Rabi Groundnut cultivation in scientific method:
డా.ఇ.రజనీకాంత్, డా.ఎ.సాయినాథ్, డా.డి.శ్రీలత, డా.డి.ఎ.రజనీదేవి,డా.ఎన్. బలరాం, బి. శ్రీలక్ష్మి, డా.డి. పద్మజ, డా.జి. శ్రీనివాస్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస, జగిత్యాల
నూనెగింజ పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ఈ పంటను తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి (రబి) లో సాగుచేస్తారు. ఉత్తర తెలంగాణ మండలంలో యాసంగిలో అక్టోబర్ రెండో పక్షం నుంచి నవంబర్ రెండో పక్షం వరకు, దక్షిణ తెలంగాణ మండలంలో సెప్టెంబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ రెండో పక్షం వరకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ పంటను ప్రధానంగా యాసంగిలో నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, వికారాబాద్, మహబూబాబాద్, సూర్యపేట, నల్గొండ జిల్లాల్లో అధికంగా సాగుచేస్తారు. అనువైన నేలలు: తేలికపాటి, నీరు నిలబడని, మురుగు నీరు నిల్వకుండా గాలి బాగా ప్రసరించే ఎర్ర చల్కా, ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం.నేల ఉదజని సూచిక 6.0-7.5 మధ్య ఉన్న నేలలు వేరుశనగ సాగుకి అనుకూలమైనవి.
రకాల ఎంపిక: ఆయా ప్రాంతాలకు అనుకూలమైన, అందుబాటులో ఉన్న మేలైన రకాలు ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి యాసంగిలో నీటి వసతి కింద కదిరి-6, కదిరి-9, టి.ఎ.జి-24, ఐ.సి.జి.వి 91114, ధరణి, కదిరి హరితాంధ్ర, కదిరి 1812 (లేపాక్షి) రకాలు అనువైనవి.
విత్తన మోతాదు: గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. రబీలో 60-80 కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది.
విత్తన శుద్ధి: విత్తే ముందు విత్తనశుద్ధి చేయాలి. ఒక కిలో విత్తనానికి 1 గ్రాము టెబ్యూకొనజోల్ చొప్పున కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. వేరుపురుగు సమస్య ఉన్న నేలల్లో విత్తేటప్పుడు కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్, కాండం కుళ్ళు, వేరుకుళ్ళు ఆశించే ప్రాంతాల్లో 1 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్ ను 7 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి. కొత్తగా వేరుశనగ వేసే ప్రాంతాల్లో 200 గ్రా. రైజోబియం కల్చర్ ను ఒక ఎకరాకి సరిపడే విత్తనానికి పట్టించాలి. వేరుకుళ్ళు, కాండంకుళ్ళు ఆశించే నేలల్లో కిలో విత్తనాకి 10గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేస్తే కుళ్ళు తెగులు రాకుండా చేయవచ్చు.
విత్తేదూరం: గుత్తి రకాలను 22.5 x 10 సెం.మీ. దూరంలో, పెద్ద గుత్తి రకాలను 30 x 10 సెం.మీ. దూరంలో నేలలో సరైన తేమ ఉన్నపుడు విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం: భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదు నిర్ణయించుకోవాలి. ఆఖరి దుక్కిలో 3-4 టన్నులు బాగా చీకిన పశువుల పేడను ఒక ఎకరాకి వేయాలి.100 కిలోల సూపర్ ఫాస్పేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్,18 కిలోల యూరియాను విత్తే సమయంలో వేయాలి. తర్వాత పైపాటుగా 9 కిలోల యూరియాను పంట 30 రోజుల దశలో వేయాలి. అలాగే 200 కిలోల జిప్సంను వేరుశనగ పూత దశలో (35-40 రోజుల దశలో) ఒక ఎకరాకి వేసి అంతరకృషి చేయాలి. అలాగే పైరుపై జింక్, ఐరన్ సూక్ష్మధాతు లోపాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. దీని వల్ల పంట దిగుబడి తగ్గే వీలుంటుంది. ఒక వేళ పైరుపై జింక్ లోపం వచ్చినట్లయితే మొక్క చిన్నగా మారి,గిడసబారి పోతుంది. దీని నివారణకు ఒక ఎకరానికి 400గ్రా. జింక్ సల్ఫేట్ ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. అలాగే ఐరన్ (ఇనుపధాతు లోపం) వచ్చినట్లయితే లేత ఆకులు పసుపు రంగులో మారి తర్వాత తెల్లగా మారుతాయి.ఈ లోప నివారణకు ఒక కిలో అన్నభేది మరియు 200 గ్రా. సిట్రిక్ ఆమ్లాలను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
కలుపు యాజమాన్యం: వేరుశనగ విత్తిన 1 లేదా 2 రోజుల్లో కలుపు రాకుండా నివారించడానికి ఒక ఎకరాకు ఒక లీటరు పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరు శనగ 20-24 రోజుల దశలో మళ్ళీ కలుపు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక వేళ గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే ఎకరాకి 400 మి.లీ క్విజలోఫాప్ పి ఇథైల్ మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదా ఆక్సిఫ్లోర్ ఫెన్ 170-340 మి.లీ. ఒక ఎకరాకి పిచికారి చేయాలి. ఒకవేళ వెడల్పాకు, గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే కలుపు 2-3 ఆకుల దశలో ఇమజితాపిర్ 10% మందు ఎకరాకి 300మి.లీ. లేదా ఇమజామాక్స్ 35% + ఇమజితాపిర్ 35% డబ్ల్యూ.జి. 40 గ్రా.చొప్పున ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఈ గడ్డి మందులు పిచికారి చేసేటప్పుడు నేలలో సరైన తేమ ఉండేలా చూసుకోవాలి.
నీటి యాజమాన్యం: రబీ వేరుశనగ సాగుకు నీటి తడుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఊడలు దిగే దశ నుంచి కాయ అభివృద్ధి చెందే దశ వరకు నీటి ఎద్దడి, బెట్ట పరిస్థితులు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. తేలికపాటి నేలల్లో 6-8 తడులు అనగా విత్తే సమయంలో, మొలిచిన 20-25 రోజులకి, ఆ తర్వాత 7-10 రోజుల వ్యవధిలో 5 – 6 తడులివ్వాలి.
సస్యరక్షణ చర్యలు:
వేరుపురుగు: ఈ పురుగులు ‘సి’ ఆకారంలో ఉండి వేరుశనగ మొక్క వేర్లను ఆశిస్తాయి. పురుగు ఆశించిన మొక్కలు వాడిపోయి, ఎండి చనిపోతాయి. దీని నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. క్లోరిపైరిఫాస్ తో విత్తనశుద్ధి చేయాలి. పురుగు ఆశించిన పొలంలో ఎకరాకి 6 కిలోల ఫోరేట్ 10% గుళికలు ఇసుకలో కలిపి చల్లాలి.
ఆకుముడుత పురుగు: పంట విత్తిన 15 రోజుల నుంచి ఆశించి రెండు, మూడు ఆకులను గూడు చేసుకొని ఆకుల్లోని పచ్చదనాన్నితినేయడం వల్ల ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 500 మి.లీ.లేదా అసిఫేట్ 300 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
లద్దె పురుగు: దీని తల్లి పురుగు లేత గోధుమ రంగులో ఆకులపైన గుంపులుగా గుడ్లు పెడుతుంది. పిల్ల పురుగు పచ్చదనాన్ని గొకి తీనేసి ఆకుల్ని జల్లడగా మార్చుతుంది. దీని నివారణకు ఎకరాకి 200 మి.లీ. నొవల్యూరాన్ లేదా ఫ్లూబెండమైడ్ 40 మి.లీ.చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారి చేయాలి. విషపు ఎర (వరి తవుడు 5 కిలోలు + బెల్లం అరకిలో + మోనోక్రోటోఫాస్ 500 మి.లీ.) ఎకరా పొలంలో సాయంత్రం వేళ చల్లాలి. ఒక ఎకరాకి 4- 5 లింగాకర్షక బుట్టలు అమర్చి మగ రెక్కల పురుగులను చంపివేయాలి.
తామర పురుగులు: తామర పురుగులు పంటను ఆశిస్తే ఆకుల అడుగు భాగాన గోధుమ, ఇనుము రంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం కుళ్ళు, మొవ్వ కుళ్ళు వైరస్ తెగులున్న పరిస్థితుల్లో వీటి ఉధృతి ఎక్కువవుతుంది. దీని నివారణకి మోనోక్రోటోఫాస్ 320మి.లీ. + వేప నూనె 1 లీటరు + ఒక కిలో సబ్బు పొడిలను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకి పిచికారీ చేయాలి. థయోమిథాక్సామ్ 100 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పచ్చ దీపపు పురుగులు: ఈ పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకుకొన భాగంలో ‘వి’ ఆకారంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. దీని నివారణకు కూడా తామర పురుగులకు చేపట్టే నివారణ చర్యలు వర్తిస్తాయి.
తెగుళ్ల నివారణ:
తిక్క ఆకుమచ్చ తెగులు: పైరు 30 రోజల దశలో ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగుళ్లలో ఆకుల పైభాగాన ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళలో మచ్చలు ఆకు అడుగుభాగాన నల్లని రంగులో ఉంటాయి. ఈ మచ్చలు తర్వాత ఆకుల కాడల మీద, కాండం, ఊడల మీద కూడా కనిపిస్తాయి. దీని నివారణకు 1 గ్రాము టెబ్యూకొనజోల్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. క్లోరాంట్రానిలిప్రోల్ 400 గ్రా. లేదా టెబ్యూకొనజోల్ 200 మి.లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారి చేయాలి.
కాండం కుళ్ళు తెగులు: ఈ తెగులు వల్ల నేలపై ఉన్నకాండంపై తెల్లటి బూజు తెరలు, తెరలుగా ఏర్పడుతుంది. మొక్కలను గట్టిగా లాగినపుడు మొక్క పైభాగం మాత్రమే ఊడివస్తుంది. కాయలు కూడ కుళ్ళిపోతాయి. దీని నివారణకు 1 గ్రాము టెబ్యూకొనజోల్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. తెగులు సోకిన మొక్కలు బాగా తడిచేలా 2 మి.లీ. హెక్సాకొనజోల్ చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.పైన తెలిపిన యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో పాటించినట్లయితే యాసంగిలో వేరుశనగలో ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.
ALSO READ:Groundnut: ఎత్తుమడుల పద్దతిలో వేరుశెనగ సాగుచేస్తే అధిక దిగుబడి !