insect-proof bags for storing grain? :
బియ్యం, పిండి,పప్పులు, ఇతర ధాన్యాలను పురుగు పట్టకుండా ఇంట్లో నిల్వచేసుకోవడం చాల కష్టంగా ఉందని తరచుగా వింటుంటాం.రైతులు కూడా తమ ఉత్పత్తులను పురుగు పట్టకుండా నిల్వచేసుకునేందుకు ఎన్నో తంటాలు పడుతుంటారు.ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని హెర్మెటిక్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు.
ఈ బ్యాగుల్లో పప్పు దినుసులు,బియ్యం,రాగులు,జొన్నలు,గోధుమల వంటివి పురుగు పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు.రెండు,మూడు పొరలతో ఉండే ఈ బ్యాగుల్లో ఎటువంటి పురుగు పట్టకుండా సంవత్సరం పాటు ధాన్యం, పప్పుదినుసులు చెడిపోకుండా ఉంటాయి. తేమ శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది. గోనెసంచిలా ఉండే ఈ బ్యాగు లోపలికి ఎటువంటి గాలి,తేమ పోకుండా రెండు లేదా మూడు పొరలతో ఉంటుంది. పైపొరను పాలిప్రొపెలిన్ తో,లోపలి పొరలను పాలిథీన్ తో చేస్తారు.
ఒకసారి కొనుగోలు చేసిన ఈ సంచిని నాలుగైదు సంవత్సరాలపాటు వాడుకోవచ్చు. వివిధ పరిమాణాలలో అంటే … 5 కిలోల నుంచి 50 కిలోల సైజు వరకు ఈ బ్యాగులు లభ్యమవుతాయి.వీటి ఖరీదు సైజును బట్టి సుమారు రూ. 150/- నుంచి 300/- దాకా ఉంటుంది.ఈ సంచుల్లో విత్తనాలు సంవత్సరం నిల్వ ఉంచిన తర్వాత కూడా 75 శాతం విత్తనాలు మొలకెత్తుతాయి.అందువల్ల రైతులు తాము నిల్వ చేసే ధాన్యాలకు,విత్తనాలకు పురుగు పట్టకుండా ఈ సంచులు ఎంతో ఉపయోగపడుతాయని ఆశించుదాం.