Terrace Gardening: మిద్దెతోట అనేది ఇప్పుడొక ఆరోగ్యమంత్రంగా మారింది. పట్టణాల్లో భూమి లభ్యత తక్కువ కారణంగా కూరగాయలు, పండ్లు పెంచటానికి మిద్దెతోట పెంపకమే మన ముందున్న సులువైన మార్గం. రకరకాల రసాయనాలతో పండించిన కూరగాయలు తిని మన ఆరోగ్యాలు చేజేతులా పాడు చేసుకోవడం కంటే సంవత్సరం పాటు ఇంటిల్లిపాదికి, ఎలాంటి రసాయనాలు వాడకుండా రకరకాల తాజా కూరగాయలు, పలు రకాల పండ్లు అనేక ఔషద మొక్కలు ఇచ్చే మిద్దేతోట సాగు ఏంతో మేలు. సరైన పద్ధతిలో మిద్దెతోట సాగు చేస్తే నూరుకి నూరు శాతం లాభాలు వస్తాయని పలువురు వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
మిద్దెతోట సాగులో మొదటి దశ ఇటుకల మడులు అమర్చుకోవడం. ఈ మడులే ఇప్పుడు మిద్దెతోట సాగులో సరైన సాధనాలుగా మారాయి. నాలుగు అడుగుల పొడవు, నలుగు అడుగుల వెడల్పు ఒక అడుగు లోతు కలిగిన మడులు అవసరం ఉంటుంది. మన మిద్దె విస్తీర్ణం బట్టి ఇటుకల మడులను అమర్చుకుంటే శ్రేయస్కరం. కూరగాయలు, పండ్ల సాగు చేయాలంటే మాత్రం ఇటుక మడులు తప్పకుండ ఉండాల్సిందే. ఇటుకుల మడుల ప్రత్యామ్యాయం ఫైబర్ మడులు. ఇటుక మడులు అధిక బరువు కలిగి ఉండటం మరియు అమర్చాక మరో చోటుకు మార్చడానికి కుదరకపోవడం వంటి సమస్యల వల్ల కొందరు ఫైబర్ మడులపై ఆశక్తి చూపుతున్నారు.
పైబర్ మడులు కూడా మనకు బయట మార్కెటులో దొరుకుతాయి. ఇలా ఇటుక మడులు అమర్చుకోవడం పూర్తయ్యాక రెండవ దశలో నిలువు పందిళ్ళ నిర్మాణం కీలకం. ఎలాగు మిద్దెపైనా నాలుగు వైపులా రెండు నుండి మూడు అడుగుల రక్షణ గోడ ఉంటుంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని సుమారు తొమ్మిది అడుగుల ఎత్తులో పందిరి వేసుకోవాలి. పందిరి అడ్డంగా వేస్తే దాని దిగువన ఉన్న మొక్కలు పందిరి నీడ కారణంగా ఎదగక పోవడమే కాకుండా స్థలం కూడా వృధా అవుతంది. కాబట్టి మిద్దెతోట నిర్మాణంలో నిలువు పందిరి మాత్రమే కట్టాలి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి పది అడుగులకు రక్షణ గోడ సహాయంతో ఒక ఇసుక పోల్ బిగించి అడ్డంగా పొడువుగా తీగలు కట్టుకొని మిద్దెతోట సాగుకు అనువుగా పందిరి కట్టాలి.
Also Read: నిమ్మ పూత దశలో పాటించవలసిన మెళకువలు.!
ఈ క్రమంలో మనం నిర్మించిన పందిరి చుట్టూ ఒక ఇటుకల మడి వరుసను అమరిస్తే తీగ జాతి మొక్కలన్నిటిని పందిరికి పాకించవచ్చు. ఇటుక మడులు నిర్మించుకున్న తర్వాత మిగిలిన ప్రదేశాల్లో సిమెంట్ లేదా మట్టి కుండీలను ఓ పధ్ధతి ప్రకారం అమర్చాలి. ఈ సిమెంట్ లేదా మట్టి కుండీలు పూల మొక్కలు పెంచడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత అమర్చిన ఇటుక మడులు మరియు కుండిలల్లో ఎర్ర మట్టి లేదా నల్ల మట్టిని నింపుకోవాలి లేదా కోకోపిట్, వర్మీకంపోస్ట్ 1:1 నిష్పత్తిలో నింపుకోవాలి. వర్మీకంపోస్ట్ బదులు బాగా చివికిన పశువుల ఎరువు వాడవచ్చును.
సేంద్రీయ ఎరువులైన పేడ, వేప ఆకులు వాడడం వల్ల కూరగాయలు విరివిగా పండడంతో పాటు భూసారం పెరుగుతుంది. ఇలా మట్టి, ఎరువుల మిశ్రమాన్ని మడుల్లో నింపడంతో మిద్దెతోట నిర్మాణం దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టే. మిద్దెతోట సాగులో మరో కీలక దశ విత్తనాలు. కాలాన్ని బట్టి మన పంటను ఎంపిక చేసుకొని వాటికీ సంబంధించిన విత్తనాలు నాటాలి. ఆకుకూరలను 15 సెం.మీ దూరంలో నాటుకోవాలి. టమాట, వంగ, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కూరగాయలను 45×45 సెం.మీ దూరంలో నాటుకోవాలి. కూరగాయలలో ఎత్తుగా పెరిగే, కాండం బలం అంతగా లేని కొన్ని మొక్కలకు కర్రతో ఊతమివ్వటం లేదా స్టేకింగ్, దారాలతో పైకి కట్టడాన్ని ట్రెల్లీసింగ్ అంటారు.
మిద్దెతోట సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యం, ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోవడమే కాకుండా, వేరు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మట్టిలో తేమ శాతం బట్టి నీరు పోయాలి. అలాగే మొక్కలకు ప్రతి రోజు నాలుగు గంటలపాటు ఎండ పడాలి. ఇక మొక్కలు మొలిచిన పది రోజుల తర్వాత అంతర కృషి చేయాలి. అంటే మొక్కల మధ్య మట్టిని లూజ్ చెయ్యాలి. అలా చేసేటప్పుడు మొక్కల వేర్లు దెబ్బతినకుండా సున్నితంగా మట్టిని లూజ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల మొక్కల వేరు వ్యవస్థకు ప్రాణవాయువు అంది బలపడడమే కాకుండా మొక్కల ఎదుగుదల కూడా బాగుంటుంది. మరియు చీడపీడల సమస్యను నివారించడానికి లీటరు నీటిలో అయిదు మిల్లీ లీటర్ల వేప నూనె వేసి నురుగు వచ్చేలా బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాల్సి ఉంటుంది. అలాగే తెగులు సోకిన ఆకులపై పుల్లని మజ్జిగను స్ప్రే చేయాలి. లేదా తెగులు సోకిన ఆకులను తెంపి బయట దూరంగా పారవేయాలి. ఇలా తక్కువ ఖర్చుతో మిద్దెతోట సాగుతో మన ఇంటిల్లి పాదికి సరిపడే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా యాంత్రిక యుగంలో ప్రకృతికి దూరమై, విషపూరితమైన ఆహారాలు తిని పలు వ్యాధులకు గురవుతున్న నేటి ఆధునిక సమాజానికి మిద్దెతోట సరైన మార్గం చూపుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు మిద్దెతోట సాగు వైపు అడుగులు వేస్తూ అనేక లాభాలు పొందుదాము.
Also Read: టమాట సాగుకు అనువైన రకాలు.