Paddy Cultivation: వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం ఆగష్టు 6 మధ్యాహ్నం 1 గంట నుంచి ఆగష్టు 8 ఉదయం 8.30 వరకు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. తరువాత మూడు రోజులు.. ఆగష్టు 8 ఉదయం 8.30 నుంచి ఆగష్టు 11 ఉదయం 8.30 వరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
మొదటి రోజు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో,
రెండవ రోజు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:
* భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలల్లో పొలం నుంచి మురుగు నీటిని తీసివేయాలి.రాబోవు రెండు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలంలో నుంచి మురుగు నీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలి.
* ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.రైతులు చెట్ల కింద నిలబడరాదు.పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు.
* పంట పొలాల్లో మందులను పిచికారి చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి.
* ఇప్పటివరకు వరి నార్లు పోయని రైతాంగం, వర్షాలను సద్వినియోగము చేసుకొని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవాడం వల్ల సమయం,పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు.
* నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాల నారు నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాల్లో, 50రోజుల వయస్సు ఉన్న నారు ఆకు చివరలను తుంచి వేసి కుదురుకు 4 నుంచి 6 మొక్కల చొప్పున నాటువేయాలి.
చరపు మీటరుకు 66 మొక్కలు ఒచ్చేలాగా 15X10 సెం.మీ దూరంలో నాటుకోవాలి.
* నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక (120-125 రోజుల) వరి రకాల నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం.
మధ్యకాలిక రకాల్లో 25 రోజులు, స్వల్పకాలిక రకాల్లో 21 రోజుల వయస్సు ఉన్ననారును నాటు పెట్టుకోవాలి.
పశుపోషణ:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్ళలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం.దీని నివారణకు టీకాలు వేయించాలి.
గొర్రెల్లో చిటుకు,పి.పి.ఆర్ వ్యాధి, ఆవులు,గేదేల్లో గొంతువాపు వ్యాధి సోకటానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి.
గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయాలి.
డా. పి.లీలా రాణి,ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ ) ,
వ్యవసాయ వాతావరణ విభాగం ,రాజేంద్రనగర్