Heavy Rains Damage Crops: ఇటీవల కురిసిన అధిక వర్షాలకు ఇరు తెలుగు రాష్ట్రాలలో ఖరీఫ్‌లో సాగవుతున్న పంటలు నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులు ఆయా ఖరీప్ పంటల నష్ట నివారణకు కొన్ని యాజమాన్య సూచనలు పాటిస్తే ఆయా పంటల నష్టాన్ని నివారించవచ్చు.
వరి నారు :
నీటి ముంపుకు గురైన వరి నారు మళ్ళ నుంచి నీటిని బయటుకు తీయాలి. ఐదు సెంట్ల నారు మడికి ఒక కిలో చొప్పున కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు చల్లాలి. రెండు కిలోల యూరియ, ఒక కిలో పొటాష్ ఎరువులు చల్లాలి.
నాట్లు వేసిన వరి పైరు :
నాట్లు వేసినతరువాత ముంపుకు గురైతే, అధిక నీటిని బయటకు తీసి, ఎకరాకు 30 కిలోల యూరియ, 10 కిలోల పొటాష్ వేయాలి. పొలంలో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండి లేత పైరుకుళ్ళిపోతే, తిరిగి నాట్లు వెయ్యడం గాని లేదా మళ్ళీ దమ్ము చేసి మొకట్టిన వరి విత్తనం (తేలిక రకాలు అనువైనవి) డ్రమ్ సీడరుతో గాని లేదా వెద జల్లి గాని విత్తుకోవాలి. కలుపు మందులతో కలుపు నివారణ చేసుకొని ఇతర యాజమాన్య పద్దతులు చేపడితే పూర్తిపంటను తీసుకోవచ్చు.
ప్రత్తి పైరు :
ప్రస్తుతం ప్రత్తిపైరు పూత`కాత దశలో ఉంది. కొన్ని ప్రాంతాలలో పెరుగుదల దశలో ఉంది. పొలం నుండి నిల్వ నీటిని పిల్లకాలువల ద్వారా బయటకు తీసి, లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపిన కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు ద్రావణాన్ని చెట్టు ఆకులు, కొమ్మలు, మొదళ్ళు తడిచేటట్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 30 కిలోల యూరియ మరియు 15 కిలోల పొటాష్ ఎగువుల్ని మొక్కల మొదళ్ళ వద్దవేసి మట్టితో కప్పాలి. సూక్ష్మపోషక లోపాలు కనిపిస్తే లీటరు నీటికి 10గ్రా. పొటాషియం నైట్రైట్ మరియు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ కలిసిన మందు ద్రావణాన్ని ఆకులు, కాయలు తడిచేలా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గాక మొక్కల మద్య గొయ్యి గానీ గుంటక సేద్యం గానీ చేయాలి.
మొక్క జొన్న :
ఈ పైరు పెరుగుదల దశలో ఉంది. పొలం నుండి నిల్వ నీటిని బయటకు తీసి, ఎకరాకు 30 కిలోల నత్రజని (యూరియ) మరియు 15 కిలోల పొటాష్ ఎరువుల్ని మొక్కల మొదళ్ళ వద్ద వేసి మట్టితో కప్పాలి.
వేరు శనగ :
పొలంలోని అధిక నీటిని తొలగించిన తరువాత, లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపిన కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు ద్రావణాన్ని పైరు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు 0.2 శాతం ప్రొఫెనోఫాస్ ద్రావణం పిచికారీ చేయాలి. ఇనపధాతు లోప నివారణకు 0.2 శాతం ఫెర్రస్ సల్ఫేట్ G 0.1 శాతం సిట్రికామ్లం కలిపిన ద్రావణం పిచికారీ చేయాలి. సిట్రికామ్లానికి ప్రత్యామ్నాయంగా నిమ్మ రసం వాడవచ్చు.
కంది, ఇతర అపరాల పంటలు :
పొలంలోని అధిక నీటిని వీలైనంత త్వరగా బయటికి తీసి వేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 0.3 శాతం ద్రావణాన్ని మొక్కల మొదళ్ళు తడిచేలా పిచికారీ చేయాలి. పెరుగుదలకు 2 శాతం యూరియ ద్రావణం లేదా 1 శాతం పొటాషియం నెట్రేట్ ద్రావణం పైరుపై పిచికారీ చేయాలి.
చెరకు :
పొలం నుండి నిల్వ నీటిని బయటకు తీసివేయాలి. ఒరిగిపోయిన మొక్కలను నెలగట్టి వెదురు కర్రలతో ఊతం ఇవ్వాలి. 0.3 శాతం కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని మొక్కల మొదళ్ళు తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరాకు 30 కిలోల యూరియ G 15 కిలోల పొటాష్ ఎరువుల్ని మొక్కల మొదళ్ళలో వేసి మట్టితో కప్పాలి. పైరు తొందరగా తెరుకోవడానికి 1 శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పైరు ఆకులపై పిచికారీ చేయాలి.
Also Read: Terrace Cauliflower Farming: డాబాపై కాలీఫ్లవర్ ను పెంచుతున్న రైతులు.!
అరటి :
. నేలకు ఒరిగిన మొక్కలకు వెదురుతో ఊతం ఇచ్చి నిల బెట్టాలి.
. వర్షాలు తగ్గిన తరువాత మొక్కల మద్య ప్రదేశాలను గుంటకతోగాని, పవర్ టిల్లర్తోగాని గొప్పి చేయాలి. దీని వల్ల భూమి లోపలి పొరల్లోకి గాలి ప్రసరణ జరిగి, మొక్కలు కుదురుకొంటాయి.
. ప్రతి అరటి మొక్కకు 100 గ్రా. యూరియా, 80 గ్రా. పొటాష్ ఎరువు వేసి మట్టితో కప్పాలి.
. అరటి తోటలు గెలలు వేసినట్లయితే 0.5 శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణం ఆకులు, గెలలపై పిచికారి చేయాలి.
. వేరుకుళ్ళు తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా. చొప్పన కాపర్ ఆక్సీ క్లోరైడ్ పొడి మందు కలిపిన ద్రావణాన్ని మొక్కల వేళ్ళు తడిచే విధంగా మొక్కల మొదళ్ళ చుట్టూ చిలకరించాలి.
. ఆకుపై మచ్చల తెగులు నివారణకు 0.1 శాతం ప్రోపికొనజోల్ ద్రావణాన్ని ఆకులు మొవ్వులపై పిచికారీ చేయాలి.
మామిడి :
. పొలం నుండి అధిక నీటిని పిల్ల కాలువలు చేసి బయటకి తీసి వేయాలి.
. ఆకులపై మచ్చ తెగులు మరియు రసం పీల్చు పురుగు నివారణకు లీటరు నీటికి 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మరియు 1 గ్రా. కార్బండిజమ్ కలిపిన మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
. మొక్క తోటల పెరుగుదల కోసం 19-19-19 కాంప్లెక్స్ ఎరువు 0.5 శాతం ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి.
. తుఫాను గాలులకు మామిడి చెట్లు విరగకుండా తోట చుట్టూ గాలిని తగ్గించే చెట్లైన సుబాబుల్, సరుగుడు, తాడి చెట్లును పెంచాలి.
బొప్పాయి :
. వర్షపు నీటిని పొలం నుంచి బయటకి తీసి వేయాలి.
. 0.3 శాతం కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మెటలాక్సిల్ మందు ద్రావణాన్ని మొక్కల మొదళ్ళలో మట్టి తడిచేలా చిలకరించాలి.
. రసం పీల్చు పురుగుల నివారణకు ఇమిడా క్లోప్రిడ్ మందును లీటరు నీటికి 0.3 మి. లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
. ఇనుము, మెగ్నీషియం, జింకు, బోరాన్, మాంగనీస్ వంటి సూక్ష్మధాతు లోపాల్ని సవరించాలి.
మిరప :
. పొలం నుంచి వర్షపు నిల్వ నీటిని వీలైనంత త్వరగా బయటకు తీసివేయాలి.
. నేలకు ఒరిగిపోయిన మొక్కలను వెదురు కట్టెల సాయంతో నిలగట్టాలి.
. మొక్కలు తొందరగా తేరుకోడానికి 2% యూరియా ద్రావణం లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండు సార్లు పైరుపై పిచికారీ చేయాలి.
. మొక్కల మొదళ్ళలో 0.3 శాతం కాపర్‌ఆక్సీ కో్లంౖడ్ ద్రావణం పై పొర మట్టి తడిచేలా చిలకరించాలి.
. 0.5 శాతం సూక్ష్మధాతు మిశ్రమాన్ని వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
. ఎకరాకు 30 కిలోల యూరియ, 15 కిలోల పొటాష్ మరియు 200 కిలోల వేపపిండి కలిపి మొక్కల దగ్గర వేసి మట్టితో కప్పాలి.
పూలతోటలు :
. పొలంలోని నిల్వ నీటిని బయటికి పంపించాలి.
. 0.3 శాతం కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని మొక్కల మొదళ్లపై పిచికారీ చేయాలి.
. 2% యూరియ ద్రావణం లేదా 1% పొటాషియం నైట్రేటు ద్రావణం వారం వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి.
. ఆకు మచ్చ తెగులు నివారణకు ప్రోపికొనజోల్ ద్రావణం (లీటరు నీటికి 1 మి.లీ.) మొక్కల ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి.
. వర్షాలు తగ్గ్గని తరువాత మట్టిని మొక్కల మొదళ్ళలోకి ఎగదోయాలి.
. సిపార్సు చేసిన ఎరువులు, ఎకరాకు 30 కిలోల యూరియ G 15 కిలోల పొటాష్ పౖౖెపాటుగా వేయాలి.
Also Read: Ag.BSc Career Opportunities: అగ్రికల్చర్ బీఎస్సీ కెరీర్ అవకాశాలు.!