వార్తలు

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న డాలీకి.. ఉత్తమ రైతు మహిళా అవార్డు

0

ముప్పై ఏళ్ళు నిండకుండానే భర్త చనిపోతే సేద్యాన్ని చేతిలోకి తీసుకుందీమె. ఒంటరిగా పొలంలోకి అడుగుపెట్టింది. స్వీయ శిక్షణతో పంటను లాభాలబాట పట్టించింది అరెకరాల్లో సేంద్రియ పద్ధతిలో చేసిన వ్యవసాయం.. ఈమెను ఉత్తమ మహిళా రైతుగా నిలిపింది. కేరళకు చెందిన డాలీ జోసెఫ్ స్ఫూర్తి కథనమిది. కాసర్ గోడ్ లోని పత్తిక్కరా గ్రామానికి చెందిన డాలీకు జోసెఫ్ తో వివాహమైంది. ఉన్న కాస్త పొలంలో వ్యవసాయం చేసేవాడు భర్త. ముగ్గురు పిల్లలతో ఆ కుటుంబం సంతోషంగా ఉండేది. అయితే జోసెఫ్ అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటికి డాలీ వయసు 28 ఏళ్ళు. భర్త సేద్యం చేసే అరెకరాల పొలం తప్ప చేతిలో ఏమీ లేదు. అప్పటికి కొబ్బరి మొక్కలు, వరి మాత్రం ఉండే తమ పొలంలో వేరే పంటలకూ చోటు ఇవ్వాలనుకుంది. అలా అల్లం, పసుపు వంటివి వేసింది. అలాగే ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు పెంచడం మొదలుపెట్టింది. సమీపంలోని పడన్నెకాడ్ లోని వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి విత్తనాలను సేకరించి తెచ్చుకునేది. సేద్యంలో మెళకువలను నేర్చుకుంటూ 20 కేజీల విత్తనాలు వేస్తే 80 కేజీల వరి పండేలా కృషి చేసింది.

మిద్దెతోటను గ్రీన్ హౌస్ గా మార్చింది డాలీ. అందులో నాణ్యమైన విత్తనాలతో ఉల్లి, కాలీఫ్లవర్,క్యాబేజీ, క్యారెట్, టొమాటోలు, వంకాయలు వంటి కూరగాయలను పెద్ద ఎత్తున పండించడం మొదలుపెట్టింది. ఇక్కడ పండే కాలీఫ్లవర్, క్యాబేజీల పరిమాణం చూసి చాలామంది సలహాలు, సూచనలకు ఈమె వద్దకు వచ్చేవారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం తరపున పరిశోధన నిమిత్తం విద్యార్థులు వచ్చేస్థాయికి ఈమె మిద్దెతోట ఎదిగింది. సేంద్రియ క్రిమి సంహారక మందులను తయారుచేయడం నేర్చుకున్నారు. రసాయనరహితంగా పండిస్తున్న కాయగూరలు, ఆకుకూరలకు డిమాండ్ పెరిగింది. వీటిని ఎకో షాప్స్, వెల్లారికుండ్ రైతు బజారులో విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. “డాలీ పచ్చకరి” పేరుతో యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నా ఇందులో వ్యవసాయంతోపాటు క్రిమి సంహారక మందుల తయారీ నుంచి వినియోగించడం వరకు చెబుతుంటా అని డాలీ తెలిపారు. దీనికి లక్షకు పైగానే వీక్షకులున్నారు. నేను చేస్తున్న సేద్యాన్ని వీడియో రూపంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది అందజేశా. నా వ్యవసాయ పద్ధతులకుగాను ఉత్తమ మహిళా రైతు అవార్డు వరించింది. నా ముగ్గురు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు వారికి ఆసక్తి ఉంటే వ్యవసాయమూ నేర్పుతా అంటోంది డాలీ.

Leave Your Comments

ఇప్పపువ్వు ప్రయోజనాలు..

Previous article

ఎండాకాలంలో డీహైడ్రేట్ కాకుండా తీసుకోవలసిన పండ్లు..

Next article

You may also like