Lurking tobacco borer threat to crops in flooded areas:
డా. ఎస్.వి.ఎస్. గోపాలస్వామి, డా. ఎ. డయానా గ్రేస్
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, లాo, గుంటూరు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో పలుచోట్ల వాగులు, కాల్వలు, నదీ పరీవాహక ప్రాంతాలకు పక్కన ఉన్న పంట పొలాలన్నీ నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కృష్ణానదికి ఇరువైపులా తీర ప్రాంతంలో పండించే వరి, మినుము, పెసర, పలు కూరగాయలు, లంక భూముల్లో పండించే అరటి, కంద, పసుపు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే తర్వాత కాలంలో తక్కువ కాలపరిమితి కలిగిన మినుము, పెసర, చిరుధాన్యాలు లేదా కూరగాయలు లేదా రబీ పంటలను ముందస్తుగా వేసుకునే ఆస్కారం ఉంది. ఇటువంటి పరిస్ధితుల్లో పలు పంటలను ఆశించి నష్టపరిచే పొగాకు లద్దె పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి.
పొగాకు లద్దె పురుగు చేసే నష్టం :
దీని తల్లి పురుగుల ముందు రెక్కలు ముదురు గోధుమ వర్ణంలో ఉండి, వెండి పూతలాంటి తెల్లటి అలల వలె గీతలు కలిగి ఉంటాయి. వెనుక రెక్కలు తెల్లగా, అంచులు గోధుమ రంగులో ఉంటాయి. తల్లి పురుగు ఆకు అడుగు భాగంలో సుమారు 100 నుంచి 300 వరకు గుడ్లను సముదాయాలుగా పెట్టి గోధుమ రంగు రోమాలతో కప్పుతుంది. గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు మొదట ఆకుపచ్చరంగులో ఉండి పెరుగుతున్న కొద్దీ ముదురు గోధుమ రంగులోకి మారతాయి. మెడ మీద ప్రస్ఫుటంగా కన్పించే నల్లని మచ్చలతో, శరీరం పక్కల వెంబడి సన్నని లేత రంగు గీతలుంటాయి. పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా ఉండి ఈనెల మధ్య ఆకుపచ్చని పదార్ధాన్ని గీకి తినడం వల్ల ఆకులు జల్లెడలాగా మారుతాయి. పురుగులు ఎదిగిన కొద్దీ ఆకులను చిన్న చిన్న రంధ్రాలు చేసి తినడమే కాక లేత కొమ్మలను కూడా కొట్టివేస్తాయి. పువ్వులు, కాయలను నాశనం చేస్తాయి. లద్దె పురుగులు పగటివేళల్లో మట్టి పెడ్డల కింద, పగుళ్ళలో దాగి ఉండి, రాత్రివేళల్లో పైరుకి నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి అధిక సంఖ్యలో ఉన్నట్లయితే ఒక పొలంలో పైరుని పూర్తిగా నష్టపరిచి, ఆహారం కోసం పక్క పొలానికి గుంపులుగా వలస వెళతాయి. బాగా ఎదిగిన లార్వా దాదాపు 5 సెం.మీ. పొడవు ఉంటుంది. ఇది నేలలో గాని, ఎండిరాలిన ఆకుల మధ్యలో కోశస్ధ దశకు చేరుకుంటుంది. వాతావరణ పరిస్ధితులు, తినే ఆహారంపై ఆధారపడి 30 నుంచి 50 రోజుల్లో దీని జీవిత చక్రం పూర్తవుతుంది. సంవత్సర కాలంలో సుమారు 7 లేదా 8 తరాలు పూర్తి చేసుకుంటుంది.
వరద తాకిడి తర్వాత…
వరద తాకిడికి పంటలన్నీ నాశనం కాగా, వరద నీరంతా పోయిన తర్వాత ఉన్న తేమతో విత్తిన మినుము, పెసర, మొక్కజొన్న వంటి పైర్లను లద్దె పురుగు ఆశించి నష్టపరుస్తుంది. ఇవి కాక వరద ప్రాంతాల్లో కొత్తగా మిరప, టొమాటో, కాలిప్లవర్, క్యాబేజి వంటి కూరగాయ పంటలతో పాటు అపరాలు, మొక్కజొన్న, పొగాకు పంటలను వేస్తున్నారు. ఈ పంటలన్నీ పొగాకు లద్దె పురుగుకు ఇష్టమైన పైర్లు. వరద నీటికి పంట మొక్కలన్నీ కుళ్ళిపోయి, ఎండిపోగా, పలు పంటలను ఆశించే లద్దె పురుగు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మినుము, పెసర, మొక్కజొన్న లేత పైర్లపై అభివృద్ధి చెందుతుంది. అంతేకాక ఖరిఫ్ పంటలన్నీ పక్వానికి వచ్చిన దశలో పొగాకు లద్దె పురుగు రబీ పంటల వైపు మళ్ళి ప్రధాన సమస్యగా పరిణమించడం సాధారణమే. అయితే ప్రస్తుతం అపరాలు, మొక్కజొన్న పంటల్లో, బీడు భూముల్లో ఉన్న పిచ్చి బెండ వంటి కలుపు మొక్కలపై పెరిగిన లద్దె పురుగుల కోశస్ధదశల నుంచి వెలువడే రెక్కల పురుగులు రబీ పంటలను ఆశించి తీవ్రస్ధాయిలో నష్టం కలుగజేసే ప్రమాదం పొంచి ఉంది.
సమగ్ర నివారణ పద్ధతులు:
- నేలను లోతుగా దున్నినట్లయితే పురుగు కోశస్ధదశలను పక్షులు ఏరుకొని తింటాయి లేదా ఎండ వేడిమికి చనిపోతాయి.
- ఎకరాకు 50 ఆముదం మొక్కలు పెంచినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి (ఆకర్షకపంటగా) ఉపయోగపడతాయి. ఆకు అడుగుభాగాన గుడ్ల సముదాయాన్ని గమనించి నాశనం చేయాలి. ఆముదం ఆకు వెడల్పుగా ఉండటం వల్ల గుడ్ల నుంచి పిల్ల పురుగులు వెలువడిన తర్వాత 4-5 రోజులు ఒకే ఆకుమీద ఉంటాయి. కాబట్టి వాటిని జల్లెడ ఆకులతో పాటు తీసి నాశనం చేయడం తేలిక. ఆముదం విత్తనం మొలకెత్తటానికి ఆలస్యమవుతుంది కాబట్టి ప్రధాన పంటకు (ముఖ్యంగా వాణిజ్యపంటలు) 10-15 రోజులు ముందుగా విత్తుకోవటం మంచిది.
- గట్లపై, బీడు భూముల్లో కలుపు నివారణ చేపట్టాలి.
- ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టి పురుగు ఉనికిని, ఉధృతిని గమనించి, అవసరమైనపుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లింగాకర్షక ఎరలను 20-25 రోజులకొకసారి మార్చాలి.
- వేషకషాయం 5 శాతo పిచికారీ చెసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లను పెట్టడానికి సంకోచిస్తాయి. లార్వాలు సరిగా ఆహారం తీసుకోలేక వాటిలో సరైన ఎదుగుదల ఉండదు.
- పైరు మొక్కలపై ఉన్న గుడ్ల సముదాయాలను, పిల్ల పురుగు సమూహాలను గుర్తించి ఏరి నాశనం చేయాలి.
- పొగాకు లద్దె పురుగుకు సoబంధిoచిన న్యూక్లియర్ పాలి హైడ్రోసిన్ వైరస్ (ఎన్.పి.వి.) ద్రావణం, 500 గ్రా. బెల్లం, 100 మి.లీ. శాoడోవిట్ లేదా టీపాల్ కలిపి సాయంత్రం సమయములో పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
- బాసిల్లస్ తురింజియెన్సిస్ (బి.టి.) ఆధారిత మందులను ఎకరాకు 400 గ్రా. లేదా 400 మి.లీ. పిచికారీ చేయాలి. శీతల వాతావరణంలో ఎన్.పి.వి., బి.టి. ఆధారిత మందులు సమర్థంగా పనిచేస్తాయి.
- తొలిదశ లర్వాలు ఉన్నప్పుడు పెరుగుదలను నియత్రించే నోవాల్యూరాన్ మందు ఒక మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- అవసరాన్ని బట్టి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా క్వినాల్ ఫాస్ 2 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి చల్లాలి.
- మధ్యస్ధ దశలో ఉన్న లార్వాల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ప్రొఫెనొఫాస్ 2 మి.లీ లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మి.లీ.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
- లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సాకార్బ్ 1 మి.లీ లేదా నోవాల్యురాన్ 1 మి.లీ లేదా లుఫెన్యురాన్ 1 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- బాగా ఎదిగిన పురుగుల నివారణకు విషపు ఎరను ఉపయోగించాలి. దీనికోసం 10 కిలోల తవుడు, 1000 మి.లీ. క్లోరిపైరిఫాస్, ఒక కిలో బెల్లంతో తగినంత నీటికి కలిపి చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంత్రం వేళల్లో చేలో సమానంగా ఉంచితే నెర్రెల్లో దాగిఉన్న పురుగులు రాత్రి వేళల్లో బయటకు వచ్చి తిని చనిపోతాయి.
- ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. పక్క పొలాల నుంచి వలసలు నియంత్రించటానికి చేను చుట్టూ కందకం సాలును తవ్వి ఏదైనా పొడిమందును చల్లాలి.
గతంలో అనేక మార్లు వరదల తర్వాత పొగాకు లద్దె పురుగు ఉధృతమవటం రైతులకు అనుభవమే. కాబట్టి పలు పంటలను ఆశించే పొగాకు లద్దెపురుగు స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని నివారణకు చేపట్టాల్సిన చర్యలను రైతులు అవగాహన చేసుకొని సమగ్రంగా నివారణ చర్యలు చేపడితే నష్టాలను అరికట్టవచ్చు.