Rhizobium benefits: మీకు తెలుసా..? పప్పు జాతి పైర్లకు రైజోబియం చేసే మేలు !
లెగ్యూం జాతికి చెందిన కంది, పెసర, మినుము, సెనగ వంటి పప్పు జాతి పైర్లు, వేరుసెనగ, సోయాబీన్ వంటి నూనెగింజల పైర్లకు రైజోబియం కల్చర్ వినియోగిస్తే ఎకరానికి 20 నుంచి 80 కిలోల వరకు నత్రజనిని స్థిరీకరించగలవు. దీనివల్ల 25 నుంచి 30 శాతం దిగుబడి పెరగడమే గాక 16 నుంచి 32 కిలోల వరకు నత్రజని భూమిలో నిలువ ఉండి తర్వాత పైరుకు ఉపయోగపడుతుంది. రైజోబియం వాడకం వల్ల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి.వేర్లపై ఆరోగ్యకరమైన బుడిపలు ఏర్పడి నత్రజనిని స్థిరీకరిస్తాయి.
ఎలా వాడాలి ?
100 మి.లీ.నీటిలో పది గ్రాముల పంచదార లేదా బెల్లము లేదా గంజి పౌడర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి, చల్లార్చాలి. చల్లార్చిన ఈ ద్రావణాన్ని 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని వేసి బాగా కలియబెట్టి విత్తనం చూట్టూ ఒక పొరలా ఏర్పడేలా జాగ్రత్తపడాలి. కల్చర్ పట్టించిన విత్తనాన్ని 10 నిముషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.