How to prepare Jivamruta at farmer level?: విచక్షణారహితంగా సస్యరక్షణ మందులు వాడటం వల్ల పంటఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు మిగిలిపోయి ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్య పరిస్థితులు, ఆహార శైలిలో మార్పుల వల్ల వినియోగదారులు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పశుపోషణ భారంగా మారడంతో పశువుల ఎరువు వంటి సేంద్రియ ఎరువులు చాలినంతగా దొరకడం లేదు. దీంతో రైతులు తమకు అవసరమైనప్పుడు తయారు చేసుకునే విధంగా వివిధ ద్రవ సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఆ కోవలోకి చెందినాదే జీవామృతం ద్రవసేంద్రియ ఎరువు.
ఈ జీవామృతం ఎరువులో వివిధ స్థూల, సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, హార్మోన్లు, ఇతర ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు లభిస్తాయి. జీవామృతాన్ని మొక్కలపై పిచికారి చేయడం వల్ల పోషక లోపాలను అధిగమించవచ్చు. పంట పెరుగుదల బాగా ఉండి, పంట దిగుబడి, రైతుకు ఆదాయం పెరుగుతుంది. .
జీవామృతం తయారీ:
జీవామృతం తయారీకి పశువుల పేడ 10కిలోలు, పశువుల మూత్రం 10 లీటర్లు, బెల్లం ఒక కిలో, శనగ పిండి ఒక కిలో నీరు 200 లీటర్లు, పుట్టమన్ను 50 గ్రాములు కావాలి. ఒక ప్లాస్టిక్ డ్రమ్ము కూడా సమకూర్చుకోవాలి.
విధానం: ఒక డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకొని దానిలో పది కిలోల పేడ కలిపి, కర్రతో బాగా కలియబెట్టాలి. దీనిలో మెత్తగా పొడి చేసిన ఒక కిలో బెల్లం, ఒక కిలో శనగపిండి వేసి కలపాలి. దీనిలో పది లీటర్ల పశువుల మూత్రం, పిడికెడు మట్టి కూడా కలిపి కర్రతో బాగా కలియబెట్టాలి. డ్రమ్ముపై గోనెసంచి కప్పి ఉంచి, వారం రోజులు పులియబెట్టాలి. రోజూ ఉదయం సాయంత్రం కర్రతో కలియ తిప్పాలి. తయారైన వారం రోజుల లోపు దీనిని వాడుకోవాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని తగినంత నీటిలో కలిపి పైర్లపై పిచికారి చేసుకోవచ్చు. సాగునీటి ద్వారా కూడా వాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో జీవామృతాన్ని రైతుస్థాయిలో తయారుచేసుకొని తమ పంటలకు వాడుకొని మంచి దిగుబడి, ఆదాయం పొందవచ్చు.