పంటల్లో పక్షుల బెడద అంతా,ఇంతా కాదు. పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటారు.ఐతే వేపగింజల కషాయం తో వీటి సమస్యను కొంత వరకు అధిగమించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.ఈ వేపగింజల కాషాయం ఎలా తయారు చేసి వాడుకోవాలో చూద్దాం.
వేపగింజల కషాయం తయారీకి ముందుగా వేపగింజలను సేకరించి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి.బాగా ఎండిన గింజలపై పొట్టును వేరు చేసి గింజలను తిరిగి ఒకరోజు ఎండబెట్టుకోవాలి. తరువాత ఈ గింజలను బాగా పొడిగా చేసి తడిలేని డబ్బాలలో పోసి నిల్వ ఉంచుకోవాలి.వేప కషాయం పిచికారి చేయడానికి ముందు రోజు ఈ గింజల పొడిని ఒక పలుచటి గుడ్డలో కట్టి, ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకొని గింజల పొడి ఉన్న మూటను ఆ నీటిలో మునిగేలా ఒక రాత్రి అంతా ఉంచితే గుడ్డలోని ఆ పొడి నీటిలో నాని చక్కటి కషాయం తయారవుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ మూటను పాత్రలోని నీటిలో గట్టిగా పిండి పిప్పిని వడపోసి కషాయాన్ని తయారుచేసుకోవాలి.
ఇలా తయారు చేసిన వేప గింజల కషాయాన్ని లీటరు నీటికి 20 మి.లీ.చొప్పున కలిపి పంటలపై పిచికారి చేయాలి. వేపగింజల కాషాయం పిచికారీ ద్వారా వారం నుంచి పది రోజుల వరకు పక్షులు పంటను నష్టపరచకుండా కాపాడవచ్చు.ఈ కాషాయం పిచికారీ వల్ల పక్షులు గింజలను తినడానికి ఇష్టపడవు.ఫలితంగా పక్షుల బారి నుంచి పంటలను సమర్థంగా కాపాడుకోవచ్చు.