Farmers Loan Waiver Telangana Government: నేడు(జులై 30 న) శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ. లక్ష నుంచి లక్షాయాభై వేల రూపాయల వరకున్న రుణాలను మాఫీ చేయటానికి నిశ్చయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యమున్న అన్ని రైతువేదికలలో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రూ. లక్ష వరకు జరిగిన రుణమాఫీలో సందేహాలున్న రైతులు అక్కడున్న అధికారులు, బ్యాంకర్లతో నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. తదనంతరం రూ. లక్షన్నర వరకు జరిగే రుణమాఫీ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా రైతులకు విజ్ఙప్తి చేశారు.
గత ప్రభుత్వానివన్నీ అసమంజస విధానాలే…
మా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదు అని విమర్శించిన పెద్దలకు, గత ప్రభుత్వం అనుసరించిన అసమంజస విధానాలను గుర్తు చేశారు.గత ప్రభుత్వం”ప్రతీ సంవత్సరం ఒక కొత్త విధానంతో రైతాంగాన్ని ఆందోళనలోకి నెట్టేది.ఒక సంవత్సరం పత్తి వద్దు అన్నారు. రైతులు వారి మాటలు నమ్మి కంది పంట వేస్తే కందులు కొనే నాధుడే లేరు.మరో సంవత్సరం పంట కాలనీలు అని ఊక దంపుడు ఉపన్యాసాలిచ్చారు. తర్వాత దాని ఉసే లేదు. వరి వేస్తే ఉరి అన్నారు ఆ మాట నమ్మి మొక్కజొన్నవేస్తే కొనుగోలు సమయానికి మొహం చాటేశారు. సన్నాల వరి సాగు అని సన్నాయి నొక్కులు నొక్కి తీరా మార్కెటింగ్ కి వచ్చేసరికి బోనస్ కాదు కదా మద్దతు ధర కూడా దక్కలేదు. ఇంకా రుణమాఫీ 2014 కానీ 2018 కానీ అసలు రుణ మాఫీ పథకాలు కాకుండా, అవి వడ్డీ మాఫీ పథకాలుగా ప్రతీ రైతు చెప్తాడు.మొదటి సారి నాలుగు విడతలుగా, రెండవ సారి 5 వ సంవత్సరంలో కొద్దిమందికి ఇవ్వడం వల్ల రైతులకు కేవలం వడ్డీనే మాఫీ అయిందన్న విషయం వారికి కూడా తెలుసు” అని మంత్రి తుమ్మల దుయ్యబట్టారు.
మాది చేతల ప్రభుత్వం:
తమది చేతల ప్రభుత్వమని, ఇప్పటికే రుణమాఫీలో రూ. లక్షన్నర వరకు పూర్తి చేసుకొన్నామని, రానున్న నెలలో 2 లక్షలవరకు కూడా మాఫీ చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా రైతుభరోసాకు, పంటలభీమాకు, రైతు కూలీలకు కూడా బడ్జెట్ నిధులు కేటాయింపు చేసుకున్నామని, రైతులను అన్ని పంటలు పండించేలా ప్రొత్సహిస్తామని, అన్ని పంటలకు మద్ధతుధర కల్పించేందుకు తమ ప్రభుత్వం ఒక స్పష్టమైన విదానంలో ముందుకెళ్తుందని మంత్రి తెలియచేశారు.