Oil Palm Farmers: తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి మరియు నల్గొండ జిల్లాలో సాగునీటి ఆధారంగా ఆయిల్ పామ్ పంటను తెలంగాణ రాష్ట్రంలో 16,912 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పంటను ముఖ్యంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం మరియు నెల్లూరు జిల్లాలో పండిస్తున్నారు. ఆయిల్ పామ్ అనేది ఒక్క దీర్ఘకాలపు పంట. ఆయిల్ పామ్ పంట వేసిన మొదటి మూడు సంవత్సరాల వరకు మనకు ఫలసాయం అనేది చేతికి రాదు. నీటి వసతి సమృద్ధిగా ఉన్న ఆయిల్ పామ్ తోటల లోని ఖాళీ స్థలంలో మొదటి మూడేళ్ళ వరకు మరియు ఎనిమిదేళ్ళ పైబడిన తోటలలో అంతర పంటలు వేసుకోని దీని ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
సాగు పెంచేందుకు ప్రయత్నాలు
తెలంగాణ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది.
నిరుడు రూ.23 వేలు ఉన్న టన్ను పామాయిల్ గెలల ధర నేడు రూ.12,800 అయ్యిందని, సగానికి సగం ధర తగ్గిందని ఇలాగైతే తామెలా బతకాలని ఆంధ్రప్రదేశ్ పామాయిల్ రైతులు దిగులు చెందుతున్నారు. ప్రభుత్వాలు పామాయిల్ సాగు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నా, తమ సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చొరవ చూపడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుటికైనా మద్దతు ధరను ప్రకటించాలని పామాయిల్ రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా ధరలకు రేటు రాకపోతే నష్టాల్లో కూరుకుపోతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
2022 మేలో టన్ను పామాయిల్ గెల ధర సుమారు రూ.23 వేలు ఉండగా, 2023 జులైలో ఇది రూ.12,800కి తగ్గింది. ఏడాదిన్నర కాలంలో టన్నుకు రూ.10 వేలకు పైగా ధర తగ్గిపోయింది. కౌలు ధరలు పెరిగాయి. దీంతో పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. కానీ రేటు మాత్రం పూర్తిగా పడిపోయింది. అనేక పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు ఇప్పుడు పామాయిల్ సాగు చేసి కాస్త గట్టెక్కవచ్చని భావించిన రైతులకు నిరాశే ఎదురు అయింది. పంట వేసిన నాలుగేళ్ల వరకు ఆదాయం ఉండదని అయినా కూడా పెట్టుబడులు పెట్టి తోటలను పెంచామని తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ధరలు పడిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.
పామాయిల్ ఉత్పత్తిలో 90 శాతం వాటా ఏపీదే
దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి పెంచాలనే సంకల్పంతో పామాయిల్ సాగును పెంచుతోంది. దేశంలో పామాయిల్ సాగు విస్తీర్ణంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పామాయిల్ సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో పామాయిల్ ధరల పతనం ప్రభావం కూడా ఇక్కడి రైతులపైనే ఎక్కువగా ఉంటుంది. నిజానికి భారతదేశం ప్రపంచంలోనే పామాయిల్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం. దాని పామాయిల్ డిమాండ్‌లో 90 శాతానికి పైగా దిగుమతుల ద్వారా తీర్చబడుతుంది. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని 2025-26 నాటికి 10 లక్షల హెక్టార్లకు, ఆపై 2029-30 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. మరీ రేట్లు ఇలా తగ్గితే రైతులు సాగు విస్తీర్ణాన్ని పెంచుతారా లేదో చూడాలి.
Also Read: