చీడపీడల యాజమాన్యంనేలల పరిరక్షణవార్తలుసేంద్రియ వ్యవసాయం

Home crop – food with nutritional value: ఇంటి పంట – పోషక విలువలతో కూడిన ఆహారం

0
terrace gardening

Home crop – food with nutritional value: ఆరోగ్యమే మహాభాగ్యం. కూరగాయలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.వీటి ద్వారా చాలా రకాల పోషక పదార్ధాలు లభిస్తాయి. అయితే ఇంటి పక్కన డాబాపైన సేంద్రీయ పద్ధతిలో ఎలాంటి రసాయన ఎరువులు, సస్యరక్షణ మందులు, కలుపునాశినులు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల పంటలను పెంచుకుంటే విషతుల్యం కాని తాజా ఆహారాన్ని కొంతవరకు పొందవచ్చు.నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40- 50చ.మీ. స్థలం కావాలి. మన ఆహారంలో అత్యంత అవసరమై పోషకాలైన విటమిన్లు, ఖనిజలవణాలు, పీచు, పిండిపదార్ధాలున్న కూరగాయలు సగటున మనిషికి రోజుకు 300 గ్రాములు, పండ్లు 92గ్రా. ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ 300 గ్రాముల కూరగాయలలో 125గ్రా. ఆకుకూరలు + 100గ్రా.వేరుతో కూడిన కూరగాయలను + 75గ్రా. ఇతర కూరగాయలను తీసుకోవాలి. కాని తీసుకుంటున్నది చాలా తక్కువగా ఉంది. ఇది ఆహార, ఆరోగ్య భద్రతకు సవాలుగా మారింది. ఈ నేపధ్యంలో పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాన్ని, పట్టణాల్లో స్థలాభావాన్ని కూరగాయల ధరలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన తాజా కూరగాయల్ని, ఆకుకూరల్ని, పండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటి పంట దివ్యవరం. అయితే ఇంటి పక్కన, డాబాపైన సేంద్రీయ పద్ధతిలో ఎలాంటి రసాయన ఎరువులు, సస్యరక్షణ మందులు, కలుపునాశినులు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలపంటలను పెంచుకుంటే విషతుల్యం కాని తాజా ఆహారాన్ని కొంతవరకు పొందవచ్చు.

పెరటితోటల పెంపకం:
మొక్కల పెంపకం ఆరోగ్యకరమైన అలవాటు. మనస్సుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మొదట్లో కొంచెం శ్రమపడితే పిన్న వయస్కులకు,పెద్దలకు కూడా అర్ధవంతమైన అలవాటుగా మారుతుంది.పెరటితోటల పెంపకం, డాబాపై మొక్కల పెంపకం వల్ల పల్లెల నుంచి పట్టణాలకు వలస వచ్చిన జనాభాకు సరిపడే పండ్లు, కూరగాయలు పెంచవచ్చు.

కుండీలలో కూరగాయల సాగు:
పట్టణ ప్రాంతాలలో జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువల్ల కూరగాయలను పెంచడానికి భూమి దొరకదు.ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను మన ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50 చ.మీ.స్థలం కావాలి. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సమపాళ్ళలో ఉండాలి. మట్టిలో ఉదజని సూచిక 6-7.5 మధ్య ఉండాలి.

TERRACE GARDENING

పంటల సరళి:
సాధారణంగా అన్ని కూరగాయలని, సుగంధ ద్రవ్యాలను అన్ని పంట కాలాల్లోనూ పెంచుకోవచ్చు.ప్రతి సంవత్సరం మే-జూన్ నుంచి సెప్టెంబర్-అక్టోబర్ వరకు కాకర వంగ,మిరప పంటలు,సెప్టెంబర్-అక్టోబర్ నుంచి డిశంబర్-జనవరి వరకు చిక్కుడు, ఆకుకూరలు, డిశంబర్-జనవరి నుంచి మే-జూన్ వరకు పొట్ల, బెండ పంటలు వేసుకోవాలి.బరువైన మొక్క లేదా అనేక పండిన కాయలతో ఉన్నటమాట మొక్క తేలికగా బరువున్న కుండీతో పెంచితే పడిపోతాయి. సింథటిక్ కంటైనర్లకన్నా కొన్ని సహజ పదార్ధాలతో తయారుచేసినవి ఎక్కువ బరువుగా ఉంటాయి.కాని బంకమన్ను,టెర్రోకొట్టా,పింగాణి కుండీలు సింథటిక్ వాటికన్నా త్వరగా వేడెక్కుతాయి.వాటితోపాటు మట్టి, వేర్లు కూడా వేడెక్కుతాయి.అందువల్ల ఎక్కువ సార్లు నీరు ఇవ్వాల్సి ఉంటుంది.

తొట్టి / ప్లాస్టిక్ సంచులు:
మనకున్న ఖాళీ స్థలాన్ని బట్టి కావలసినంత పొడవు, 9 – 20 అంగుళాల లోతు సిమెంట్ తొట్లు నిర్మించుకొని / ప్లాస్టిక్ సంచులు ఉపయోగించుకొని మట్టి మిశ్రమాన్ని (2 భాగాలు ఎర్రమట్టి + 1 భాగం ఇసుక +1 భాగం కంపోస్టు)తో నింపుకొని పండ్లు, కూరగాయల పంటలను పెంచుకోవచ్చు.పై అంచునుంచి అంగుళం ఖాళీని నీరు పెట్టడానికి వీలుగా వదలాలి.మట్టి కుండీలు కుండీల పక్క నిలువుగా, పైభాగం వెడల్పుగా ఉంటుంది. ఇటువంటి కుండీలలో ఎక్కువ మట్టి,ఎరువుల మిశ్రమాన్ని నింపవచ్చు.మొక్కలను కుండీల నుంచి వేర్లు, మట్టితో సహా తీసి పెద్దకంటైనర్లలో నాటాలి.

ప్లాస్టిక్ కుండీలు:
గుండ్రంగా,చదరంగా ఉన్న ప్లాస్టిక్ కుండీలను ఇంటిలో పెరిగే మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు.ఇవి తేలికగా రంధ్రాలు లేకుండా తిరిగివాడుకోవడానికి అనువుగా ఉండి తక్కువ స్థలంలో నిల్వచేసుకోవడానికి వీలుగా ఉంటాయి.

కుండీలు నింపే పద్ధతి:
తోటల పెంపకంలో మట్టి అతి ముఖ్యమైనది. మంచి మట్టి వాడితే మొక్కలు బాగా పెరిగి పెంపకదార్లకు శ్రమ తగ్గిస్తాయి.మార్కెట్లో అనేక పాటింగ్ మిశ్రమాలు లభిస్తాయి. 3 భాగాల కంపోస్ట్ లేదా కంపోస్టు ఎరువును ఒక భాగం తేలిక బరువున్న పీట్ తో కలిపి పాటింగ్ మిశ్రమాన్నితయారు చేసుకోవచ్చు.నాటే కూరగాయలకు నారు మొక్కలకు లోతు తక్కువ పళ్ళాలను, తొట్లను మట్టి, ఇసుక, కంపోస్ట్(1:1:1) మిశ్రమంతో కలిపి విత్తనాలను చల్లాలి. మట్టి మిశ్రమాన్ని తొట్లు / బారిల్స్/డబ్బలు / బకెట్లు / ప్లాస్టిక్ సంచుల్లో నింపే ముందు వాటి అడుగున నీరుపోయే రంధ్రాన్ని ఏర్పర్చాలి. సాధారణంగా తొట్లకైతే రంధ్రముంటుంది. తొలుత నీరుపోయే రంధ్రాన్ని చిన్నచిన్నపెంకులతో కప్పాలి. తర్వాత నీరుపోయే రంధ్రం గుండా మట్టి మిశ్రమం జారిపోకుండా అదనపు నీరు మాత్రమే బయటకు పోవాలి. ఆ తర్వాత గరుకు ఇసుక పోసి సమం చేయాలి. దానిపై ఒక అంగుళం మందంతో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టుపరిచి దానిపై మట్టి మిశ్రమాన్ని అంచువరకు నింపాలి. ఇంటి మేడపైన మొక్కలు పెంచే కంటైనర్లను ఒక పద్దతిలో ఉంచాలి. నీరు పోయడం, కలుపు తీత అంతరకృషి, కాయ / ఆకు కోతకు అనువుగా మనిషి నడిచేందుకు అనువుగా దారి వదలాలి. మిద్దెపై చుట్టూ ఉండే పెరాపిట్ గోడపై 6,7 అడుగుల దూరంలో ఇనుప చువ్వలు నాటి వాటికి ట్రెల్లీస్ లాగా బైండింగ్ వైర్ అల్లించాలి. వాటిపైకి తీగజాతి కూరగాయల్ని పాకించి, నిలువు స్థలంలోనూ ఫలసాయం పొందవచ్చు. దీనినే “వర్టికల్ హార్వెస్ట్ ఆఫ్ స్పేస్” అంటారు.

అనువైన కూరగాయలు, పండ్ల జాతులు:
ఆకుకూరలు: పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర, పుదీన, చుక్కకూర మొదలైనవి.
దుంప కూరగాయలు: ముల్లంగి, క్యారెట్, ఉల్లిపొరక, ఆలుగడ్డ, అల్లం, బీట్ రూట్ మొదలైనవి.
కోల్ కూరలు: కాలీఫ్లవర్, క్యాబేజి, నూల్కోల్,
కాయకూరలు: టమాట, వంగ, బెండ, కూర మిరప మొదలైనవి.
పండ్ల రకాలు: నిమ్మ, దానిమ్మ, అరటి, అత్తి, సపోట, జామ, ఉసిరి, మామిడి మొదలైనవి.

నారు పెంపకంలో మెళకువలు:
చాలావరకు కూరగాయలు నారుపెంచి నాటుకోవాలి. వీటిని మొదట చిన్ననారుమడిలో పెంచి పెరిగిన నారు మొక్కల్ని నాటాలి. టమాట, వంగ, కాప్సికం, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి చిన్న,మధ్యస్థ సైజు గింజలున్న వాటిని తప్పనిసరిగా నారు పెంచి నాటుకోవాలి.పెద్దగింజలున్నబెండ, తీగజాతి,చిక్కుడు జాతి కూరగాయల్లో నేరుగా విత్తనాలు నాటుకోవచ్చు.నారుపెంచి నాటే పంటలకు మొదట విత్తనాన్ని ట్రేలు,ప్లాస్టిక్ ట్రేలు లేదా పళ్ళాల్లో పెంచుకోవాలి.వీటిలో ప్రొట్రేలు నారు పెంచడానికి చాలా అనువుగా ఉంటాయి.వాటిలో కొబ్బరిపొట్టు,వర్మికంపోస్టు సమపాళ్ళలో కలిపి నింపి ఒక్కొక్క గుంతలో ఒక విత్తనం పైపైన పూడ్చి నీరందించాలి. ఇలా తయారైన నారు మొక్కలు దృడంగా ఉండి తొందరగా నాటుకుంటాయి.మూడు, నాలుగు వారాల నారు మొక్కల్ని వేరును కదల్చకుండా ముద్దతోపాటు నాటాలి. ఒకే ప్రొట్రేల్లోని గుంతల్లో పలురకాల నారును పెంచుకోవచ్చు.ఒకటి, రెండు ప్రొట్రేలు ఒక ఇంటికి సరిపోతాయి.వీటిని చాలాకాలం నారు పెంపకానికి ఉ పయోగించవచ్చు. ప్లాస్టిక్ ట్రే లేదా పళ్ళాల్లో మట్టి, సేంద్రీయ ఎరువు కలిపిన మిశ్రమం నింపి విత్తుకోవచ్చు.

నీటి యాజమాన్యం:
కంటైనర్లలో పెంచే మొక్కలకు సంవత్సరం పొడవునా నీరివ్వాలి.వేసవిలో మొక్కలకు రోజుకు రెండు సార్లు నీరివ్వాల్సి ఉంటుంది.ఎక్కువ విస్తీర్ణంలో తోటను పెంచేటప్పుడు ఎక్కువైన నీరు మురుగు గొట్టం ద్వారా బయటకు పోయే విధంగా నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుచేసుకోవాలి. క్రమ ప్రకారం కంటైవర్లను పరీక్షిస్తూ వేరు వ్యవస్థ కిక్కిరిసిపోకుండా చూడాలి. సంవత్సరానికొకసారి కుండీలను మార్చాలి.క్రమం తప్పకుండా మొక్కలకు పోషకాలనందించాలి. కంపోస్టు ఎరువుల ద్వారా పోషకాల విడుదలను నియంత్రించవచ్చు. ప్రతి సంవత్సరం కుండీలలోని మట్టిపై కొన్నిసెం.మీ. ఎత్తుగల కంపోస్టును వేయాలి. మొక్కల్లో మంచి పూత రావడానికి మే నుంచి సెప్టెంబర్ వరకు పెంచే ఏక వార్షిక పంటలకు ఎరువులను ద్రవరూపంలో ఇవ్వాలి.

LEGETABLE PRODUCTION

ఎరువుల తయారీ వినియోగం:
మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడులివ్వడానికి సేంద్రీయ ఎరువుతోపాటు రసాయనిక ఎరువులను కూడా వేయాలి.వీటితోపాటు మొక్కకు 100గ్రా.చొప్పున వర్మికంపోస్టు నెలకొకసారి వేయాలి.వర్మికంపోస్ట్ ను రసాయన ఎరువులతో కలిపి వేయరాదు. ఎక్కువ మోతాదులో ఎరువులు వేయడం హానికరం.ఎరువులు వేయగానే మొక్కలకు నీరివ్వాలి.

చీడపీడల బెడద- నివారణ:
పురుగులు, తెగుళ్లు పోకిన మొక్కల్ని వాటి భాగాల్ని కత్తిరించి నాశనం చేయాలి. మొక్కల పెరుగుదల, వాతాపరణ పరిస్థితులను బట్టి కూరగాయల మొక్కలను అనేక పురుగులు,తెగుళ్ళు ఆశిస్తాయి.పెనుబంక, దీపపు పురుగులు మొక్కల తొలి దశలో రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి.4 మి.లీ.వేపనూనె+2మి.లీ. టీపాల్ / సబ్బు ద్రావణం కలిపి పిచికారి చేయాలి. కొన్ని కూరగాయ పంటల్లో పండుఈగ,కాయ తొలుచు పురగులు తీవ్రనష్టాన్ని కలుగజేస్తాయి.పండ్లు, కూరగాయలు ఆశించిన లార్వాలను ఏరి నాశనం చేసి, లీటరు నీటికి 4 మి.లీ. వేపనూనె + 2 మి.లీ. టీపాల్ సబ్బు ద్రావణం కలిపి పిచికారి చేయాలి. వర్షాకాలంలో కూరగాయల మొక్కలను శిలీంధ్రతెగుళ్లు, వైరస్ తెగుళ్ళ అశిస్తాయి.లీటరు నీటికి 2గ్రా.కాప్టాన్ కలిపిన ద్రావణంతో నేలను తడిపి శిలీంధ్రపు తెగుళ్ళను నివారించవచ్చు.వేప, గానుగ,వావిలి,సీతాఫలం, మొక్కల ఆధారిత కషాయాల్ని, నూనెను ఉపయోగించాలి. ట్రైకోడెర్మా లేదా సూడోమోనాస్ లాంటి జీవ శిలీంధ్ర నాశినులు వాడాలి. గోఆధారిత పదార్ధాలను పసుపు, బూడిద లాంటివి సస్యరక్షణలో వాడాలి.

పరికరాలు: హాండ్ పార / షోవెల్, రోజ్ క్యాన్, హ్యాండ్ స్ప్రేయర్, స్ప్రింక్లర్ తో గార్డినింగ్ హౌస్, వెదురుకర్రలు, నారదారాలు.

కషాయాలు ద్రావణాల తయారీ :
5% వేప ద్రావణం:
కావలిసిన పదార్థాలు: వేప గింజలు 5 కి. / వేప పండ్లయితే 10 కిలోలు, సబ్బుపొడి -100 గ్రాములు.నీడలో బాగా ఆరబెట్టిన 5 కిలోల మంచి వేపగింజలను మెత్తగా రుబ్బి పిండి చేయాలి.ఈ వేప పిండిని ఒక గుడ్డ సంచితో కట్టి, 10లీ. నీటిలో 12 గంటలు నానబెట్టాలి. తర్వాత మూటను నీటిలో ముంచి పట్టుకొని, 20 నిమిషాల పాటు కషాయాన్ని పిండాలి. ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోసి 100గ్రా. రంగులేని సబ్బుపొడిని కలపాలి.
ఈ వేప కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి, ఒక ఎకరా పొలంలో సాయంత్రం వేళ పిచికారి చేయాలి.అన్ని రకాల పంటల్లోనూ వాడవచ్చు.సబ్బు పొడికి బదులుగా కుంకుడుకాయ, శీకాయ పొడి 600 గ్రా.వాడవచ్చు.ఈ ద్రావణం ముఖ్యంగా శనగ పచ్చపురుగు,లద్దెపురుగు చిన్నలార్వాదశలు, రసం పీల్చుపురుగు అన్ని దశలు నివారించవచ్చు.

NEEM OIL PREPARATION

పచ్చిమిర్చి- వెల్లుల్లి ద్రావణం:
కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి- 3 కిలోలు, వెల్లుల్లి-1/2 కిలో, కిరోసిన్-250 మి.లీ.,సబ్బుపొడి – 100గ్రా.,అర కిలో వెల్లుల్లి పాయలను పొట్టుతీసి, బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్ లో ఒక రాత్రంతా నాన బెట్టాలి. 3 కిలోల పచ్చిమిరప కాయలను కాడలు తీసి, మెత్తగా నూరి,10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా బాగా నానబెట్టాలి. మరునాడు వెల్లుల్లి, పచ్చిమిర్చి ద్రావణాన్ని వేరువేరుగా ఒక పలుచని గుడ్డతో వడపోయాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి ద్రావణం మరియు 100 గ్రా.సబ్బుపొడి ద్రావణం మూడింటినీ బాగా కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఒక ఎకరా పొలంలో సాయంకాలం పిచికారి చేయాలి.ఈ ద్రావణాన్నివంట కాలంలో 1- 2 సార్లు మాత్రమే వాడాలి. గాలికి ఎదురుగా పిచికారి చేయకూడదు. ఒంటిపై గుడ్డ తప్పనిసరిగా ధరించాలి.

సీతాఫలం ఆకు కషాయం:
కావాల్సిన పదార్ధాలు: సీతాఫలం ఆకులు 2 కిలోలు, సబ్బుపొడి- 100 గ్రాములు.రెండు కిలోల సీతాఫలం ఆకులను ఒక కుండీలో తీసుకొని, 10 లీ. నీరు కలిపి అరగంట సేపు బాగా ఉడక బెట్టాలి. మధ్య మధ్యలో ద్రావణాన్ని కలుపుతూ ఉండాలి. కషాయాన్ని చల్లార్చి, పలుచని గుడ్డలో వడపోసి 100 గ్రా. సబ్బుపొడి కలపాలి.ఈ కషాయాన్ని 100 లీ. నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారి చేయాలి. ఈ కషాయాన్ని తయారు చేసేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.

పశువుల పేడ, మూత్రం ద్రావణం:
కావాల్సిన పదార్ధాలు: పశువుల పేడ 5 కిలోలు, పశువుల మూత్రం 5 లీటర్లు,సున్నం 150 గ్రాములు. 5 కిలోల పశువుల పేడ, 5 లీ.మూత్రం తీసుకొని 5 లీటర్ల నీటిని కలిపి ఒక తొట్టిలో నిలువ చేయాలి. తొట్టిపై మూత పెట్టి 4 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని మురగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు కర్రతో బాగా కలియబెట్టాలి. 5వ రోజు ఈ మిశ్రమాన్ని వడపోసి, 150గ్రా. సున్నం కలపాలి. ఈ ద్రావణానికి 100లీ. నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి. ఈ ద్రావణం వాసనకి రెక్కల పురుగులు పంటపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. ఇది తెగుళ్లను కూడా కొంతవరకు నివారిస్తుంది. పంటల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

JEEVAMRUTHAM

పాటించాల్సిన మెళకువలు:
* ఇంటి మేడ / మిద్దెలపై పంటలు పెంచేవారు దిగువ అంశాలపై జాగ్రత్త పడాలి.
ఇంజనీర్ ని సంప్రదించి ఇంటి కప్పు భరించే బరువును బట్టి పెంచే మొక్కలను ప్లాన్ చేయాలి.
* ఇంటికప్పును పెయింట్, షిల్పాలిన్ షీట్లతో వాటర్ ప్రూఫ్ చేయాలి.
* పెద్ద తొట్లు, బ్యారెల్స్ ను బీమ్ లేదా పిల్లర్లకు దగ్గరగా పెట్టి వాటిలో తేలికగా ఉండే వర్మికంపోస్టు, కొబ్బరి పొట్టు లేదా వేరుశనగ, వరి పొట్టు శాతం అధికంగా ఉండే సేంద్రీయ ఎరువులను వాడాలి.
* మురుగు నీరు పోయే సౌకర్యం కల్పిస్తేనే మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి.ఇంటివారు బయటకు పోవాల్సివస్తే మొక్కలకు నీరిచ్చే ఏర్పాటు చేసి వెళ్ళాలి. ఈ మధ్య నీటిని బాగా పీల్చుకొనే తేమను నిధానంగా అందించే ఫాలిమర్స్
వచ్చాయి. అవి కొంత మేలు చేస్తాయి.
* వయోజనులకు అనుకూలంగా ఇంటిపై బల్లలు, బెంచీలు ఉంచి వాటిపై మొక్కలు పెంచవచ్చు.

డా. ఇ. కరుణశ్రీ, డా. వి.దీప్తి,డా. వై.ఎస్.ఆర్.ఉద్యాన వర్శిటీ,వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్:9866777777

ALSO READ: Organic Vegetable Garden: తక్కువ స్థలంలో ఇంట్లోనే ఆర్గానిక్ కూరగాయ పంటలు.!

Leave Your Comments

Cultivation of green manures in Alkali lands.:చౌడు భూముల్లో పచ్చిరొట్ట సాగు… అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు

Previous article

Groundnut variety released from Tirupati: తిరుపతి నుంచి విడుదలైన కొత్త వేరుశనగ రకం

Next article

You may also like