Lemon Farming Techniques: భారతదేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత నిమ్మజాతి పంటలు మూడవ స్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ తోటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఈ తోటల్లో మొక్కలకు నీటిని ఎప్పుడు పడితే అప్పుడు అందించడం వల్ల సరైన సమయంలో చెట్లు పూతకు రావడం లేదు అంతేకాకుండా పూతదశలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పండ్లు సరైన రంగు లేకుండా పక్వానికి రాకుండా అవుతుంది. కాబట్టి రైతులు అధిక దిగుబడిని సాధించడానికి పూత దశలో కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి.
సహజంగా నిమ్మజాతి మొక్కలు సంవత్సరం పొడువున పూతను అందిస్తాయి. కానీ అల చేయటం వలన రైతులకు సరైన దిగుబడులు అందవు. కావున ఒక సీజన్ లో మాత్రమే అధిక దిగుబడులను పొందుట కొరకు మొక్కలో ఒత్తిడి పెంచి పూతను తీసుకురావాల్సిన అవసరం వుంది. తెలుగు రాష్ట్రాల్లో నిమ్మజాతి మొక్కలు మూడు కాలాల్లో పూతకు వస్తాయి. జనవరి – ఫిబ్రవరి (అంబె బహార్ ) జూన్ (మ్రిగ్ బహార్) మరియు అక్టోబర్ (హస్త బహార్) లో పూతకు వస్తాయి. పూత బాగా రావడానికి బహార్ ట్రీట్ మెంట్ రైతులకు ఉపయోగపడుతుంది. కావున జనవరి- ఫిబ్రవరి లో ఎక్కువ పూత కోసం నవంబర్- డిసెంబర్ మాసంలో మొక్కలను నీటి ఎద్దడికి గురి చేయాలి. ఇందుకుగాను నీటి తడులను తగ్గించి డిసెంబర్ మాసంలో పూర్తిగా నీటిని ఆపివేయటం వలన ఆకులు రాలిపోయి పెరుగుదల నియంత్రిస్తుంది. దీని వల్ల చెట్టు నిద్రావస్థలోకి వెళ్లి ఆ తర్వాత అనుకూల పరిస్థితులు వచ్చినపుడు ఎన్నుకున్న సీజన్ బట్టి పిందెలు వస్తుంటాయి. ఆ తరువాత డిసెంబర్ చివరిలో పాదులు చేసి, మట్టి 10 సెం.మీ లోతులో గుల్ల చేసి, 30 కిలోల పశువుల ఎరువు, 500 గ్రా 20:20:0:13, 500 గ్రా యూరియా, 400 గ్రా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను అందించి నీరు కట్టిన యెడల పూత బాగా వస్తుంది.
Also Read: టమాట సాగుకు అనువైన రకాలు.
వేసవిలో అధిక దిగుబడులను పొందడానికి జూన్ లో 50 పి.పి.యం జిబ్బరెల్లిక్ ఆమ్లాన్ని సెప్టెంబర్ లో 1000 పి.పి.యం సైకోసెల్ ద్రావణాన్ని ఆ తర్వాత అక్టోబర్ మాసంలో పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని (10 గ్రా/లీ) పిచికారి చేయాలి. ఇగురు వచ్చిన 10 -15 రోజులకు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని జింక్ సల్ఫేట్ 5 గ్రా. మాంగనీస్2 గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రా, కాపర్ సల్ఫేట్ ౩ గ్రా. బోరాక్స్ 1 గ్రా, యూరియా 10 గ్రా, చొప్పున లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. ఇలా చేయడం వలన పల్లాకు వ్యాధిని నివారించవచ్చును.
పిందె బఠాణి సైజులో ఉన్నప్పుడు 1 మి.లీ ప్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కాయ పెరిగే దశలో 2 కిలోల వేపపిండి, ౩౦౦ గ్రా. యూరియా, 350 గ్రా మ్యురేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్టు ఒక్కింటికి వేసి నీటిని అందించాలి. నిమ్మ కాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంకు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం ౩ గ్రా. లీ . లేదా ప్రొపర్ గైట్ 2 మి.లీ . లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ విధంగా పూత దశలో తగిన జాగ్రతలు తీసుకోవడం వల్ల రైతులు మంచి దిగుబడిని పొందవచ్చు.
Also Read: రైతుల పరిజ్ఞాన సాధికారత దిశగా ఆచార్య ఎన్.జి. రంగా వ్యయసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు.!