ఆంధ్రా వ్యవసాయం

ఉభయ అనంతపురం, కర్నూల్ జిల్లాల రైతులు ఈ జాగ్రత్తలు పాటించండి !

0
Transparent umbrella under heavy rain against water drops splash background. Rainy weather concept.
Farmers of both Anantapur and Kurnool districts should follow these precautions! : ఉభయ అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో అక్టోబర్ 16 నుంచి 20 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాత సూచనలున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 27 – 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23- 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు. వాయువ్య౦ నుంచి ఈశాన్యం దిశగా గాలులు గంటకు 2 – 8 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంటుంది. గాలిలో తేమ ఉదయం పూట 90 – 94 శాతం, మధ్యాహ్నం పూట 74 – 88 శాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు:
  • తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాత సూచనలు ఉన్నందున ఖరీఫ్ పంటలు కోత చేపట్టిన రైతులు పంట ఉత్పత్తులను గోదాములకు తరలించడం చేయాలి లేదా టార్పలిన్ తో కప్పి బద్రపరుచుకోవాలి. కోత చేపట్టాల్సిన రైతులు తమ ప్రాంత వాతావరణ పరిస్థితులు గమనించి పనులు చేసుకోవాలి.
  • రబీ పంటలు వేయటానికి అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం అనువైన సమయం.
  • ప్రస్తుతం శనగ సాగు చేసే రైతులు అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. అధిక దిగుబడి ఇచ్చే రకాలైన నంద్యాల గ్రామ్.1267 (ఎన్ బి ఇ జి.1267), నంద్యాల గ్రామ్ 776 (ఎన్ బి ఇ జి. 776), నంద్యాల గ్రామ్ 857 (ఎన్ బి ఇ జి. 857), నంద్యాల గ్రామ్ 452 (ఎన్ బి ఇ జి. 452), నంద్యాల గ్రామ్ 49 (ఎన్ బి ఇ జి. 49), ధీర (ఎన్ బి ఇ జి. 47), నంద్యాల శనగ 1 (ఎన్ బి ఇ జి. 3), జె.జి. 11, జెఏకెఐ. 9218 వంటి రకాలను ఎన్నుకొని ఎకరానికి 30 నుంచి 35 కిలోల విత్తనాన్ని విత్తుకోవాలి. శనగ సాగు చేసే రైతులు తప్పనిసరిగా పొలంలో నిర్దిష్ట సఖ్యలో మొక్కల సాంద్రత ఉండేలా చూసుకోవాలి. విత్తనాన్ని విత్తుకునే ముందు తప్పకుండ ప్రతి కిలో విత్తనానికి 8 గ్రా. ట్రైకోడెర్మ విరిడి పొడిని + థైరమ్ 3 గ్రా. లేదా కార్బెండాజిమ్ 2.5 గ్రా. లతో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కలుపు నివారణకు పెండిమిథాలిన్ 1000 నుంచి 1400 మి.లీ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన 24 నుంచి 48 గంటలలోపు పిచికారి చేయాలి. అలాగే సకాలంలో తెగుళ్లు, కీటకాల ఉధృతి గమనించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. పంటకాలంలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే పొటాషియం నైట్రేట్ 5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నీటి వసతి ఉన్న రైతులు పంట విత్తిన 30-35 రోజులకు నీటి తడి ఇవ్వడం వల్ల అధిక దిగుబడి పొందటానికి ఆస్కారం ఉంటుంది.
  • ప్రస్తుతం మొక్కజొన్న పంట శాఖీయ  దశ నుంచి గింజ అబివృద్ది దశలో ఉంది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని మొక్కజొన్న పంటలో నత్రజని యాజమాన్యo చేపట్టాలి. మొక్కజొన్నలో పై పాటుగా నత్రజని ఎరువును మూడు దఫాలుగా వేయాలి.  25 శాతం నత్రజని 25-30 రోజులకు, 25 శాతం 45-50 రోజులకు, 25 శాతం 60-65 రోజులకు వేసుకోవాలి.
  • అధిక వర్షాల వల్ల ముంపునకు గురయిన అరటి తోటల్లో వర్షాలు తగ్గిన తరువాత మురుగు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. గాలిలో అధిక తేమ శాతం వల్ల అరటిలో సిగటోక ఆకు మచ్చ తెగులు ఆశించి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. తెగులు నివారణకు మినరల్ ఆయిల్ ( 5 మి.లీ + డైఫెన్ కొనజోల్ 0.5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి రెండు, మూడు సార్లు నెల రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో దానిమ్మలో బాక్టీరియా ఆకు మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు ఆశించిన మొక్కలో ఆకులు, కొమ్మలు, కాయలు తీసివేయాలి. లీటరు నీటికి 0.5 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ + 3 గ్రా. కాపర్  ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారి చేయాలి. వాతావరణ పరిస్థితులు గమనించి వర్షం లేని సమయంలో పిచికారి చేసుకోవాలి.
డా. ఎం. విజయ్ శంకర్ బాబు,
డా. జి. నారాయణ స్వామి, డా. జి.డి. ఉమాదేవి
వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురం
Leave Your Comments

ఆరు రబీ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం  

Previous article

జయశంకర్ వ్యవసాయ వర్శిటీ నూతన ఉపకులపతిగా డా.అల్దాస్ జానయ్య 

Next article

You may also like