PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏటా మూడు దఫాలుగా పీఎం కిసాన్ నిధులు జమ చేస్తోంది. దేశంలో 18 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా రూ.2 వేల చొప్పున ఏటా రూ.6 వేలు జమ చేస్తోంది. 2018 లో మొదలైన ఈ పథకం ద్వారా రైతులకు ఇప్పటికే 14 దఫాలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.28 వేలు జమ చేశారు. ఈ మొత్తం త్వరలో పెంచాలని కేంద్రం భావిస్తోంది.
కిసాన్ కళ్యాణ్ యోజన
పీఎం కిసాన్ పథకానికి అధనంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సాయం అందుతుంది. ఏపీలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అధనంగా, మరో రూ.7500 జోడించి మొత్తం రూ.13500 అందజేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ రూ.6 వేలకు, మరో రూ.6 వేలు కలకిసాన్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా జమ చేస్తుంది. ఇలా దేశంలో చాలా రాష్ట్రాల్లో రైతుల ఖాతాల్లో నిధులు వేస్తున్నారు. సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
Also Read: PM Kisan Tractor Scheme: సగం ధరకే ట్రాక్టర్ కొనుక్కోవచ్చు.. ఎవరు అర్హులు.?
ఏటా మూడు దఫాలు ఎందుకంటే?
ఏటా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందుగా రూ.20 వేల కోట్లు, ఆ తర్వాత రబీ ప్రారంభంలో రూ.20 వేల కోట్లు, జనవరిలో రూ.20 వేల కోట్లు జమ చేస్తోంది. ఇలా ఏటా రూ.60 వేల కోట్లు రైతుల కోసం కేంద్రం ఖర్చు చేస్తోంది. గడిచిన ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కనీసం 50 శాతం అయినా పెంచే అవకాశం ఉందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
అప్పుల ఊబిలో రైతులు
సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిపోవడం, చీడపీడలు, వరదలు, కరవు పరిస్థితులతో పంట దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు ఏటా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రతి రైతు నెత్తిన రూ.70 వేల అప్పు ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఏపీలో ప్రతి రైతుపై సగటున రూ.2.7 లక్షల అప్పు ఉందని ఓ స్వతంత్ర్య సంస్థ ఇచ్చిన సర్వే ఆందోళన కలిగిస్తోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తున్నా, ప్రకృతి వైపరీత్యాలు రైతును కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. పంటల బీమా పధకం ఉన్నా, అది సక్రమంగా రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. వాతావరణ పంటల బీమా, పంట దిగుబడుల పై ఆధారపడి అమలు చేస్తున్న బీమా పథకాలు రైతును ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి.