Storage of Groundnut: భారతదేశంలో పండించే ముఖ్యమైన నూనగింజల్లో వేరుశనగ ప్రధానమైనది. ప్రస్తుతం అనేక ప్రాంతాలలో వేరుశనగ కోతలు ప్రారంభమైనాయి. కొన్నిచోట్ల వేరుశనగ కోతలు పూర్తయ్యాయి. కోతలు పూర్తయిన తర్వాత సరైన జాగ్రత్తలు పాటిస్తేనే ఈవిత్తనాన్ని రాబోయే ఖరీఫ్ లో విత్తనం కోసం వాడుకోవచ్చు. లేదంటే విత్తనం పుచ్చు పట్టి పనికి రాకుండా పోతుంది. ఈబాధల నుండి విముక్తి పొందాలంటే రైతులు వేరుశనగ కోతలు మొదలుకొని నిల్వ చేసేంతవరకు తగు జాగ్రత్తలు పాటించాలి. వేరుశెనగను 70- 80% మొక్కల ఆకులు, కొమ్మలు, పసుపు వర్ణం గా మారి, కాయ డొల్ల లోపలి భాగం నిలువుగా మారినప్పుడు కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి.
కోత తర్వాత జాగ్రత్తలు
కోసిన పంటను తగిన తేమ వచ్చేవరకు మొక్కనుండి కాయలు వేరు చేయుటకు ముందు ఎండబెట్టాలి. ఇది రెండు విధాలుగా చేయవచ్చు, కాయలు పైభాగానికి వచ్చినట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలు పక్కకు వచ్చేటట్లు చేసి ఎండబెట్టవచ్చు. కాయలలో ఎక్కువ తేమశాతం ఉండే ఎండలో ఆరబెట్టకుండా తేమని 7-8 శాతానికి తీసుకురావాలి. ఇందుకుగాను వేడి గాలిని వదిలి పరికరాన్ని ఉపయోగించడం వలన కాయలను ఎక్కువ ఎండలో ఎండబెట్టుకోకుండానే తేమను తగు శాతానికి తీసుకురావచ్చును. కాయలను కదిలిస్తే ఘళ్ళుమని శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్థం.
Also Read: వేరుశనగలో రసం పీల్చు పురుగుల సమగ్ర యాజమాన్యం.!
కాయలు పూర్తిగా ఎండక ముందే వర్షం వస్తే, వర్షం ఆగిన తర్వాత కాయలు మరల ఎండబెట్టాలి. లేదంటే శిలింద్రం త్వరగా ఆశిస్తోంది. రబీ కాలంలో పీకేటప్పుడు వాతావరణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో అరబెట్టాలి. ఎండబెట్టేటప్పుడు వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. విత్తనం కోసం ముదిరిన కాయలను నిల్వ చేసుకోవాలి.
గాలి వెలుతురు బాగా ఉండాలి.
కాయలను నిల్వ చేయడానికి శుభ్రమైన లోపల పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనెసంచులను వాడాలి. కాయలను నింపిన సంచులను గాలి వెలుతురు బాగా ఉన్న గదిలో ఉంచాలి. బస్తాలను నేరుగా నేలపై పెట్టుకుండా ఒక అడుగు ఎత్తు చెక్క బల్లను పరిచి వాటి మీద మూటలను ఒకదానిపై ఒకటి పది బస్తాలు చొప్పున ఒక వరుసలో ఉంచాలి. కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వ చేసే ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి కాయలను నెలకొకసారి పరిశీలించి పురుగు ఉధృతిని బట్టి క్రిమిసంహారక మందులను కొట్టాలి.
Also Read: రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ను సందర్శించిన డాక్టర్ ద్రువ్ సూద్