3.5 ఎకరాల్లో ఆదాయాన్ని ఇచ్చే 15 రకాల పండ్ల చెట్ల అడవిని సృష్టించిన గుంటూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ రసాయన మందులు వాడకుండా పాలేకర్ విధానంలో 2 సంవత్సరాల క్రితం ఉద్యాన వనం మొదలు పెట్టాడు. 15 రకాల పండ్ల మొక్కలకు, బావి త్రవ్వించటానికి ఆరంభ దశలో 2.5 లక్షల పెట్టుబడి అయింది. 3.5 ఎకరాలల్లో 1500 అరటి మొక్కలు, పసుపు 15 కిలోలు ఏడాది క్రితం వెయ్యగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. బొప్పాయి గత సంవత్సరం వెయ్యగా ఇప్పుడు చెట్టు 60 కాయలు కాశాయి. 180 కొబ్బరి మొక్కలు, జమ మొక్కలు, కంద, ఉసిరి, పనస, మారేడు, సీతాఫలాలు, కమలా చెట్లు, తులసి మొక్కలు ఇంకా కూరగాయ మొక్కలు మరియు పశుగ్రాసాలు వేశారు. మొక్కలకు నీటి కోసం నీటి కుంట త్రవ్వించి దాని నుంచి బిందు సేద్య విధానంలో నీటిని మొక్కలకు పెడుతున్నారు. ఇంకా కందకాలు ఏర్పాటు చేశారు. కందకాల వలన ఏరియేషన్ బాగా జరుగుతుంది. కర్బన శాతం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటలను సాగు చేస్తున్నాడు రైతు నాగేశ్వరరావు.