Paddy Cultivation in Saline soils: ఈ సంవత్సరం ఆశించిన వర్షాలు కురియడం వల్ల నీటి పారుదల సౌకర్యం పెరిగి వరిసాగు ఊపందుకుంది. దీంతో రైతులు రెండు, మూడు సంవత్సరాల నుంచి సాగులో లేని చౌడు భూములను కూడా వరిసాగుకు సిద్ధం చేస్తున్నారు.ఈ నేలల్లో వరిసాగు చేస్తే పైరు సక్రమంగా పెరగక, ఎర్రబడి,పెరుగుదల లోపించి దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని చౌడు నేలల్లో వరి పండించాలనుకునే రైతులు కొన్ని మెలకువలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు.
1. చౌడు భూముల్లో నీరు ఇంకే స్వభావం తక్కువ కాబట్టి పాలం చుట్టూ మురుగు నీరు పోయే సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి.
2. పచ్చి రొట్ట పైర్లు అయిన జనుము, జీలుగ, వెంపలిని చౌడు భూముల్లో పెంచి పూత సనుయంలో కలియదున్నాలి. వీటిని పెంచే అవకాశం లేని చోట కంపోస్టు లేదా పశువుల ఎరువు వేయాలి.
3. భూమిని ఎక్కువగా దమ్ము చేయకూడదు. ఎక్కువ సార్లు దమ్ము చేసినట్లయితే పొలం బుడగెత్తి మొక్కలు సరిగా నిలదొక్కుకోలేవు.
4 చౌడును తట్టుకొనే వంగడాలైన వికాస్, సి.ఎస్.ఆర్.13, వేదగిరి, దీప్తి, కో-45, స్వర్ణముఖి, ఎం.టి.యు.1001. ఎం.టి.యు.1061 రకాలను సాగుకు ఎంచుకువాలి.
5. చౌడు భూముల్లో మొలక సరిగా రాదు. కనుక విత్తనాన్ని మోతాదు కన్నా ఎక్కువగా అంటే ఎకరాకు 35 కిలోల విత్తనం నారుమడిలో చల్లాలి. లేత నారుకు చౌడును తట్టుకొనే శక్తి ఉండదు. అందువల్ల 30-35 రోజుల ముదురు నారును నాటాలి. దగ్గర, దగ్గరగా కుదురుకు నాలుగైదు మొక్కలు నాటాలి.
6. భూసార పరీక్షలు చేయించి అవసరమైన మేరకు జిప్సం వేసుకోవాలి. సాధారణంగా ఉదజని సూచిక 8.6 నుంచి 9.0 మధ్య ఉంటే ఎకరాకు 1.5 టన్నుల జిప్సంను వాడాలి. ఉదజని సూచిక 9.0 నుండి 9.5 మధ్య ఉంటే ఎకరాకు 3 టన్నుల వరకు జిప్సం వాడాలి. మొత్తం జిప్సంను ఒకేసారి దమ్ములో వేసి నీరు పెట్టి, వారం రోజులు నీరు నిలకట్టి మురుగు కాల్వల ద్వారా నీరు బయటకు తీసి కొత్త నీరు పెట్టాలి.
7. నత్రజనిని యూరియా లేదా అమ్మోనియం సల్ఫేట్ రూపంలో, భాస్వరాన్ని సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వల్ల కాల్షియం మరియు గంధకం కూడా అంది చౌడు విరగడానికి అవకాశముంటుంది.
8. వరి పంటకు పూత దశలో లవణాల వల్ల ఎక్కువ హాని కలుగుతుంది. ఈ దశలో పాలంలోనే ఎక్కువ నీరు పెట్టి తీసివేస్తూ, మరల కొత్త నీరు పెట్టాలి.
9. చెరకు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ పదార్థాలుగా మిగిలే ప్రెస్ మడ్ ను జిప్సంకు బదులుగా వాడుకోవచ్చు.హెక్టారుకు 2 నుంచి 3 టన్నుల ఫిల్టరు మడ్డిని వేయాలి
10. చౌడు భూముల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎకరాకు 20-40 కిలోల జింక్ సల్ఫేట్ ను దమ్ములో వేసుకోవాలి.పైపాటుగా పైరుపై జింకు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 గ్రా. చొప్పున జింకు సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.ఈ నేలల్లో ఇనుప ధాతు లోపం పంట పొలంలోనూ, నారుమడి లోనూ కనిపిస్తుంది. నారుమడిలో ఇనుప ధాతు లోపం నివారణ కోసం లీటరు నీటికి 5 గ్రాముల ఫెరస్ సర్ఫేట్ కు నిమ్మరసంను కలిపి పిచికారీ చేయాలి.
సూచించిన ఈ మెలకువలను పాటిస్తే సమస్యాత్మక చౌడు నేలల్లోను వరిని సాగు చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.
డా.టి. ప్రభాకర్ రెడ్డి, కె. జ్ఞానేశ్వర్ నారాయణ, కె. రామకృష్ణ డా.ఓ. శైల, ఆర్. రఘువరణ్ సింగ్, ఎం. రాజేష్ కుమార్, డా. ఆదిశంకర్, డా. రాజశేఖర, ఇ. జ్యోత్స్న, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం, నాగర్ కర్నూల్ జిల్లా