Mango Orchards: పంట కోత తర్వాత మామిడి మొక్కలు చాలా శక్తిని పండ్ల ద్వారా కార్బోహైడ్రేట్లు, నీరు కోల్పోవుట వలన, జూన్, జూలై మాసములలో చెట్లు చాలా బలహీనంగా, పెరుగుదల లేకుండా నిద్రావస్థ దశలో ఉండి చెట్లలో ఎండు కొమ్మలు కూడ కనిపిస్తాయి. నీటి వసతి లేని తేలికపాటి నేలలలో, నేలలోతు తక్కువగా ఉన్న భూములలో, నేలలో బండరాయి ఉన్నప్పుడు, నీటి ఎద్దడి కారణంగా మామిడి చెట్లు బెట్టకు గురి అయి, ఆకులు పసుపు వర్ణముగా మారి, చిన్న చిన్న కొమ్మలు ఎండిపోయి కాలినట్లుగా అగుపిస్తాయి. కొన్ని సార్లు చెట్లుకూడా ఎండిపోయే అవకాశం వుంది. అంతేకాకుండా చెట్లు బలహీనమై దిగుబడిని తక్కువగా ఇస్తూ, కాపును కూడా రెండు సంవత్సరాల కొకసారి ఇస్తూ, ఎండు పుల్లలు చెట్టులో అధికమై ముదురు చెట్లు చనిపోవును. ప్రతి సంవత్సరము మంచి కాపు, ఆదాయాన్ని పొందడంతోపాటు, కాపుకాసే ముదురు చెట్లు ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే తోటలపై వచ్చే ఆదాయములో 10 శాతమును తోటల యాజమాన్యం ఎరువులు, పురుగు మందులు, దుక్కి, నీటివసతి, కూలీల ఫై ఖర్చు పెట్టి సకాలంలో శ్రద్ధ తీసుకొవాలి.
సాధారణముగా ముదురు తోటలలోని చెట్లు, లేత తోటల కన్నా ఆలస్యముగా పూతకు వచ్చి కాపుకు కూడ ఆలస్యముగా వస్తాయి. అయితే బాగా శ్రద్ద తీసుకొన్న ముదురు తోటలలోని చెట్లు, యాజమాన్య పద్ధతులను సరిగా పాటించని తోటల కంటె ముందుగా కోతకు వచ్చును. ముందుగా కోతకు వచ్చినప్పుడు మంచి రేటు లభించును అంతేగాకుండా ముదురు చెట్లపైన కోత దశకు వచ్చిన కాయలను పరిపక్వదశకు రాకముందే కోయవలెను. వండిన కాయలను చెట్లపై ఆలస్యముగా కోసినట్లయితే చెట్లు ఎక్కువ శక్తిని కోల్పోయి బలహీనమై ఎక్కువ ఎండు పుల్లలు పడతాయి.
Also Read: Banana Varieties Cultivation: భారతదేశంలో అరటి పండులో ఇన్ని రకాలు సాగులో ఉన్నాయి.!
యాజమాన్య పద్దతులు:
పండ్ల కోత:
1. కోత దశకు వచ్చిన కాయలను పరిపక్వ దశ మాగిన దశ, పండు దశకు వచ్చే వరకు ఆగకుండా త్వరగా చెట్టు నుండి కోయాలి.
యూరియ పిచికారి:
1. కోత కోసిన వెంటనే జూన్ మాసంలో నిద్రావస్థ దశలో ఉన్న చెట్లపై 1 శాతం యూరియా ద్రావణాన్ని10 గ్రా. యూరియా, లీ. నీటికి, 0.5 శాతం జింక్ సల్ఫేటుతో 5గ్రా./లీ. నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే త్వరగా చెట్లు కొలుకొని క్రొత్త చిగుర్లు పెట్టును. ఒక శాతం చక్కెర ద్రావణముతో కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.
2. నీటి వసతి ఉన్న తోటల్లో జూన్ మాసంలో నీటి తడిని ఇచ్చినట్లయితే వెంటనే మొక్కలు నీటి ఎద్దడి నుండి తేరుకొంటాయి.
కత్తిరింపులు:
వర్షాలు పడిన తర్వాత జూలై మాసములో ప్రతి సంవత్సరము చెట్లపై ఉన్న ఎండు కొమ్మలు, రోగమున్న కొమ్మలు, భూమిని ఆనుకొన్న కొమ్మలు, అడ్డదిడ్డమైన కొమ్మలను కత్తిరించాలి. అపుడపుడు వీటితోపాటు ఎక్కువ వయసున్న చెట్లలో మధ్య కొమ్మలను సెంటర్ ఓపన్ చేయుట, లోపలి కొమ్మలను కొన్నింటిని తొలగించుట వలన ఎండ, గాలి బాగా తగిలి, ఆహారము తయారు చేసుకొని, కొత్త కొమ్మలు వచ్చి అధిక దిగుబడులను ఇస్తుంది. దీనినే పునరుద్ధరణ అంటారు. కత్తిరి, పులు చేసిన తర్వాత మైలతుత్తం ద్రావణాన్ని 5 శాతం కొమ్మలకు పూసి, కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని 3గ్రా./లీటరు నీటికి చెట్లపై పిచికారి చేయాలి. ఎండుకొమ్మలలో రోగాన్ని నష్టాన్ని కలుగచేసే శిలీంద్రాలు, పురుగులు ఆశ్రయం పొందుట వలన కత్తిరించిన ఎండు కొమ్మలను కాల్చి వేయవలెను. గత సంవత్సర కాపు కాసి కొమ్మల చివర్లను కత్తిరించడం వలన అక్కడ నుంచి ఎక్కువ కొమ్మలు వచ్చి అధిక దిగుబడికి దోహదపడుతుంది.
ఒకటి లేక రెండు వర్షాలు పడిన తర్వాత, తోటలలో వాలుకు అడ్డముగా చెట్ల మధ్యన దున్నాలి. దీని వలన వర్షపు నీరు భూమిలో ఇంకిపోతుంది. మన తోటలోని వర్షం నీటిని బయటికి పోనివ్వరాదు. ముదురు చెట్లలో అంతరపంటలుగా అల్లం, పసుప పెంచుకొనవచ్చు. లేత తోటలలో పిల్లిపెసర, జనుము, మినుము లాంటి పైర్లను చెట్ల మధ్యన పెంచి వర్షా కాలములో భూమిలో కలియదున్నాలి. దీని వలన కలుపు అరికట్టబడటంతో పాటు భూమి కూడ సారవంతము అవుతుంది.
కలుపు తీయుట:
తోటలలో, పాదులలో గడ్డి మొక్కలు, ఎకవార్షిక, బహువార్షిక కలుపు మొక్కలను వర్షాలు పడిన వెంటనే తొలగించాలి. ఈ కలుపు మొక్కలపై అనేక పురుగులు, రోగాన్ని కలిగించే శిలీంద్రాలు ఆశ్రయం పొంది వీటి సంఖ్యను అభివృద్ధి చేసుకొన్న తర్వాత మామిడి మొక్కలకు నష్టం కలుగజేస్తాయి. మొక్క యొక్క విస్తీర్ణాన్ని బట్టి పాదులను ప్రతిసంవత్సరము పెంచుతూ పోవాలి.
సమగ్ర ఎరువుల యాజమాన్యం:
ముదురు చెట్ల పాదులలో తేమ ఉన్నప్పుడు, కలుపును తొలగించిన తర్వాతనే ఆగష్టు, సెప్టెంబరు మాసాలలో ముఖ్యముగా పశువుల ఎరువు 40 కిలోలు, వేపపిండి 10 కిలోలు లేదా వర్మికంపోస్టు 10 కిలోలతో పాటు 2 కిలోల యూరియా, 6 కిలోల భాస్వరము, 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషను ఒక్కొక్క చెట్టుకు వేసి మట్టిలో కలపాలి. తేమలేనట్లయితే తడిని ఇవ్వాలి. అవసరమయినట్లయితే 100గ్రా. జింకుసల్ఫేట్‌ను కూడా నేలకు అందివ్వాలి.
చెదలు: జూలై, ఆగష్టు మాసములలో తోటలలో ఉన్న చెదపుట్టలను తొలగించి రాణి పురుగుతో సహా నాశనం చేసి, పుట్టలలో క్లోరిపైరిఫాస్ ద్రావణము 5 మి.లీ. లీటరు నీటిని పోయాలి. తిరిగి నవంబరు లేదా డిసెంబరు నెలల్లో – క్లోరిపైరిపాస్ ద్రావణము 5 మి.లీ. లీటరు నీటిని పోయాలి. తిరిగి నవంబరు, డిసెంబరు నెలల్లో క్లోరిపైరిపాస్ ద్రావణాన్ని కాండము, కొమ్మలు బాగుగా తడిచేటట్లుగా పిచికారి చేయాలి.
ఆకులు గూడుకట్టు పురుగు:
ముఖ్యముగా ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈ పురుగు, మామిడి ఆకులను గూడుగా చేసి తినుటవలన చాలా నష్టం జరుగుతుంది. ఈ గూళ్లను దోటీ కర్రలతో తొలగించి మోనోక్రోటోఫాస్ లేదా డైమిథోయేట్ ద్రావణంతో 2 మి.లీ/లీటరు పిచికారి చేయాలి. కాండం తొలుచు పురుగు, బెరడు తొలుచు పురుగు. ఇవి ఎక్కువగా ముదురు చెట్లలో ఉంటాయి.
పిండినల్లి పురుగు:
కత్తిరింపులు చేసిన వెంటనే వీటిని గుర్తించి తొలగించి, నువాన్ ద్రావణాన్ని రంధ్రాలలో పోసి మట్టితో కప్పాలి. ఈ పురుగు వర్షాకాలములో గ్రుడ్లను మొక్కల పాదులలో పెట్టుటవలన వీటి నిర్మూలనకు మిథైల్ పరథియాన్ పొడి మందును పాదులలో చల్లాలి. కాండం మొదలుకు ఒక అడుగు ప్లాస్టిక్‌ను చుట్టి అపుడప్పుడు మొదలుకు పురుగు మందును మిథైల్ పరథియాన్ 2 మి.లీ/లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకుమచ్చ తెగులు:
కొత్త చిగుళ్ళు వర్షాకాలములో వచ్చినప్పుడు చిగుర్లు ఎండిపోయి, కాల్చినట్లుగా కనిపిస్తాయి. డైథేన్ యమ్-45, 3 గ్రాములు ఒక లీటర్ నీటిలో లేక కార్బండిజమ్ 1 గ్రాములు ఒక లీటర్ నీటిలో ఒకటి లేక రెండుసార్లు అవసరాన్ని బట్టి పిచికారి చేయాలి. వర్షాదారపు తోటలలో కొన్ని సంవత్సరాలు సరిగా వర్షాలు పడనపుడు భూమిలో మొక్కలకు ఎరువులు వేయడం కుదరకుంటే పిచికారి ద్వారా పోషకాలను మొక్కలకు ఒకటి లేక రెండుసార్లు ఇవ్వటం మంచిది.
Also Read: Beetroot Cultivation: బీట్ రూట్ సాగు విధానాలు, సూచనలు.!