తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే నీటి వసతి పెరగడం, వివిధ ప్రాజెక్టులు మంచి వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో భూగర్భ జలవనరులు పెరగడం వల్ల ఎక్కువ మంది రైతులు వరి సాగుకు మొగ్గు చూపడం జరుగుతుంది. 2020 వానాకాలంలో తెలంగాణలో మొత్తం 145. 61 లక్షల ఎకరాలలో వ్యవసాయం 135.63 లక్షల ఎకరాల్లో పండించడం జరిగింది కాని ఉద్యానవన పంటలు మొత్తంగా 9.98 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో వరి సాగు 53.33 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. కాని చివరలో అధిక వర్షపాతం, కూలీల డిమాండ్ పెరగడం, సస్యరక్షణపై పెట్టుబడి పెరగడం, లాభసాటి కాని మార్కెట్ ధరల వల్ల కేవలం వరిసాగు రైతులకు లాభం చేకూరడం జరగలేదు. ఈ మూస పద్దతిని వదలి మంచి దృక్పదంతో వివిధ మాధ్యమాల ద్వారా ముఖ్యంగా యువ రైతులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ వ్యవసాయ రంగంలోని పై సమస్యల్ని అధిగమిస్తూ స్వతహాగ నూతన సాంకేతిక విషయాల్ని వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి వచ్చిన నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని తమ లాభాల్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు.
ఈ రకంగా వ్యవసాయ నేపధ్య కుటుంబం అయినప్పటికీ శ్రీ యం.మల్లికార్జున్ రెడ్డి యువరైతు తన బీటెక్ (కంప్యూటర్ సైన్స్) చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి తనకున్న 15 ఎకరాల్లో వరిసాగే కాకుండా ఉద్యానవన పంటలు, ఔషధ మొక్కల పెంపకం, సమీకృత వ్యవసాయ విధానంలో భాగమైన చేపల పెంపకం, పశువులు, మేకలు, గొర్రెల పెంపకం ద్వారా సంవత్సరం మొత్తంగా ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి యువరైతులు తమ గ్రామమైన పెద్దకూర్మపల్లి, చొప్పదండి కరీంనగర్ జిల్లా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు నిర్వహించిన క్షేత్ర దినోత్సవంలో పాల్గొన్న రైతు వరిసాగులో తడిపొడి పద్ధతిని గత రెండు సంవత్సరాలుగా అవలంభిస్తున్నారు. ఈ పద్దతిని వీరు నాటిన నుండి చిరుపొట్ట దశ వరకు పాటించి సంప్రదాయ వరిసాగు విధానంలో పోల్చినప్పుడు దాదాపుగా 20 శాతం నీటిని ఆదా చేస్తూ ఆ నీటిని సమీకృత వ్యవసాయ పద్దతిలో చేపల పెంపకానికి వాడేట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీని ద్వారా వారు వివరించినట్లు నీటి ఆదాతో పాటుగా పంటలో చీడపీడలు ముఖ్యంగా దోమపోటు ఉధృతి తగ్గి, యంత్రం ద్వారా కోత సమయం తగ్గి సాగు ఖర్చు నికరంగా కేవలం ఈ పద్దతి ద్వారా 5,200 రూపాయలు అదనంగా పొందారు. అలాగే కూలీల కొరతను అధిగమించే విధానంలో భాగంగా కేవలం రెండు లక్షల ఖరీదైన చిన్న వరినాటు యంత్రాన్ని ఏరువాక శాస్త్రవేత్తల సలహాతో కొన్ని గత కొన్ని సంవత్సరాలు వరకు కూలీల కొరత సమస్యను ఎదుర్కొని నికరంగా ఎకరానికి 29,610 రూపాయలు అధిక ఆదాయం ఆర్జించారు. వీటితో పాటు విశ్వ విద్యాలయం రూపొందించిన నూతన వంగడాలైన జగిత్యాల రైస్ – 1, కున్నారం రైస్ – 1, వరంగల్ రకాలు ఇతర చిరు సంచుల దశలోని రకాల్ని సాగు చేస్తూ దానిలోని సాధకబాధకాల్ని లక్షణాలతో సహా శాస్త్రవేత్తలతో చర్చిస్తూ మెళకువల్ని జాతీయ స్థాయిలో యువత పాత్రపై రాయపూర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నిర్వహించిన సమ్మిళిత సదస్సులో తెలంగాణ నుండి యువరైతుగా పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా నిపుణుల సూచన మేరకు వ్యవసాయమే కాకుండా 21 మేక పిల్లలతో జీరో గ్రేజింగ్ విధానంలో యూనిట్ ఏర్పాటు చేసుకొని వ్యవసాయ పంటల్లో మిగిలిన అవశేషాల్ని ఇతర అనుబంధ సాగు విధానాల్లో వాడి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మేకల పెంపకంలో పెట్టుబడి 9 నెలలకు గాను 64,020 రూపాయలు పోనూ దాదాపు 1,15,880 నికర ఆదాయాన్ని పొందారు. అలాగే వ్యవసాయంలో నీటిని ఆదా చేస్తూ తనకున్న నీటి వసతులతో చేపల సాగు (కొర్రమీను, రోహు) ఒక గుంట విస్తీర్ణంలో పెట్టుబడి 18, 600 పోనూ నికరంగా 30, 600 రూపాయలు ఆదాయం ఆర్జించారు. దీంతో పాటుగా తనకున్న 4 ఆవులు, 2 లేగ దూడల ద్వారా వ్యవసాయ వ్యర్థాల్ని దాణాగా ఉపయోగించి తక్కువ పెట్టుబడితో సుమారు 39,125 రూపాయలు నికర ఆదాయాన్ని పొందారు. వీరు ఇతర పంటలైన అల్లం, ఔషధ పంటలైన వసను కూడా అదే భూమిలో సమీకృతంగా పండిస్తూ అధిక లాభాల్ని ఆర్జిస్తున్నారు. వీటిన్నింటిని ఒక క్రమ పద్ధతిలో శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేస్తూ ఈ క్రింది విధంగా తన లాభాల్ని వివరించారు. సమీకృత వ్యవసాయ పద్ధతులలో నికర ఆదాయం ఒక సంవత్సరంలో
వరిసాగు ద్వారా – 9,30,100 ( 10 ఎకరాలు)
విత్తనాభివృద్ధి ద్వారా – 1,05,060 ( 2.5 ఎకరాలు వానాకాలం )
హైబ్రిడ్ సాగు ద్వారా – 97,600 ( 1.5 ఎకరం, యాసంగి)
నువ్వు పంట ద్వారా – 8,500
వస పంట ద్వారా – 91,300 (1.5 ఎకరం)
అల్లం పంట ద్వారా – 16,850
పశువుల పెంపకం ద్వారా – 39,125
మేకల పెంపకం ద్వారా – 1,22,980
చేపల పెంపకం ద్వారా – 30
మొత్తంగా 14 లక్షల 43 వేల రూపాయలు ఆర్జిస్తున్నాను.
ఈ సమ్మిళిత పద్ధతులను శాస్త్రవేత్తలు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా స్థాయి అధికారులు వీరి క్షేత్రాన్ని సందర్శించి అభినందించారు. అలాగే నాకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు ఆరవ వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబర్ 03, 2020 న సి. ఆర్. ఐ పంప్స్ ఉత్తమ రైతు పురస్కారం తో గౌరవ ఉపకులపతి డా. వి.ప్రవీణ్ రావు గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.