Rabi Crops: రాష్ట్రంలో రబీ మరియు వేసవులు ఎక్కువగా వేరుశనగ, నువ్వులు, అపరాలు వంటి పంటలను సాగు చేస్తున్నారు. రసం పీల్చే పురుగులైన పచ్చ దోమ, తామర పురుగులు, పేను బంక మొదలగు వాటి వలన దిగుబడును గణనీయంగా తగ్గటంతో పాటు రైతులు ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయి. ఈ పురుగులు ప్రత్యక్షంగా నష్టం కలుగజేయడమే కాక పరోక్షంగా వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కారణం అవుతున్నాయి.
ఈ వైరస్ తెగుళ్ల ఉనికి ఉధృతిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వలన మరియు ఇవి మొక్కల మధ్య త్వరగా వ్యాప్తి చెందడం వలన పంటలను కోల్పోతున్నారు. వైరస్ తెగుళ్ళు గురించి వీటిని వ్యాప్తి చేసే కీటకాలను నివారించడం వలన పంటల్లో వైరస్ తెగుళ్ళను నియంత్రించవచ్చు.
పల్లాకు తెగులు (పెసర, మినుము) :
పెసర, మినుములో ఈ తెగులు జెమినీ వైరస్ వల్ల కలుగుతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కలతో ఆకులు పసుపు మరియు ఆకుపచ్చ రంగులోకి మారతాయి. తెగులు ఆశించిన మొక్కలు ఆలస్యంగా మొగ్గ తొడిగి పూత, కాత తక్కువగా ఉండును.
నివారణ :
. పల్లాకు తెగులును తట్టుకునే రకాలైన ఎల్ జి జి 46.0, ఎల్ జి జి 787 రకాలను సాగు చేయాలి.
. తెల్ల దోమలను ఆకర్షించడానికి ఎకరాకు 15 నుండి 20 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చాలి.
. తెల్ల దోమ నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎసిటామిప్రిడ్ 0.3 గ్రాములు లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
(పెసర, మినుము) ఆకు మడత, మొవ్వుకుళ్ళు తెగులు :
తామర పురుగుల వలన ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకులు అడుగుభాగంలోని ఈనెలు రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి.
నివారణ :
. పేను బంక నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 30 శాతం ఇసి 2 మి.లీ. లేక మోనోక్రోటోఫాస్ 36% ఎస్ ఎల్ 1.6 మి. లీటర్లు కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి. తెగులు సోకని మొక్కల నుంచి విత్తనాన్ని సేకరించి వాడాలి.
(వేరుశనగ) మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు :
మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు ఆశిస్తే మొక్కలు కురచబడి ఎక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి మొవ్వు ఎండిపోతుంది. తెగులు ఆశించిన మొక్కల్లో కాయలు సరిగ్గా ఏర్పడవు. తామర పురుగులు ఈ తెగులును వ్యాప్తి చేస్తాయి.
నివారణ :
పంట చుట్టూ నాలుగు వరుసల జొన్న విత్తనాలు పెట్టుకోవడం ద్వారా తామర పురుగుల వ్యాప్తిని నిరోధించడం వలన తెగులును కొంతవరకు అరికట్టవచ్చు. ఈ సమస్య ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి రెండు మిల్లీ లీటర్లు ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేయాలి. పైరుపై ఈ తెగులును నివారించడానికి థైయోమిధాక్సామ్ 100 గ్రాములు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
(వేరుశనగ) కాండం కుళ్ళు వైరస్ తెగులు :
లేత ఆకులపై, ఆకుల ఈనెలపై నల్లటి మాడిన మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఈ మచ్చలు కాండంకు విస్తరిస్తాయి. మొవ్వు ఎండిపోయి తెగులు సోకిన మొక్కల్లో కాయలు సరిగా ఏర్పడవు. తామర పురుగులు ఈ తెగులును కూడా వ్యాప్తి చేస్తాయి. పైరు చుట్టూ వయ్యారిభామ కలుపు ఎక్కువగా ఉంటే ఈ తెగులు త్వరగా వస్తుంది.
నివారణ :
ఒక కిలో విత్తనానికి ఒక మి.లీ.ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్ఎస్ను 7 మి.లీ. నీటిలో కలిపి విత్తనశుద్ధి చేయాలి. 80 మి.ల్లీ ఇమిడాక్లోప్రిడ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
(నువ్వులు) వెర్రితెగులు :
ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటల్లో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు మొక్కలు ఎదుగుదల తగ్గి పైభాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రి తల మాదిరిగా ఉంటుంది ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
నివారణ :
తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి. పైరుపై ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి దీపపు పురుగులను అరికట్టాలి.
(పొద్దు తిరుగుడు) నెక్రోసిన్ తెగులు :
ఆకుల మధ్య ఈనె ఎండిపోయి నలుపు రంగుకు మారుతుంది. క్రమంగా కాండంకు వ్యాపిస్తుంది. ఆకులు సరిగా పెరగక గిడస బారిపోతాయి. పువ్వు సరిగా విచ్చుకోక మెలిక తిరిగి వంకరగా మారుతాయి. తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. గట్ల మీద పార్ధీనియం మొక్కలు ఉండటం ద్వారా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
నివారణ :
. విత్తన శుద్ధి చేయాలి.
. పార్ధీనియం కలుపును నివారించాలి.
. ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ. లేదా థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి రెండుసార్లు పిచికారి చేయాలి.
డా.ఎం రాజేంద్రప్రసాద్, డా. కె మదన్మోహన్ రెడ్డి, డా. జి. మంజులత,
డా. పి. మధుకర్ రావు, డా. జి. ఉషారాణి, డా. బి శ్రావణి, డా. ఏ విజయ భాస్కర్ రావు