వార్తలు

వేస్ట్ డీకంపోజర్ పొడి.. 20 రూపాయలకే

0

రైతులు స్వయంగా తయారు చేసుకుంటున్న జీవామృతం వంటి సహజ ఎరువుల వాడకం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడమే కాదు నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఇలా పండించిన పంటలకు మార్కెట్ లోనూ ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ పరంపరలో మరో ఒరవడిని అందిపుచ్చుకున్నారు కృష్ణా జిల్లా దివిసీమ రైతులు శాస్త్రీయంగా తయారు చేసిన “వేస్ట్ డీకంపోజర్ ” వాడకంతో తక్కువ ఖర్చుతో పంటకు ఎరువులు అందించగలుగుతున్నారు. అన్ని ప్రాంతాల రైతులు అందిపుచ్చుకోగల ఈ శాస్త్రీయ విధానాన్ని తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం ( ఎన్ సీవోఎఫ్) డైరెక్టర్ డాక్టర్ క్రిషన్ చంద్ర 11 ఏళ్ల పాటు పరిశోధించి 2015లో “వేస్ట్ డీకంపోజర్” పొడిని ఆవిష్కరించారు. ఆవు పేడ నుంచి 2 – 4 సూక్ష్మజీవులను వేరుచేసి ఈ పదార్థాన్ని కనిపెట్టారు. ఇది వరి, గోధుమ, కంది, పత్తి, ఆకుకూరలు, ఉద్యాన పంటలు పండించే నేలలకు బహుళ పోషక ప్రయోజనకారిగా పనిచేస్తుంది. 2018 నవంబరు 27 నుంచి ఇది ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చింది. 30 మి.లీ. బాటిల్ ధర రూ.20 మాత్రమే. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో తక్కువ సారవంతమైన నేలల్లో ఈ ద్రావణాన్ని వాడాక.. ఎకరం భూమిలో 4 లక్షల వానపాములను గుర్తించినట్లు ఎన్ సీవోఎఫ్ శాస్త్రవేత్త డాక్టర్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. కిచెన్ గార్డెన్, మిద్దెతోట, మరుగుదొడ్లలో, బయోగ్యాస్, గోబర్ గ్యాస్ లోనూ వాడి సత్ఫలితాలు సాధించారు.
200 లీటర్ల ద్రావణంలో 190 లీటర్లు వాడుకొని మిగిలిన 10 లీటర్ల ద్రావణంలో మళ్ళీ 200 లీటర్ల నీరు, 2 కిలోల బెల్లం వేసి కలియదిప్పితే మరో 5 రోజుల్లో ద్రావణం తయారవుతుంది. ఇందులోంచి సాటి రైతులకు 5 లీటర్ల ద్రావణం ఇస్తే ఆ రైతు కూడా ద్రావణం తయారు చేసుకోవచ్చు. దీన్ని ఐదేళ్ల పాటు నిల్వ ఉంచి మళ్ళీ అదే పద్ధతిలో ఉత్పత్తి చేయెచ్చు. వరి, చెరకు వంటి పంటలు కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను తగలబెట్టకుండా, ఎరువుగా మార్చుకునేందుకు వేస్ట్ డీకంపోజర్ ఉపయోగపడుతుంది. సుమారు టన్ను పంట వ్యర్థాలపై 100 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేస్తే 40 రోజుల్లో బాగా కుళ్ళి మంచి ఎరువుగా మారుతుంది.
తయారీ విధానం:
ప్లాస్టిక్ డ్రమ్ము లేదా సిమెంట్ తొట్టెలో 200 లీటర్ల నీళ్లు పోసి అందులో 2 కిలోల బెల్లం వేయాలి. 30 మి. లీ. సీసాలో ఉండే వేస్ట్ డీకంపోజర్ పొడిని చేతితో తాకకుండా డ్రమ్ములో వేయాలి. రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం కర్రతో మాత్రమే కలియదిప్పాలి. ఇందులో 5 రోజుల్లో కోట్లాది సూక్ష్మజీవులు ఉద్భవిస్తాయి. ఈ ద్రావణం మొదట లేత పసుపు రంగులోకి మారుతుంది. దానిపై తెల్లని అట్టులా తెట్టు కడుతుంది. 5 రోజుల్లో పులిసిన వాసన వస్తే “వేస్ట్ డీకంపోజర్ ద్రావణం” తయారైనట్లే. డ్రమ్మును నీడలోనే ఉంచాలి.
మొక్కలు నాటిన 15 రోజుల తర్వాత ద్రావణాన్ని 10, 30, 50 శాతం చొప్పున అంచెలంచెలుగా పూత దశ వరకూ ఎరువుగా వాడొచ్చు. పంటల్లో చీడపీడలు ఉంటే 10 లీటర్ల నీటిలో 10 లీటర్ల ద్రావణం చొప్పున మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ ద్రావణంతో విత్తన శుద్ధి చేయెచ్చు. పొలంలోకి నీటి ద్వారా ఎకరానికి 200 లీటర్ల ద్రావణాన్ని 6 నెలలపాటు పలు దఫాలుగా పారిస్తే నేలంతా సేంద్రియ కర్బనం, పోషకాలు పెరుగుతాయి.
ఘజియాబాద్ లోని ఎన్ సీవోఎఫ్ కేంద్రంతో పాటు దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల్లో దీన్ని తయారు చేస్తున్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని బాబూఖాన్ ఎస్టేట్ 115వ గదిలోని రైతుసేవా కేంద్రంలో వేస్ట్ డీకంపోజర్ దొరుకుతుంది. వేస్ట్ డీకంపోజర్ వరం లాంటిది. వరి, అపరాలు, ఉద్యాన, వాణిజ్య పంటలకు రూ. 20 పెట్టుబడితో మంచి లాభం పొందవచ్చు. రసాయన ఎరువులు, ఆవు పేడ సేకరించే పని లేకుండా తక్కువ పెట్టుబడితో ద్రావణం తయారు చేసుకోవచ్చు.

Leave Your Comments

పండ్లు, కూరగాయలను పాడవకుండా కాపాడే గుడారం..

Previous article

పంటలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఖరారు..

Next article

You may also like