Thrips Parvispinus: తెలుగు రాష్ట్రాల్లో సాగుచేసే వాణిజ్య పంటల్లో మిరప చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మిరపను సుమారుగా 5.45176 లక్షల ఎకరాల్లో సాగుచేస్తూ 13,72,321 లక్షల టన్నుల ఉత్పత్తిని పొందడం జరుగుతుంది. ప్రస్తుతం మిరప పంటను పూత దశలో కొత్త రకం పురుగులు ఉదృతంగా ఆశించడం వలన రైతులు తీవ్ర నష్టాన్ని ఎదురుకొంటున్నారు. కొత్త రకం తామర పురుగును త్రిప్స్ పార్విస్పైనస్ గా గుర్తించటం జరిగింది. ఈ తామర పురుగులను మొట్ట మొదటి సారిగా గత ఏడాది జనవరి- ఫిబ్రవరిలో గుంటూరు జిల్లాలో గుర్తించారు. పూతను ఎక్కువ సంఖ్యలో ఈ పురుగులు ఆశించడం వలన పూత రాలిపోవడం మరియు కాయగా మారకపోవడం వంటి నష్టాలను రైతులు తీవ్రంగా ఎదురుకొంటున్నారు. కాబట్టి ఈ కొత్త రకం తామర పురుగు ఉధృతిని తగ్గించడానికి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పంట నష్టాన్ని తగ్గించుకొని అధిక దిగుబడులను పొందవచ్చును.
ఈ తామర పురుగులు ఆకుల అడుగు భాగమున ఈనెల దగ్గర చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకుల అంచుల వెంబడి పైకి ముడుచుకొంటాయి, మరియు ఆకుల కణజాలంపై మాడిన మచ్చలు ఏర్పడి ఆకుపై భాగం పసుపు వర్ణంలోకి మారడం మరియు ఆకు పరిమాణం, ఆకారం మారిపోవడం జరుగుతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కొత్తగా వచ్చే ఆకులు మాడి పోవడం జరుగుతుంది. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. పూత పిందెగా మారకపోవడం జరుగుతుంది.
Also Read: మిద్దెతోట పెంపకం మరియు యాజమాన్య పద్ధతులు.!
పంటలో తామర పురుగును నివారించడానికి రైతులు తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మిరప మరియు ఇతర పంటల్లో తమరపురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
- పంటలో ఎక్కువ సంఖ్యలో నీలిరంగు, లేదా పసుపు రంగు జిగురు అట్టలను పెట్టడం ద్వారా పురుగు ఉధృతిని తగ్గించవచ్చును.
- తీవ్రంగా పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. అలాగే కలుపు మొక్కలైన పార్థీనియం, అబ్యుటిలాన్, మొదలగు మొక్కలను పీకి నాశనం చేయాలి.
- తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడం కోసం ఎకరానికి 100 కిలోల వేపపిండిని రెండు దఫాలుగా మొదటిది నాటేటప్పుడు రెండవది నాటిన ౩౦ రోజుల తర్వాత దుక్కిలో వేసుకోవాలి లేదా ౩ మి.లీ. వేపనూనెను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
- పురుగు ఉధృతిని అరికట్టడానికి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ. మందులతో పాటు వేపనూనె ౩ మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- అదేవిధంగా క్లోరిఫైరిఫాస్ 20 ఇ.సి. మందును 2 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారి చేయడం వలన తమరపురుగుల కోశస్థ దశను నివారించవచ్చు.
Also Read: వివిధ పంటల నీటి యాజమాన్యంలో పాటించవలసిన మెళకువలు.!