ANGRU:గుంటూరు లాం ఫారంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృష్ణ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30 న విశ్వవిద్యాలయ పరిధిలోని విస్తరణ విభాగం ఆధ్వర్యంలో “రబీ పంటలకు సన్నద్ధం” అనే అంశంపై ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయు ఉపకులపతి డా. ఆర్. శారద జయలక్ష్మి దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ సమస్యలను తట్టుకునే రబీ పంటల రకాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, విశ్వవిద్యాలయంలో సోయాబీన్ పంటపై పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, జీవన ఎరువులు, జీవ నియంత్రణపై రైతుల్లో అవగాహన కల్పించి రసాయనాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
- ప్రస్తుత ఖరీఫ్ పంటకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల చాలా ప్రాంతాల్లో అనేక పంటలకు నష్టం వాటిల్లిందని, రానున్న రబీ పంట కాలంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి పెంచే దిశగా శాస్త్రవేత్తలు ప్రణాళికలు తయారు చేయాలని, విశ్వవిద్యాలయం విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చే రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాల్సిన అవసరం, పంటల సాంద్రత, పంటల వైవిధ్యం అనే అంశాలపై దృష్టి సారించి రైతుల ఆదాయం పెంచే విధంగా కృషి చేయాలని పరిశోదనా సంచాలకులు డా.పి.వి. సత్యనారాయణ తెలిపారు.
- విస్తరణ సంచాలకులు డా. జి. శివ నారాయణ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న వ్యవసాయ సమాచారాన్ని సేకరించి, వాటి నుంచి పరిశోదని, విస్తరణ, అవగాహనకు కావాల్సిన విషయాలను గుర్తించి తదనుగుణంగా రైతు నికర ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించి విశ్వవిద్యాలయం ముందుకెళ్లడం ద్వారా రైతులకు మరింత చేరువవుతుందని తెలియజేశారు.
- ఈ కార్యక్రమానికి అనుభవజ్ఞులుగా ఆచార్య రంగా వర్శిటీ మాజీ విస్తరణ సంచాలకులు డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ హాజరై అపరాలలో అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి తెలియజేశారు.
- లాం ఫారం మాజీ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. బి.రోశయ్య పత్తిలో గులాబి రంగు పురుగు యాజమాన్యం, పురుగు మందుల పిచికారీలో డ్రోన్ల ప్రాముఖ్యత తెలియజేస్తూ, శనగ పండించే ప్రాంతాల్లో ఖరీప్ పంట కాలంలో అపరాలు లేదా పశుగ్రాసాల పంటలు వేసుకోవడం వల్ల రైతుల నికరాదాయాన్ని, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఉన్న అవకాశాన్ని వివరించారు.
ALSO READ: ANGRU: ఏపీలో ఖరీఫ్ పంటల అంచనా ధరలు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎలా ఉండొచ్చు !
- హైదరాబాదులోని జాతీయ వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఆర్. మహేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆరుతడి వరి సాగులో మెలకువలు, ఈ పద్ధతి వల్ల ఉపయోగాలను తెలియజేయగా, జాతీయ నూనె గింజల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. జి. సురేష్ నూనెగింజ పంటల్లో మేలైన రకాలు, సాగులో మెలకువలు తెలియజేశారు.
- ఆచార్య ఎన్.జి. రంగా వర్శిటీ పరిధిలోని ఆరు వ్యవసాయ వాతావరణ మండలాలనుంచి హాజరైన పరిశోధన సహా సంచాలకులు(ఏడీఆర్ లు) వారి జోన్ల పరిధిలో ఖరీఫ్ పంటల పరిస్థితి, రబీ పంట కాలంలో ఏయే పంటలు పండించడానికి అవకాశాలున్నాయి, మేలైన రకాలు, విత్తనాల లభ్యత, వివిధ సమస్యలకు పరిష్కారాలు తెలియజేశారు. తర్వాత వరి, అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, చెరకు మొదలగు పటల్లో పంటల ప్రధాన శాస్త్రవేత్తలు రాష్ట్రస్థాయిలో ఈ పంటల స్థితిగతులు, రబీలో మంచి దిగుబడులు సాధించడానికి ఉన్న అవకాశాలను, తీసుకోవాల్సిన చర్యలను వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి విస్తరణ, పరిశోధన శాస్త్రవేత్తలు, వివిధ పరిశోధన క్షేత్రాల, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.