Carrot Cultivation: క్యారెట్ పంట శీతాకాలానికి అనువైన పంట. ఈ పంట 18° – 25° డిగ్రీలు గల తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అధిక దిగుబడులతో పాటు మంచి నాణ్యమైన దుంపలకు అనువైన వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఈ పంట 100 – 110 రోజులలో పంటకాలం పూర్తి అవుతుంది. పంట విత్తుకోవడానికి మంచి అనువైన కాలం ఆగస్టు నుండి జనవరి మధ్య కాలంలో విత్తుకోవడం మంచిది.
క్యారెట్ పంటకు అనువైన నేలలు నీరు ఇంకే సారవంతమైన నేలలు, ఎర్ర నేలలు, వదులుగా ఉండే నేలలు ఈ పంటకు అనువైన భూములు. కానీ బరువైన నల్లరేగడి నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు, క్షారత్వం ఎక్కువ ఉన్న నేలలు క్యారెట్ పంటకు ఏమాత్రం కూడా పనికి రావు.
విత్తనానికి సిద్ధం చేసుకున్న భూమిని నేల వదులుగా అయ్యేవరకు 2-3 సార్లు దున్నుకోవాలి. దుంప పంటలకు నేల ఎంత వదులు అయితే అంత మంచిది. చివరి దుక్కికి ముందు ఎకరానికి 10 – 12 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పోటాష్, 15 కిలోల నత్రజని వేసుకొని చివరి దమ్ము చేసుకోవాలి.
Also Read: Intercropping Onion: రెండు ఋతువులు మధ్య అంతర పంటగా ఉల్లి సాగు.!
ఎకరానికి 2 కిలోల విత్తనాలు అవసరం పడతాయి. విత్తుకునే ముందు పాటించవలసిన దూరాలు సాలుల మధ్య దూరం 30 సె.మీ. మొక్కల మధ్య దూరం 5 – 7 సే.మీ.లు ఉండేలా చూసుకొని విత్తనాలను విత్తుకోవాలి. ఈ విత్తనాలు చిన్న పరిమాణంలో ఉంటాయి, కిలో విత్తనంలో 3 కిలోల పొడి ఇసుకను కలుపుకొని విత్తుకోవడం మంచిది. ఈ పంట కోసం ఎత్తు మట్టి బెడ్లను ఏర్పాటు చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండిచడం ద్వారా దుంప ఎదుగుదల బాగుంటుంది. అలాగే దుంపకుళ్ళును కొంతవరకు నియత్రించవచ్చు.
వాతావరణ పరిస్తితిని బట్టి, భూమి యొక్క స్వభావాన్ని బట్టి అంచనా వేస్తూ 7-10 రోజులకు ఒకసారి నీటిని అందించాలి. డ్రిప్ ద్వారా నీటిని అందించినప్పుడు రోజుకి 1-2 గంటల సమయం వరకు అందించాలి.
విత్తుకున్న 48 గంటల లోపు పెండిమిథలిన్ ఎకరానికి 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1.25 లీటర్లు నేల పూర్తిగా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. 25-30 రోజుల మధ్య కలుపును అంతరకృషి ద్వారా తొలగించాలి. అంతరకృషి ద్వారా కలుపు తొలగించే సమయంలో మట్టిని మొక్క మొదలు వద్దకు ఎగత్రోయ్యాలి. ఇలా చెయ్యడం ద్వారా దుంప నెలలోనే ఉండటానికి సహాయ పడుతుంది. దుంప కూడా ఆకుపచ్చ రంగుకు మారకుండా నారింజ రంగులోనే ఉంటుంది. ఇలా క్యారెట్ పంటను సాగు చేయడం ద్వారా మంచి దిగుబడితో పాటు లాభాలు కూడా వస్తాయి.
Also Read: Mosambi: జూదంలా మారిన బత్తాయి సాగు