Rayalaseema Drought: ఏపీలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో నేటికీ సరైన వర్షపాతం నమోదు కాలేదు. ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా నేటికీ పంటలు పడలేదు. చాలా గ్రామాల్లో సగం భూమిలో కూడా సాగు మొదలు కాలేదని రైతులు చెబుతున్నారు. టమాటా పంటకు ఊహించని ధర రావడంతో కొందరు రైతులు పెద్ద ఎత్తున నర్సరీలు పెంచారు. 40 రోజుల కిందట నారు పోయడం తో నేరుగా మొక్కలు సిద్ధం అయ్యాయి. అయితే రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో నీరు లేక పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు.
టమాటా, మిర్చి నారు కొనేవారు లేరు
చిత్తూరు,అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లా తనకల్లు, పెద్దపల్లి, నల్లచెరువు, ములకలచెరువు,పూలకుంట, అమడగూరు ప్రాంతాల్లో వారు సిద్ధంగా ఉన్నా వర్షాలు లేకపోవడంతో కొనే వారు ముందుకు రావడం లేదు. అన్నమయ్య జిల్లాలోని కొత్తకోట, తంబాలపల్లి, పెద్దతిప్ప సముద్రం ప్రాంతాల్లో, కర్నాటకలోని చేలూరు, చాకివేలు, బిళ్లూరు ప్రాంతాల్లో నర్సరీ యజమానులు పెద్ద ఎత్తున నారు సిద్దం చేశారు. సకాలంలో వర్షాలు లేకపోవడం, విపరీతమైన ఎండలతో రైతులు నారు కొనేందుకు ముందుకు రావడం లేదు.
Also Read: Farmer Success Story: అర ఎకరంలో అద్భుతాలు సృష్టిస్తున్న మాజీ సైనికుడు
నర్సరీ రైతులకు తీవ్ర నష్టం
చాలా ఖరీదైన విత్తనాలు కొనుగోలు చేసి నర్సరీ రైతులు నారు మడులు సిద్దం చేస్తూ ఉంటారు. ఇందుకు లక్షల్లో పెట్టుబడి అవుతుంది. ఏటా వందలాది రైతులు వర్షాలు రాగానే నారు కొనుగోలు చేసి టమాటా, మిర్చి సాగు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది నారు నాటడానికి సిధ్ధంగా ఉన్న రైతులు మాత్రం ముందుకు రావడం లేదు. చాలా ప్రాంతాల్లో చినుకు లేకపోవడమే అందుకు కారణం. బోరు నీరు సదుపాయం ఉన్న కొద్ది మంది రైతులు మాత్రమే టమాటో, మిర్చి సాగు చేస్తున్నారు. తెలుగుగంగ, హంద్రీ నీవా,కేసీ కెనాల్‌కుకూడా సాగు నీరు విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ముగింపు దశకు వచ్చిన కాలువలకు నీరు వదలక పోవడం మూడు దశాబ్దాల్లో ఇదే మొదటిసారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరో నెల రోజులు చాలా కీలకం
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నేటికీ సరైన వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ప్రధాన ప్రాజెక్టుకు నీరు చేరలేదు. ఎగువ నుంచి కూడా వరద నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరో నెల రోజులు వర్షాకాలం ముగిస్తే ఇక సాగునీటిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికే రైతులు వరి సాగుకు స్వస్థి పలికారు. ఆరుతడులైనా ఇస్తే పంటలు సాగు చేయాలని చూస్తున్నారు. అసలు కాలువలకు నీరు వదిలే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీశైలం పూర్తి సామర్థ్యంలో సగం కూడా నీరు నిండలేదు. ఇక నాగార్జున సాగర్ వెలవెల పోతుంది. దీంతో రైతులు సాగుకు దూరం జరుగుతున్నారు.
Also Read: Agricultural Change: క్షేత్రస్థాయిలో పలు వ్యవసాయ విధానంలో మార్పులు.!