Bengal Gram Crop: తెలుగు రాష్ట్రాల్లో పండించే పప్పుధాన్యపు పంటల్లో శనగ పంట ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో సుమారు 9.89 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇలాంటి లాభదాయకమైన శనగ పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టం కలుగజేస్తాయి. కావున రైతులు చీడపీడలను సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులను చేపట్టినట్లయితే దిగుబడులను పెంచుకోవడమే కాకుండా నాణ్యమైన పంటను పొందవచ్చు.
శనగపచ్చ పురుగు: తల్లి పురుగులు లేత ఆకులు, పూమొగ్గలపై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన గొంగళి పురుగు ఆకులను, మొగ్గల్ని గోకి తింటూ పురుగులు పెద్దవి అవుతున్న కొద్దీ కాయలను తొలచి గింజలను తింటాయి. ఈ పురుగులు కాయలను తింటున్నప్పుడు తలభాగం మాత్రం కాయలో ఉంచి మిగతా శరీరమంతా కాయ బయట ఉంచుతాయి. పురుగు తిన్న కాయపైన “ గుండ్రటి రంధ్రాలు” కనిపిస్తాయి.
నివారణ: లోతు దుక్కులు చేసుకోవడం వలన పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకొని తింటాయి. తల్లి మరియు పిల్ల పురుగులను నివారించటానికి 0.2గ్రా. ఎసిటామిప్రిడ్20% ఎస్.పి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి 0.4గ్రా. లేదా ఇండాక్సాకార్బ్ 1మి.లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
రబ్బరు పురుగు: పంట లేత దశ నుండి బాగా ఎదిగే దశలో ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు యొక్క చివర రెండు ఆకుల మధ్య మొవ్వ దగ్గర ఉండే పత్ర హరితాన్ని గీరి తిని నష్టం కలుగజేస్తుంది. పంట పెరుగుతున్న సమయంలో కూడా ఆకులను తిని మొక్కకు నష్టం కలుగజేస్తుంది. ఉధృతంగా ఆశించినప్పుడు ఆకులు పాలిపోయి రాలిపోతాయి.
నివారణ: క్లోరిపైరిఫాస్ 50 ఇసి 1.5 మి.లీ. లేదా ఇండాక్సాకార్బ్ 1మి.లీ. లేదా నొవాల్యురాన్ 1మి.లీ లేదా అసిఫేట్ 1.5గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పురుగు ఉధృతిని బట్టి 4-5 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
Also Read: మిరప చీడపీడల – యాజమాన్య పద్ధతులు
ఎండు తెగులు: ఈ తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకుపోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఈ తెగులు కలుగజేయు శిలీంద్రము విత్తనము మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. శనగపంట లేకున్నా పొలంలో 6 సంవత్సరములు బ్రతికి ఉండగలదు.
నివారణ: ఎండు తెగులు తెట్టుకొనే రకాలను సాగుచేయడం. వేసవిలో లోతుగా దుక్కి దున్నుత వలన మరియు ముందు పంట అవశేషాలు తీసివేయడం వలన తెగులు తీవ్రత తగ్గించుకోవచ్చు. విత్తనశుద్ధి చేసి పంట విత్తుకోవడం.
మొదలు కుళ్ళు తెగులు: కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన తొలిదశలో తెల్లని శిలీంద్ర బీజాలు ఆవగింజల మాదిరి కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండడం, అంతగా కుళ్ళని సేంద్రీయ పదార్థం ఉండడం మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ తెగులు ఉధృతికి తోడ్పడతాయి.
నివారణ: విత్తనశుద్ధి చేసిన విత్తనం వాడుకోవాలి. జొన్న మరియు ఇతర దీర్ఘకాలిక పంటలతో పంటమార్పిడి చేయాలి. కుళ్ళని చెత్తను విత్తుటకు ముందు తీసివేసి పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. విత్తిన 10-15 రోజుల తరువాత పొలంలో మొదలుకుళ్ళు గమనించినపుడు, ఎకరాకు 200గ్రా. కార్బండెజమ్ మరియు 600 గ్రా. మాంకోజెబ్ ను వాడి మొక్కల మొదలు భాగము తడిచేటట్టు పిచికారీ చేయాలి.
Also Read: నాడు మాట ఇచ్చాం.. నేడు నిలబెట్టుకుంటున్నాం – మంత్రి