COTTON: అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసిన పత్తిలో ముఖ్యంగా అధిక వర్షాలవల్ల శాఖీయదశ పొడగించబడుతుంది. ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల శాఖీయ కొమ్మలు ఎక్కువగా పెరిగి పూత, కాయనిచ్చే కొమ్మలు తక్కువగా వస్తాయి.తద్వారా దిగుబడి తగ్గుతుంది. పత్తిలో ఈ సమస్యను అధిగమించేందుకు మొక్కలు శాఖీయంగా ఎక్కువగా ఎదగకుండా పెరుగుదలను నియంత్రించేందుకు క్లోరోమెపిక్వాట్ క్లోరైడ్ (50 శాతం ఎస్.ఎల్) హార్మోన్ మందును 40-45 రోజుల వంట వయస్సులో మొదటి దఫాగా 1 మి.లీ.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే రెండవ దఫాలో 55-65 రోజుల వంట దశలో 1.2 మి.లీ.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి మూడవ దఫాగా ఇదే మోతాదులో చేతి పంపుతో మొక్కలు సమానంగా తడిచేటట్లు పిచికారి చేయాలి. ఈ పిచికారీ వల్ల పత్తి మొక్కల్లో కాండం పైన కణుపుల మధ్య దూరం గణనీయంగా తగ్గి మొక్క ఎత్తు పెరగకుండా నియంత్రించబడుతుంది. మొక్కలు ఏపుగా కాకుండా గుబురుగా పెరుగుతాయి. కాయనిచ్చే కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది.
పంట త్వరగా, ఒకేసారి కోతకు వస్తుంది. దీనివల్ల రెండోపంట వేసుకునేందుకు అవకాశముంటుంది. పత్తిలో శాఖీయ పెరుగుదలను నియంత్రిస్తే అధిక పూత, కాత వల్ల సుమారు 40 శాతం వరకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ఈ హార్మోను పిచికారి చేసే ముందు నేలలో నీటి ఎద్దడి లేకుండా తగినంత తేమ ఉండేలా జాగ్రత్త పడాలి. ఎట్టి పరిస్థితుల్లోను సిఫారసుకు మించిన మోతాదులో పిచికారి చేయరాదు. చీడపీడలు,పోషకలోపాల సమస్య,అధిక బెట్ట పరిస్థితుల వల్ల పూత, లేత కాయ అధికంగా రాలుతుంటే ఈ పెరుగుదల నియంత్రణ మందులు పిచికారి చేయరాదు. ఈ నియంత్రణ మందుల్లో కలుపు నివారణ, కీటక నాశనులను కలవకూడదు.
ALSO READ:Insects in Cotton Crop: పత్తి పంటలో రసం పీల్చు పురుగుల సమస్య – నివారణ