమదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వ్యాపార పరంగానే కాక ఇండియాతో తమకు సామాజికంగా, చారిత్రకంగా కూడా బంధం ఉందని తెలియజేశారు. బ్రోకెన్ రైస్ కు తమ దేశంలో అత్యంత డిమాండ్ ఉందని తెలియజేయగా, మన రాష్ట్రం నుంచి బ్రోకెన్ రైస్ సరఫరాకు గల అవకాశాలను పరిశీలించి త్వరలోనే తెలియజేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. వెంటనే మంత్రి హాకా (HACA ) మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డితో టెలిఫోన్ లో సంప్రదించి మన రాష్ట్రం నుంచి బ్రోకెన్ రైస్ ఎగుమతికి గల అవకాశాలు, దానికి సంబంధించిన ఎకనామిక్స్ ను పరిశీలించి, మన వరి రైతులకు అదనపు ప్రయోజనం కలిగితే వచ్చే యాసంగి కల్లా ఎగుమతి చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మలేషియా పామ్ ఆయిల్ బోర్డు సందర్శన:
పర్యటనలో భాగంగా మొదటి రోజు సాయంత్రం మలేషియా పామ్ ఆయిల్ బోర్డును సందర్శించి, పామ్ ఆయిల్ రంగంలో వాళ్ళ అనుభవాలను మలేషియా పామ్ ఆయిల్ బోర్డు (MPOB ) చైర్మన్ డా. అహ్మద్ పర్వేజ్ గులామ్ ఖాదీర్ పర్యటన బృందంతో పంచుకున్నారు. ఆయిల్ పామ్ సాగులో MPOB ఒక నూతన ఒరవడిని సృష్టించిందని, ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే ప్రాంతాలలో పంట విస్తరణకు కావాల్సిన సాంకేతిక సహాయం అందిస్తుందని మంత్రికి తెలియజేశారు.
Leave Your Comments

టన్ను ఆయిల్ పామ్ ధర రూ.2980 పెంచిన కేంద్రం…

Previous article

You may also like