Lucerne grass: పాడికి ఆధారం పచ్చిమేత. అందువల్ల అక్టోబరు మాసం నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్లో పప్పుజాతి పశుగ్రాసాలను సాగుచేసి మంచి దిగుబడిని పొందవచ్చు. ఈ సీజన్లో సాగుకు లూసర్న్, హెడ్జ్ లూసర్న్, అలసంద, బర్సీమ్, స్టైలో వంటి పప్పుజాతి పశుగ్రాసాల సాగు అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రాసాల్లో మాంసకృత్తులు అధికంగా ఉండటం వల్ల పశువులకు మేతగా వాడినప్పుడు పాల దిగుబడి పెరుగుతుంది. గొర్రెలు, మేకలకు మేపడం వల్ల వాటిలో పెరుగుదల బాగా ఉండి అధిక మాంసం దిగుబడి వస్తుంది.
- అక్టోబరు మాసంలో పప్పు జాతి పశుగ్రాసాలను సాగు చేయడం వల్ల వీటిని పచ్చి మేతగా పశువులకు, జీవాలకు వాడొచ్చు. మిగిలిన పచ్చిమేతను ఎండబెట్టి తర్వాత ఎండుమేతగా వేసవి కాలంలో ఉపయోగించుకోవచ్చు.
- లూసర్న్ పశుగ్రాస పంటను ఒకసారి విత్తుకుంటే మూడు, నాలుగేళ్ల పాటు దిగుబడినిస్తుంది. లూసర్న్ గ్రాసంలో అత్యధికంగా 16-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. అందువల్లనే దీనిని “క్వీన్ ఆఫ్ ఫోరేజ్” గా కూడా పిలుస్తారు. విత్తేముందు లూసర్న్ విత్తనానికి రైజోబియం కల్చర్ పట్టించి విత్తాలి. వరుసల మధ్య 45 సెం. మీ. ఉండేవిధంగా ఎకరానికి 6 కిలోల విత్తనం వాడాలి. దుక్కిలో ఎకరాకు 8 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం చొప్పున వేసుకోవాలి.
- హెడ్జ్ లూసర్న్ పశుగ్రాస పంట సాగు చేయదలిస్తే ముందుగా విత్తనాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంలో 8-10 నిమిషాలు ఉంచి తర్వాత ఆరబెట్టి వరుసల మధ్య 60 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. దుక్కిలో ఎకరానికి 6 కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ పోషకాలనిచ్చే ఎరువులను వేసుకోవాలి.
- అలసందలో ప్రధాన రకాలైన విజయ్, రష్యన్ జైంట్, కో – 8 వంటి పశుగ్రాస రకాలను సాగుకు ఎంచుకోవచ్చు. ఎకరానికి 12 కిలోల విత్తనం వాడి సాళ్ల మధ్య 30 సెం.మీ. ఎడం ఉండేలా విత్తుకోవాలి. ఎకరాకు దుక్కిలో 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం పోషకాలనిచ్చే ఎరువులను వేసుకోవాలి.
Leave Your Comments