Pesticides: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న ఈ రోజుల్లో వ్యవసాయంలో కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి. మనం పాత సాంప్రదాయ పద్ధతులను విస్మరిస్తూ అనేక కొత్త పుంతలు తొక్కుతున్నాం. దేశీయ పద్ధతులకు స్వస్తి పలికి, విదేశీ పద్ధతులను ఆచరించడానికి ఏ మాత్రం వెనుకాడని ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ సస్యరక్షణలో రసాయనిక పురుగు మందులు అధిక పాత్రను పోషిస్తున్నాయి. విచక్షణా రహితంగా పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల పంట ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు పేరుకుపోయి, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో మన పంట ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలకు నిలవ లేకపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఎక్కువ పురుగు మందుల అవశేషాన్ని మోస్తున్నది భారతీయులే.
కనీసం 70 శాతం మంది కర్షకులు విషపూరితులుగా మారుతున్నారని అంచనా. సరైన విధానంలో, సరైన సమయంలో పురుగు మందుల పిచికారీ చేయకపోవడంవల్ల రైతు సోదరులు పురుగు మందుల బారిన పడుతున్నారు. అయితే పురుగు మందుల వాడకం, వాటిని వాడేటప్పుడు తీసుకోవలిసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం…. రైతు సోదరులు పురుగు మందుల ద్వారా నివారణ చేపట్టదలిచినప్పుడు ఈ ప్రశ్నలు ఒక్కసారి వేసుకోవాలి.
1) పురుగు మందు ఎందుకు కొట్టాలి ?
2) పైరుకు నష్టం కలగజేసే పురుగుల సంఖ్య ఎంత ఉంది? పంట నష్టశాతం ఎంత ?
3) పురుగు మందు వాడకం అవసరమా కాదా? వాతావరణం పురుగుకు అనుకూలమా ? లేదా ప్రతికూలమా?
4) పురుగు నివారణకు పురుగు మందులే కాకుండా వేరే పద్ధతులేమైనా ఉన్నాయా?
ఈ ప్రశ్నలకు రైతులకు సమాధానాలు తెలిపినట్లయితే సమస్య సులువుగా మారుతుంది. కానీ రైతు సోదరులందరూ వీటి గురించి ఆలోచించక ఎక్కువ శాతం మంది రసాయనపురుగు మందుల పైనే మొగ్గు చూపుతున్నారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి, పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది అనుకున్నపుడు, ఇతర పద్ధతులలో పురుగు నివారణసాధ్యం కాని పక్షంలో మనం పురుగు మందుల వాడకాన్ని సిఫారసు చేస్తాం. అయితే వీటిని వాడేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి.
పంట నష్టం :
పురుగు వల్ల పంటకు నష్టం ఎంత ఉందో అంచనా వేయాలి. నష్ట శాతం ఆర్థిక పరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే పురుగు మందు పిచికారీ చేయాలి.
ఉదా : ప్రత్తిలో పచ్చదోమలు మొక్కకు 3-5 గమనించినప్పుడు లేదా పొలంలో 10 శాతం మొక్కలు నష్టం గమనించినప్పుడు మాత్రమే రసాయనాలు పిచికారీ చేయాలి.
ఏ మందు? ఎంత?
పొలంలో ఏ పురుగు ఆశించినచో వివరాలు తెలుసుకోవాలి. దానికి ఏ మందు సిఫారసు చేయబడుతుందో దగ్గరలోని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతులు ద్వారా తెలుసుకోవాలి. సిఫారసు చేయబడిన రసాయనం ఎంత మేరకు వాడాలో కూడా మనం తెలుసుకోవాలి.
కొనుగోలు :
. నిర్ధిష్టమైన స్థిర విస్తీర్ణంలో ఒకసారి చల్లడానికి సరిపడా పరిమాణం మేరకు మాత్రమే కొనాలి. అధిక పరిమాణంలో కొనుగోలు చేసి వచ్చే పంటకు ఉపయోగించరాదు.
. చిరిగిన లేదా కుట్టులేని సంచులను గానీ, కారుతున్న లేదా విడి/వదులు పాత్రల్లోనివి గానీ, సరిjైున ప్యాకింగ్ లేని కాగితంలో ఇచ్చే మందులను కొనరాదు.
. ఏ మందు తీసుకున్నా, సరైన అధీకృత లేబిల్లు, తయారు చేసిన తేదీ, బ్యాచ్ నంబరు, ఎక్స్పైరీ తేది లేనవి కొనరాదు.
. మందు కొన్న వెంటనే దానికి అధీకృత బిల్లు, రశీదులను పొందాలి.
Also Read: దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి.!
రవాణా :
. వీపు, భుజాలు, తలమీద, పాదులు లేదా గుళికల బస్తాలను మోయరాదు.
. ఆహార పదార్థాలలో కలిపి వెంట తీసుకువెళ్ళటం గానీ, రవాణా చేయడం గానీ చేయకూడదు.
. పిల్లలతో వీటిని రవాణా చేయించరాదు.
వాడకం :
. స్ప్రే ద్రావకం తయారీకి పరిశుభ్రమైన నీరు మాత్రమే వాడాలి.
. డబ్బాతో పాటు ఇచ్చే కాగితంలో ద్రావకం తయారీ వివరాలను పూర్తిగా చదవాలి
. అవసరమైనంత మేరకు మాత్రమే స్ప్రే ద్రావకం తయారు చేసుకోవాలి.
. ముందుగా ఒక బకెట్లో గాని, లేదా డ్రమ్ములో గాని ద్రావకం మొత్తాన్ని తయారు చేసుకుని, దాని నుండి
స్ప్రేయరు లోకి వేసుకోవాలి. మందును స్ప్రేయర్లో ఎప్పుడూ కలుపరాదు
. ద్రావకం తయారు చేసేటప్పుడు చేతులతో కలుపరాదు. ఏదైనా కర్ర లేదా ప్లాస్టిక్ గొట్టంతో మిశ్రమాన్ని కలపాలి.
ఇనుప ఊచలు లేదా తీగలతో కలుపరాదు.
. స్ప్రేయర్ ట్యాంక్‌లో ద్రావకం పోసేటప్పుడు ఒలికిపోకుండా చూడాలి.
మందును కలిపేటప్పుడు, ముక్కతో వాసన చూడటం లేదా కంటికి దగ్గరగా పెట్టడం వంటివి చేయరాదు. చేతులు, చెవులు, నోరు, కళు , ముక్కులకు రక్షణ ఏర్పాటు చేసుకోవాలి.
. ద్రావకం తయారు చేసేటప్పుడు, పొగత్రాగడం, నీరు త్రాగటం, గుట్కా వంటివి తినటం చేయకూడదు.
స్ప్రేయర్ :
. ద్రావకం పోసే ముందు స్ప్రేయర్ యొక్క పనితీరును పరీక్షించాలి.
. లోపం గల పరికరాన్ని, కారుతున్న పరికరాన్ని వాడరాదు
. నాజిల్ పని చేస్తుందో లేదో చూసుకోవాలి. ముందే దానిని నీటితో శుబ్రంగా కడిగి ఉంచుకోవాలి.
. మూసుకు పోయిన పని చేయని నాజిల్‌ను నోటితో ఊది శుభ్రంచేయరాదు. పాత టూత్ బ్రష్‌తో దానిని శుభ్రంగా చేయాలి.
. పురుగు మందులకు, కలుపు నాశక రసాయనాలకు ఒకే స్ప్రేయర్‌ను ఉపయోగించరాదు.
పురుగు మందు చల్లడంలో జాగ్రత్తలు :
. హోరుగాలిలో, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రసాయన మందులు చల్లరాదు.
. ఉదయం, లేదా సాయంత్రం 4 గం. తర్వాత మాత్రమే వాడుకోవాలి.
. వర్షాలకు ముందు లేదా వర్షం కురిసిన వెంటనే చల్లు కోరాదు.
. గాలి వీచే దిశలో మాత్రమే చల్లుకోవాలి. వ్యతిరేక దిశలో చల్లుకోకూడదు.
. స్ప్రేయింగ్ చేసిన వెంటనే పొలంలోకి పశువులను, పనివాళ్ళను వెళ్ళనీయరాదు.
. చల్లేటప్పుడు, తలకు టోపీ/, తువ్వాలు, ముఖానికి ముసుగు, చేతులకు, కాళ్ళకు తొడుగులను ధరించాలి.
. మందు చల్లేటప్పుడు ఆహార పదార్థాలు, పొగాకు తినటం, త్రాగటం వంటివి చేయరాదు.
చల్లిన తరువాత :
పురుగు మందు పిచికారి చేయగా మిగిలిన ద్రావకాన్ని కాలవలు, బోదెలు, చెరువులు, కుంటలలో పారబోయరాదు. దూరంగా పల్లపు భూముల్లో పారబొయ్యాలి.
. వాడేసిన డబ్బాలు, పాత్రలను రాయి/కర్రతో చితకగొట్టి నీటి వనరుకు దూరంగా భూమిలో పాతి పెట్టాలి. ఖాళీ అయిన బుడ్లు/డబ్బాలను ఏ అవసరానికైన తిరిగి వాడరాదు.
. పరిశుభ్రంగా స్నానం చేసి, ఒళ్ళంతా శుభ్రం చేసుకుని ఆహారం తీసుకోవాలి.
నిల్వ :
. మిగిలిన పురుగు మందులను లేదా కొత్తగా తెచ్చిన మందులను జాగ్రత్తగా నిల్వ చేయాలి.
. గృహ పరిసరాలలో నిల్వ ఉంచరాదు.
. పశువులకు, పిల్లలకు దూరంగా, అంద కూడా ఉంచాలి.
. సూర్య రశ్మికి, వాన నీటికి బసిర్గతం కాకుండా ఉండేట్లు నిల్వ ఉంచాలి.
. పురుగు మందులు, కలుపు మందులు కలిపి ఒకే చోట ఉంచరాదు.
. ఆహారం, పశువుల మేత, దాణాలతో కలిపి నిల్వ చేయరాదు.
అవశేషాలు – హాని :
ఎక్కువ మోతాదుతో వినియోగించిన పురుగు మందులు, పంటల ఉత్పత్తులో పేరుకుపోతాయి. కొద్ది శాతం మాత్రమే భూమిలోని భౌతిక, రసాయన చర్యలుకు గురి కాబడి, హాని చేయని పదార్థాలుగా ఉండిపోతాయి. మిగిలినవి పంట ఉత్పత్తుల్లో ఉండి, సాగునీటిలోను చేరి వాటిద్వారా మనుషులు, పశుపక్ష్యాదులతో ప్రవేశిస్తాయి. పురుగు మందులు పిచికారీ చేసిన వెంటనే పశువుల మేయడం వలన వాటిలో అవశేషాలు, ఉండి, పాల ద్వారా మనుషులలో చేరుతున్నాయి. దీని వల్ల మనుషుల్లో కూడా రసాయన అవశేషాలు చేరుతూ, ఆఖరికి తల్లి పాలు కూడా కలుషితమవుతాయి. మన శరీరంలో ప్రవేశించిన పురుగు మందులు అవవేషాలు, కణాజాలాల్లో కొవ్వుతో, ఎముకల్లోని మూలుగుల్లో పేరుకుంటాయి.
వీటి వలన పుట్టే బిడ్డలకు అంగవైకల్యం, ఏర్పడుతుంది. అంతేకాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతాయి. జన్యు పదార్థాలలో కీలక మార్పులు సంభవించి, పురుషుల్లో, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గి పోవచ్చు. స్త్రీలలో రుతుక్రమంలో మార్పులు చోటు చేసుకుంటాయి. రోగ నిరోధక తగ్గి పోతుంది.
అందువలన రైతు సోదరులందరూ, సస్యరక్షణలో పురుగు మందుల వినియోగించేటప్పుడు, వాటి ఆవశ్యకత ఎంత మేరకు ఉందో తెలుసుకొని వాడుకోవాలి.
సరైన, నిర్దేశించిన మోతాదులో మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలి. కూరగాయలు, ఆహార ధాన్యాలలో తప్పని సరిగ్గా పురుగు మందులు వాడవలసినప్పుడు. దగ్గరలోని శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన లేదా అనుభవం కలిగిన రైతులనుగానీ, శాస్త్రవేత్తలను గానీ, అధికారులను గానీ సంప్రదించాలి. ఇతర పద్దతులతో (జీవ నియంత్రణ, సేంద్రీయ పద్దతులు) ద్వారా తొలి దశలో ఉన్న పురుగులను అదుపులోకి తెచ్చుకోవాలి. తప్పని సరిగ్గా పై జాగ్రత్తలు రైతుసోదరులు పాటించి, పురుగు మందుల అవశేషాలు తగ్గించాలని, పర్యావరణ కాలుష్యం కాకుండా చూసుకోవాలని మనవి.
Also Read: మైకోరైజా ఉపయోగాలు – వాడే విధానం.!