Natural Farming: ప్రకృతి వ్యవసాయంలో దాగిఉన్నసైన్స్ ను అర్థం చేసుకొని రైతుల ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చుదామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ కోరారు. శుక్రవారం (అక్టోబర్ 4 న)ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కృష్ణ ఆడిటోరియంలో ప్రకృతి వ్యవసాయంపై వైస్ చాన్సలర్ డా. ఆర్. శారద జయలక్ష్మి దేవి అద్యక్షతన వర్క్ షాప్ జరిగింది. ఈ సంధర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయంలో చోటుచేసుకొంటున్న మార్పులు, రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులలో పెరుగుతున్న ఆత్మహత్యలు వంటి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి వ్యవసాయాన్ని పునసమీక్షించాల్సిన అవసరాన్ని అయన గుర్తుచేశారు. అప్పటి కాలానికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని, అయితే రైతులు అవరానికి మించి రసాయనాలను ఉపయోగించడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి చర్యల ప్రభావమే కేరళ, విజయవాడ వరదలు అని అయన పేర్కొన్నారు.
విశ్వ విద్యాలయాలు ప్రధానంగా పంటల దిగుబడి పెంచడంపై దృష్టి సారిస్తుండగా ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, ప్రభుత్వ సలహాదారులు విజయకుమార్ చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే గాకుండా వాతావరణ మార్పులకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నసైన్స్ ను గుర్తించే ప్రయత్నాలు, పరిశోధనలు చేస్తూ ప్రకృతి వ్యవసాయం సూత్రాలను ముందుకు తీసుకోనిపోవాలని అయన కోరారు.
ప్రకృతి వ్యవసాయంపై కలసి కట్టుగా పరిశోధనలు…
వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లి రావు
వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లి రావు మాట్లాడుతూ రైతు సాధికార సంస్థ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వేరువేరుగా పనిచేయడం కాకుండా కలసి కట్టుగా ప్రకృతి వ్యవసాయంపై పనిచేసేందుకు పరిశోధనలు చర్చలు కొనసాగించి భూసారాన్ని పెంచడం, వాతావరణ మార్పులకు, ఆరోగ్య మార్పులకు పరిష్కారం వెతకడం వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. ఉత్తమ అనుభవాలను తీసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అయన సూచించారు.
ఖర్చు తగ్గించి రాబడి పెంచే విధానాలు పాటించాలి…
రంగా వర్శిటీ వైస్ చాన్సలర్ డా. శారద జయలక్ష్మి దేవి
యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డా. శారద జయలక్ష్మి దేవి మాట్లాడుతూ భారత దేశం వ్యవసాయానికి పుట్టినిల్లు అని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దిగుబడులు పెంచాలనే ఉద్దేశ్యంతో హరిత విప్లవాన్ని తీసుకుని వస్తే రైతులు అధిక దిగుబడుల కోసం శాస్త్ర వేత్తలు సూచించిన ప్రకారం కాకుండ అధిక రసాయనాలు వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం, నేల ఆరోగ్యం దెబ్బతిని వాతావరణ మార్పులకు దారి తీసిందని అన్నారు. అధిక రసాయనాలు వాడడం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగాయని, ఏక పంట విధానం వల్ల అధిక దిగుబడులు రాక పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడుతూ రైతులు పలు పంటల విధానాన్ని అవలంభించాలని కోరారు. వ్యవసాయంలో పశువులను అనుసంధానం చేయడంలేదని, కేవలం వ్యాపారం నిమిత్తమే పాడి పశువులను ఉపయోగిస్తున్నారని ఆమె తెలిపారు. భూమి ఎల్లపుడు కప్పివుంచాలని సూచించారు.
అనంతరం రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ ప్రకృతి వ్యవసాయంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. డాక్టర్ స్వామినాధన్ పెరుగు తున్న జనాభాను దృష్టిలో వుంచుకొని అప్పట్లో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని.అయితే ప్రకృతి వ్యవసాయం అనేది సాంప్రదాయ వేదిక మాత్రమే కాకుండ అందులో ఆధునిక శాస్త్రం కూడా ఉందని ఆయన తెలిపారు.ఆకలి,పోషకాహార లోపాలు, పర్యావరణ క్షీణత వంటి ప్రపంచ సవాళ్ళను పరిష్కరించాలని, అందుకు ప్రకృతి వ్యవసాయం శాశ్వతమైన పరిష్కారమని అయన తెలిపారు.ప్రకృతి వ్యవసాయం వల్ల రైతు ఆరోగ్యంతో పాటు పర్యావరణ ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయని గుర్తించాలని అన్నారు. భారత దేశ నేల మరియు నీటి అత్యవసర పరిస్థితులు, ఆహారంలో పోషక విలువల క్షీణత, నేల జీవశాస్త్రం స్థిరత్వాన్ని పెంపొందించే జీవ ఉత్పెరకాలపై సవివరంగా తెలియజెప్పారు. ఈ సంధర్భంగా ప్రకృతి వ్యవసాయ రైతుల విజయ గాధలను ఉదాహరణలతో ప్రదర్శించారు.
అనంతరం దేశ, ప్రపంచ స్థాయిలో ఆగ్రో ఏకాలజీ పరిస్థితి, పాఠ్యపుస్తకాల్లో ప్రకృతి వ్యవసాయ పాఠాలను పొందుపరచడం, యూనివర్సిటీలతో కలిసి పనిచేయడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సంధర్భంగా వర్క్ షాప్ లో పాల్గొన్న రైతులు ప్రకృతి వ్యవసాయంలో అనుసరిస్తున్న మోడల్స్ ను వివరిస్తూ ప్రకృతి వ్యవసాయం వల్ల కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పి.వి.సత్యనారాయణ, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఆనంద్ శ్యాముల్, సీనియర్ కన్సల్టెంట్ లు డి.వి.రాయుడు, ఋషి, డా. ఎం.మహేశ్వరీ, సీనియర్ రిసెర్చ్ కన్సల్టెంట్, కె.ఎస్.వరప్రసాద్ సీనియర్ థిమాటిక్ లీడ్ లు గోపి చంద్, డా. జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: ANGRU: ఏపీలో ఖరీఫ్ పంటల అంచనా ధరలు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎలా ఉండొచ్చు !