వ్యవసాయానికి ద్రవ జీవామృతం, బీజామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రియ ఎరువులు వంటివి విత్తన శుద్ధి రసాయనం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంలో కేవలం దేశీ విత్తనాలనే విత్తుకొని సొంత విత్తన భాండాగారాలను ఏర్పాటు చేసుకోవాలి.
కీటక నాశనులు:
- నీమాస్త్రం:
కావాల్సిన పదార్థాలు:
100 లీటర్ల తాజా బోరు / బావి నీరు, 1 కేజీ నాటు ఆవు పేడ , 5 లీటర్ల నాటు ఆవు మూత్రం, 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు.
తయారీ:
ఈ పదార్థాలన్నింటినీ ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి బాగా త్రిప్పాలి. తర్వాత 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పివుంచాలి. రోజుకు రెండుసార్లు చొప్పున ఉదయం, సాయంత్రం 2 నిమిషాల పాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోసుకోవాలి. ఇదే నీమాస్త్రం. ఇలా తయారైన నీమాస్త్రాన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల, ఇతర చిన్న చిన్న పురుగుల నివారణకు ఉపయోగపడే ఈ ద్రావణాన్ని తయారుచేసుకున్న వారం రోజులలోపు వాడేసుకోవాలి.
- అగ్ని అస్త్రం:
కావలసిన పదార్థాలు:
నాటు ఆవు మూత్రం 20 లీటర్లు, దంచిన మిరపకాయలు 500 గ్రాములు, దంచిన పొగాకు 1 కిలో, దంచిన వెల్లుల్లి పేస్టు.
తయారీ:
పై పదార్థాలన్నింటినీ బానలో వేసి బాగా మరగ కాయాలి. 5 సార్లు పొంగు వచ్చే వరకూ మరగబెట్టి చల్లార్చాలి. 48 గంటలు పులియబెట్టిన తరువాత పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే అగ్ని అస్త్రం. ఎకరానికి 2 నుండి 2.5 అగ్ని అస్త్రాన్ని 100 లీటర్ల నీళ్లతో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు ఉపయోగపడే అగ్ని అస్త్రం 3 నెలల పాటు నిల్వవుంటుంది.
- బ్రహ్మాస్త్రం:
కావలసిన పదార్థాలు:
2 కిలోల మెత్తగా నూరిన వేపాకు ముద్ద, 2 కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 2 కిలోల పల్లేరు / మారేడు ఆకుల ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకుల ముద్ద, 20 లీటర్ల నాటు ఆవు మూత్రం.
తయారీ:
ముందుగానే వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి సిద్ధం చేసుకోవాలి. నూరిన ఆకు ముద్దను 20 లీటర్ల ఆవు మూత్రంలో బాగా ఉడికించాలి. 4 పొంగు వచ్చే వరకూ కాచి 24 గంటలపాటు చల్లారనివ్వాలి. తర్వాత ఆ ద్రవాన్ని పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే బ్రహ్మాస్త్రం. దీన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో 6 నెలల వరకూ నిల్వ చేసుకోవచ్చు. ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీళ్లతో కలిపి పంటకు పిచికారీ చేసుకోవచ్చు.
ఇతర కీటక నాశన కాషాయాలు:
- దశపర్ణి కాషాయం:
కావలసిన పదార్థాలు:
200 లీటర్ల నీరు, దేశీ ఆవు పేడ 2 కేజీలు, దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు, పసుపు పొడి 200 గ్రాములు, శొంఠి పొడి 200 గ్రాములు లేదా 500 గ్రాముల అల్లం పేస్టు, పొగాకు 1 కేజీ, పచ్చిమిర్చి పేస్టు / కారం పొడి 1 కేజీ, వెల్లుల్లి పేస్టు 1 కేజీ, బంతి పువ్వులు – ఆకులు – కాండం – 2 కేజీలు.
వీటిని ముందుగా ఒక డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ దిగువ పేర్కొన్న పది ఆకులను కలుపుకోవాలి.
వేపాకు 3కేజీలు, గానుగ ఆకులు 2కేజీలు, ఉమ్మెత్త ఆకులు 2 కేజీలు, జిల్లేడు ఆకులు 2 కేజీలు, సీతాఫలం ఆకులు 2 కేజీలు, మునగ ఆకులు 2 కేజీలు, ఆముదం ఆకులు 2 కేజీలు, బెలీ ఆకు/ లేంతెనా 2 కేజీలు, తులసి / అడవి తులసి 1/2 కేజీ, వావిలి ఆకులు 2 కేజీలు.
పైన పేర్కొన్న వాటన్నింటినీ డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. డ్రమ్ములో వేసిన పదార్థాలను రోజుకు 3 సార్లు కుడిచేతివైపునకు మూడు నిమిషాలపాటు త్రిప్పాలి. ఇలా 40 రోజుల పాటు ప్రతిరోజూ 3 నిముషాలు త్రిప్పాలి. ఇదే దశపర్ణి కాషాయం. ఈ కషాయాన్ని 41 వ రోజున పల్చటి కాటన్ గుడ్డతో వడబోసుకోవాలి. ఈ కషాయాన్ని 6 నెలలపాటు వాడుకోవచ్చు. 200 లీటర్ల నీటిలో 6 నుండి 10 లీటర్ల కషాయాన్ని కలిపి వాడుకోవాలి. ఈ మోతాదు ఒక ఎకరానికి సరిపోతుంది. దశపర్ణి కాషాయం వరిలో రసం పీల్చే పురుగులను, మామిడిలో బూడిద తెగులును నివారిస్తుంది.
శీలింధ్ర / ఫంగస్ నాశనులు:
- గోబాణం: 100 లీటర్ల నీటిలో 6 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి ఒక ఎకరం పంటపై పిచికారీ చేస్తే పంటను ఫంగస్ బెడద నుండి కాపాడుకోవచ్చు. దీన్ని గోబాణం అని అందురు.