Tomato Pests and Diseases: పంటకి ఎక్కువ నీళ్లు లేదా ఎక్కువ వర్షాలు పడినప్పుడు పంటలో తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి. తెగులు నిరోధించడానికి రైతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. టమాట పంటలో ఎక్కువ వర్షాల కారణంగా తెగుళ్లని నివారించడానికి ఈ విధానాలని పాటించండి.
నారుకుళ్ళు తెగులు: ఈ తెగుళ్ళు ఆశించడం వలన, నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు. గుంపులు గుంపులుగా చనిపోతుంది. విత్తటానికి ముందు తప్పనిసరిగా 3 గ్రా. థైరం లేదా మాంకోజెట్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధితో 2-3 తడపాలి.
ఆకుమాడు తెగులు (ఎర్లీల్లైట్): ఆకుల మీద, కాండం మీద, కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి, క్రమేణా ఆకుల మాడి, ఎండిపోతాయి. మొక్క దశలో ఎప్పుడయినా ఆశించవచ్చు. తేమ ఉన్న చల్లని వాతావరణంలో, ఖరీఫ్ సీజనులో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు 3గ్రా. కాప్టాన్ లేదా మాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధితో 3 లేక 4 సార్లు పిచికారి చేయాలి.
Also Read: Nutrient Deficiency In Plants: మొక్కలో ఎరువుల లోపాన్ని గుర్తించి వాటిని నివారించడం ఎలా.?
వడలు తెగులు (బాక్టీరియల్ విల్ట్) : మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుమారి, తొడిముతో సహా రాలి పోతాయి . తరువాత మొక్క వడలిపోయి, చనిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తెగులును తట్టుకునే బిటి-1 వంటి రకాలను వాడుకోవాలి. నేల ఉదజని 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి.
వైరస్ తెగులు (టొబాకో మోజాయిక్): తెగులు సోకిన మొక్కల ఆకుల మీద, అక్కడక్కడ పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి, ఆకులు ముడుచుకొని, మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెళుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే రసం పీల్చు పురుగుల పేనుబంక నివారణకు అంతర్వాహిక కీటక నాశనులను పిచికారి చేసుకోవాలి.
టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్ : టమాట చిగురాకుల పై భాగంలో ఈనెలు గోధుమ వర్ణంకు మారి, ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి, మాడిపోతాయి. మొక్కలు గిడసబారి, పూత పిందె పట్టక ఎండిపోతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ ఒ డైమటాన్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. నారుమడిలో ముడికి 250గ్రా, నాటిన 10వ రోజున ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్ 3 15 గుళికలు వాడి పంటను ఈ వైరస్ తెగులు నుండి కాపాడుకోవచ్చు.