PJTSAU: మానవ మనుగడకి ప్రధాన ఆధారమైన నేలని రక్షించుకోవలసిన బాధ్యత అందరి పైన ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, పరిశోధన సంచాలకులు డా.పి.రఘురామి రెడ్డి అభిప్రాయపడ్డారు. సహజ వనరుల విచక్షణారహిత వాడకాన్ని తగ్గిస్తూ,నేలసారం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. భావితరాలకు కాలుష్యరహిత వనరులను అందిస్తూ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో నెలకొన్న స్తబ్దతని అధిగమించాలని రఘురామిరెడ్డి సూచించారు. దీర్ఘకాలిక ఎరువుల విధానం, జీవన ఎరువులు, దీర్ఘకాలిక ఎరువుల యాజమాన్యం, సూక్ష్మ పోషకాలు, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల సిఫార్సు విధానం అంశాలపై పరిశోధనలు సాగిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు, చత్తీస్ ఘడ్ రాష్ట్ర అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టుల పరిశోధన ప్రగతిని సమీక్షించడానికి ఉద్దేశించిన సదస్సు జులై 30 నుంచి ఆగష్టు 1 వరకు మూడు రోజులపాటు రాజేంద్రనగర్ లోని విస్తరణ విద్యాసంస్థలో జరిగింది. ఈ సదస్సులో పరిశోధన సంచాలకులు పి. రఘురామి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
జమ్ములోని షేర్ – ఇ – కాశ్మీర్ (యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ టెక్నాలజీ) వ్యవసాయ విశ్వవిద్యాలయం, మాజీ ఉపకులపతి డా.పి.కె.శర్మ చైర్మన్ గా ఏర్పాటైన ఎనిమిది మంది సభ్యుల బృందం భారత మృత్తికా శాస్త్ర సంస్థ, భోపాల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో ఐదు అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టుల సమన్వయకర్తలు డా.ఎస్. శ్రీవాత్సవ, డా. ఎస్.కె. బెహరా, డా.ఆర్.హెచ్.వంజరి, డా.ఎస్. మహంతి, డా.ఎ.కె. బిశ్వాస్ లతోపాటు దక్షిణ తెలంగాణ మండలం ఏడీఆర్ డా.ఎం.మల్లా రెడ్డి, శాస్త్రవేత్తలు…డా.ఎ.మాధవి, డా.కె.పవన్ చంద్రా రెడ్డి, డా.ఎం.శంకరయ్య, డా.టి.సుకృత్ కుమార్ లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మృత్తికా యాజమాన్య సంస్థ, రాజేంద్రనగర్, దీర్ఘకాలిక ఎరువుల యాజమాన్య విభాగం, వ్యవసాయ పరిశోధన స్థానం, జగిత్యాల వారు రూపొందించిన ప్రచురణల్ని విడుదల చేశారు.