రైతులువార్తలు

Methods To Increase Soil Carbon: నేలలో కర్బన ప్రతిక్షేపణ నిల్వలు పెంచే పద్ధతులు`ఆవశ్యకత

0
Methods To Increase Soil Carbon
Soil Carbon

Methods To Increase Soil Carbon: కర్బన ప్రతిక్షేపణం అనగా వాతావరణంలో వెలువడిన హానికరమైన కర్బనాన్ని నేలలోకి నింపి నేల యొక్క సామర్ధ్యాన్ని పెంచే ప్రక్రియను కర్బన ప్రతిక్షేపణం అంటారు. మారుతున్న వాతావరణ పరిస్ధితుల వల్ల సమశీతోష్ణ మరియు ఉష్ణ మండలాల ప్రాంతాలలో అసమాన ఉష్ణోగ్రతల వల్ల నేలలో సేంద్రియ పదార్ధం అధికంగా కుళ్ళి, నేలలో సేంద్రియ కర్బన నిల్వలు తగ్గు ముఖం పడుతున్నవి. తేమ ఎక్కువగా ప్రాంతాలలో అధిక వర్షపాతం వల్ల నేల కోతకు గురై ఎక్కువ ఖనిజ లవణాలతో పాటు సేంద్రియ పదార్ధం కొట్టుకుపోయి కర్బన నిల్వలు క్షీణించిపోతున్నాయి. ఎడతెరపిగా వరి పంటను పండిరచడం వల్ల మిధేన్‌ వాయువు వెలువడి నేలలో కర్బన నిల్వలు తగ్గి హరిత గృహ ప్రభావానికి కారణం అవుతుంది. ఈ విధంగా నేలలో కర్బన పదార్ధ నిల్వలు తగ్గడం వలన నేలలో అనేక రకమైన అవాంఛనీయ మార్పులు జరిగి అన్నిరకాల నేలలో సూక్ష్మజీవుల జీవక్రియలు తగ్గి స్థూల మరియు సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గి పోతుంది. అంతేకాక మట్టి కణాలు విచ్చిన్నమై నేల కోతకు గురి అవుతుంది. వాణిజ్య వ్యవసాయం, సేంద్రియ ఎరువుల కొరత, అధిక ధరలు, అధికంగా రసాయన ఎరువుల వాడకం, అడవుల నరికి వేయడం, నేలకోత, పంట వ్యర్ధాలను కాల్చడం, పరిశ్రమల కర్బన ఉద్గారాల వల్ల రోజు రోజుకీ నేలలో కర్బన ప్రతిక్షేపణ నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనితో పాటు ఎక్కువ ఉత్పత్తి రావాలనే ఉద్దేశ్యంతో అధిక ఎరువుల వాడుక, ఎక్కువ నేలను సేద్యానికి తేవాలనే కారణంతో అటవీభూములు, గడ్డి భూములను తగలబెట్టడం వల్ల నేలలో కర్బన నిల్వలు గణనీయంగా (0.5% కంటే తక్కువ) తగ్గి నేలసారం, ఉత్పాదకత తగ్గి పంట దిగుబడులు తగ్గుతాయి. ఈ విధంగా నేలలో కర్బన నిల్వలు తగ్గిపోతుంటే మరొక వైపు పట్టణీకరణ కర్మాగారాలు సాంప్రదాయక శిలాజ ఇంధనాల వాడుక వల్ల బొగ్గుపులుసు వాయువు విస్తారంగా పెరిగి పర్యావరణంలో అనేక మార్పులకు కారణం అవుతుంది. వాతావరణంలో వెలువడిన బొగ్గు పులుసు వాయువు తగ్గించి నేలలలో కర్బన నిల్వల పెంచే ఉత్తమ మార్గమే కర్బన ప్రతిక్షేపణం.

కర్బన ప్రతిక్షేపణ ప్రక్రియను తెలియజేసే చిత్రము

Methods To Increase Soil Carbon

Soil Carbon

కర్బన ప్రతిక్షేపణ వలన ఒనగూరే లాభాలు :-

. కర్బన ప్రతిక్షేపణం చేయటం వల్ల వాతావరణంలో బొగ్గు పులుసు వాయువులను తగ్గించి నేలలో కర్బన నిల్వలు పెంచవచ్చు.
. నేలలో మట్టి కణాల మధ్య కలయిక పెంచి నేల కోత తగ్గించి నేల ఆకృతి స్దిర పరుస్తుంది.
. నేలలో స్థూల సాంద్రతను తగ్గించి గుల్లబరిచి మొక్కలు సులభంగా పెరగడానికి కావలసిన అనుకూల పరిస్ధితిని సమకూర్చును.
. నేలలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచి పంటల కీలక దశలో నీటిని అందించుటకు తోడ్పడుతుంది.
. నేలలో ఉష్ణోగ్రతలో వచ్చే హెచ్చు తగ్గులను క్రమబద్ధీకరించటంలో ముఖ్య పాత్ర వహించును.
. నేలలో హానికరమైన భారీ లోహాలను వడపోసి నేలల ఆరోగ్యాన్ని కాపాడును.
. నేలలో లభ్యమయ్యే వివిధ పోషకాలను ఒడిసిపెట్టి మొక్కలకు అందించేలా చేసి పోషకాల నిల్వలో ముఖ్య పాత్ర వహించును.
. నేలలో సూక్ష్మజీవులు పెరిగి పోషకాల స్థిరీకరణ మరియు పోషకాల విడుదలలో ముఖ్యపాత్ర వహించును.
. నేల రసాయన ధర్మాలైనా క్షారపూర్ణత, ధన అయాన్‌ మారక సామర్ధ్యం, బఫరింగ్‌ కెపాసిటీలను పెంచుతుంది.
. నేలలో ఉదజని సూచికలో వచ్చే మార్పులను క్రమబద్ధీకరించుటలో కీలక పాత్ర వహిస్తుంది.
. కర్బన ప్రతిక్షేపణ నిల్వ విలువలు నేలలో పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యత పెరిగి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి హరిత గృహవాయువుల విడుదలను తగ్గించవచ్చు.

నేలలో కర్బన ప్రతిక్షేపణ నిల్వలు పెంచే యాజమాన్య పద్దతులు :

. వాతావరణంలో బొగ్గు పులుసు అవశేషాలు తగ్గించి నేలలో కర్బన ప్రతిక్షేపణం పెంచడానికి అడవులను పెంచాలి.
. సాంప్రదాయ శిలాజ ఇంధనాల వాడుకను తగ్గించి జీవ ఇంధనాలను ఉపయోగించాలి.
. స్థూల (పశువుల ఎరువు, వానపాముల ఎరువు, కోళ్ళ ఎరువు) మరియు గాఢ సేంద్రియ (కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేప పిండి, ఆముదపు పిండి, రక్తాహారం, ఎముకల పొడి) ఎరువుల వాడకాన్ని పెంచాలి.
. పంట కోత అనంతర మిగిలిన వ్యర్ధాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలి. నేలను ఎక్కువగా దున్నే ప్రక్రియని తగ్గించటం ద్వారా సేంద్రియ పదార్ధ ఆక్సీకరణాన్ని తగ్గించి కర్బన ప్రతిక్షేపణ నిల్వలు పెంచవచ్చు.
. పంట సరళిలో మార్పు తీసుకువచ్చి పప్పు జాతి పంటలతో మార్పిడి చేయడం వలన కర్బన మరియు నత్రజని స్థిరీకరణ జరిగి కర్బన ప్రతిక్షేపణ నిల్వలు పెరుగును.
. పచ్చి రొట్ట ఎరువులు (జీలుగ, వెంపలి, తంగేడు, అలసంద, పిల్లిపెసర, మినప) మరియు హరిత ఆకుల ఎరువులను (వేప, కానుగ, జిల్లేడు) పెంచి పూత సమయంలో నేలలో కలియ దున్నుట వలన కర్బన ప్రతిక్షేపణ నిల్వలు పెంచవచ్చు.
. నేల పరీక్షలు చేసి వాటి ఫలితాలను బట్టి సమగ్ర పోషక యాజమాన్య పద్దతులు పాటించి సమపాళ్లలో సేంద్రియ మరియు రసాయన ఎరువులు వాడటం వల్ల నేలలో ఉదజని సూచికలో మార్పులు తగ్గించి కర్బన నిల్వలు పెంచవచ్చు.
. పిల్లిపెసర, అలసంద, పెసర వంటి పంటలను పీలిక సాగు (కవర్‌ క్రాప్‌) చేయటం వల్ల నేల కోతను నివారించి కర్బన నిల్వల వృధాను తగ్గించవచ్చు.
. బంజరు భూములను సాగులోకి తీసుకురావడం, జీవన ఎరువుల వాడకం, బయోచార్‌ ప్రక్రియ ద్వారా నేలలో కర్బనాన్ని పునరుత్పత్తిని మెరుగుపరుచవచ్చు.
. ఆచ్ఛాదనం (మల్చింగ్‌) చేయడం వల్ల నేలలో నీరు మరియు ఉష్టోగ్రత మార్పులను తగ్గించి కర్బన నిల్వల సామర్ధ్యాన్ని పెంచవచ్చు.
. వ్యర్ధ పదార్ధాలు చివికే ప్రక్రియను వేగం చేసే జీవ సంగ్రహాలను వాడటం ద్వారా కర్బనాన్ని నేలలోకి ఇంకింపచేయవచ్చు.
. నేలలో జిగట పదార్ధ స్దాయి పెంచటం, సరిjైున అయిన నీటి యాజమాన్య పద్దతులు పాటించడం ద్వారా కర్బన వృధాను తగ్గించవచ్చు.
. సామాజిక మరియు అగ్రోఫారెస్ట్‌ విధానాలను గ్రామీణ ప్రాంతాలలో విస్తరింపచేయుట వలన నేలలో కర్బన నిల్వలు పెంచవచ్చు.
. అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయాన్ని నియంత్రించటం, బొగ్గు ఆధారిత విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించి పునరుత్పత్తి శక్తి వనరులు (సౌరశక్తి, పవన శక్తి) వాడటం వల్ల వాతావరణంలో బొగ్గుపులుసు వాయువుని తగ్గించి నేలలో కర్బన నిల్వలు పెంచవచ్చు.

చివరి మాట : పై యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల నేలలో కర్బన నిల్వలు పెంచి నేల యొక్క సారం మరియు ఉత్పాదకత అభివృద్ది పరచటంతో పాటు వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి వాతావరణం కాలుష్యాన్ని తగ్గించి రేపటి తరాలకు సుస్థిరమైన మంచి ఫలవంతమైన నేలలను పర్యావరణాన్ని అందించవచ్చు.

టి. రాజశేఖర్‌, సి.హెచ్‌. సీతారామలక్ష్మి, ఎస్‌.వి.ఎస్‌. గోపాలస్వామి, ఎ. శీరిష, పి. వి. కె. జగన్నాధరావు
వ్యవసాయ పాలిటెక్నిక్‌, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం అనకాపల్లి

Leave Your Comments

Scabies Control Methods In Lemon Orchards: నిమ్మ తోటల్లో గజ్జితెగులు అరికట్టే పద్ధతులు

Previous article

Cattle Diseases During Rainy Season: వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధులు- నివారణ చర్యలు

Next article

You may also like