Rain floods: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరి పైర్లు గింజ గట్టిపడే దశలో, మరికొన్ని చోట్ల చిరుపొట్ట నుంచి బిర్రు పొట్టదశల్లో ఉన్నాయి. జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారం తుకం పోసిన వరి పొలాల్లో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగుల రెక్కల పురుగుల ఉధృతి గమనించడం జరిగింది. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్నపి.జె.టి.ఎస్.ఏ.యు. పరిధిలోని వివిధ పరిశోధన స్థానాల్లో అమర్చిన దీపపు ఎరలను గమనించిన సమాచారం మేరకు ఈ రెండు పురుగుల ఉధృతి రాబోయే వారం నుంచి పదిరోజుల్లో పెరిగే సూచనలున్నందున వాటి ఉధృతిని గమనిస్తూ, నివారణ చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా. పి. రఘురామి రెడ్డి సూచిస్తున్నారు.
పురుగుల ఉధృతిపై నిఘా:
దీపపు ఎరలను లేదా లింగాకర్షక బుట్టలను అమర్చి పైపురుగుల ఉధృతిపై నిఘా పెట్టాలి. చ.మీ.కు ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం లేదా వారానికి బుట్టకు 25-30 కాండం తొలిచే పురుగు రెక్కల పురుగులు లేదా దుబ్బుకు మూడు ఆకుముడత ఆశించిన ఆకులు, వాటిలో లార్వాలు గమనిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
నివారణ చర్యలు:
కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగుల నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్ పి 400గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 మి.లీ. ఎకరాకు పిచికారి చేయాలి. తెల్లకంకి ఆశించిన తర్వాత పురుగుమందులు వాడే కంటే, ప్రస్తుత దశలో ఉధృతిని గమనించి, వారం నుంచి 10 రోజుల్లో సస్యరక్షణ చేపట్టవచ్చు.
ఈనిక దశలోని వరి పైర్లలో:
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈనిక దశలో ఉన్న వరి పైర్లలో కాటుక, గింజమచ్చ తెగులు ఉధృతమయ్యే అవకాశాలున్నాయి. వీటి నివారణకు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే టెబ్యుకొనజోల్ + ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ మిశ్రమ మందు 80 గ్రా. లేదా పీకాక్సీస్ట్రోబిన్ + ట్రైసైక్లజోల్ మిశ్రమ మందు 400 మి.లీ. లేదా ప్రొపికొనజోల్ 200 మి.లీ. చొప్పున ఎకరాకు పిచికారి చెయ్యాలి.
డా. పి. రఘురామి రెడ్డి,పరిశోధనా సంచాలకులు, పి.జె.టి.ఎస్.ఏ.యు.,రాజేంద్రనగర్, హైదరాబాద్.