Advice to farmers cultivating rainfed crops: వర్షాధార పంటలు సాగుచేస్తున్న రైతులు ప్రస్తుతం ఆ పంటల పరిస్థితి, వాటిలో కలుపునివారణ, ఎరువుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..వగైరా అంశాలపై అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఇలా తెలియజేస్తున్నారు.
> ప్రస్తుతం ఖాళీగా ఉన్న పొలాల్లో రైతులు ప్రత్యామ్నయ పంటగా ఉలవ ((పి.డి.ఎం -1, వి.జెడ్.ఎం -1 ,పి.హెచ్.జి.-6 , పి.హెచ్.జి.-62 రకాలు) సాగుచేసుకోవచ్చు.
> ప్రస్తుతం వేరుశనగ పంట పూత దశ నుంచి కాయ అబివృద్ది దశలో ఉంటుంది. పూత దశలో ఉన్న వేరుశనగ పంటలో అంతరకృషి చేసుకోవాలి. అలాగే గరిష్ట పూత దశ లేదా 30 -35 రోజుల దశ పంటలో ఎకరాకు 200 కిలోల జిప్సం ఎరువును మొక్కల మొదళ్ళలో వేసి కలియబెట్టాలి.
> ప్రస్తుతo పత్తి పంట పూత దశ నుంచి కాయ అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుతo అందుబాటులో ఉన్న తేమను ఉపయోగించుకొని ఎకరాకు 10 కిలోల చొప్పున నత్రజని,పోటాష్ ఎరువులను పంట విత్తిన తర్వాత 30 , 60 , 90 రోజుల దశలో వేసుకోవాలి. పత్తిలో మెగ్నీషియం లోపాన్ని సవరించడానికి 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ చొప్పున లీటరు నీటికి కలిపి 45 , 75 రోజులలో పిచికారి చేయాలి.
> ప్రస్తుతం మొక్కజొన్న పంట శాకీయ దశ నుంచి గింజ ఏర్పడే దశలో ఉంది. రైతులు మొక్కజొన్న పంటలో కలుపు నివారణ చేసుకోవాలి అలాగే మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోసుకోవాలి. నత్రజని ఎరువును 30-35 రోజులకు, 50-55 రోజుల మద్యలో పైపాటుగా వేసుకోవాలి.
> ప్రస్తుతం చిరుదాన్యాల పంటలు శాకీయ దశ నుంచి గింజ ఏర్పడే దశలో ఉన్నాయి. నేలలో ఉన్న తేమను వినియోగించుకుని రైతులు రాగి వంటి చిరుధాన్యాల పంటల్లో పైపాటుగా నత్రజని (యూరియా 10 నుంచి15 కిలోలు) ఎరువును వేసుకోవాలి.
> అరటి , చీని తోటల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని కలుపు నివారణ చేసుకోవాలి. మోతాదు మేరకు పశువుల ఎరువు, పైపాటుగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు చీని తోటల్లో అకుముడత ఆశించడానికి అనుకూలం. దీని నివారణకు ప్రోఫెనోఫాస్ 2 మీ.లీ లేదా ఇమిడక్లోప్రిడ్ 0.5 మి.లీ చొప్పున ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రైతులు వాతావరణ పరిస్థితులను గమనించి పిచికారి పనులు చేసుకోవాలి.
Also Read:Maize Major Problems In Summer: ప్రస్తుత యాసంగి మొక్కజొన్న లో ప్రధాన సమస్యలు – యాజమాన్యం