Protection of Crops from the Pests: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడడక్కడా వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు.
సరైన పద్ధతులు పాటిస్తే పంటలను చీడపీడల నుంచి పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. అన్ని పంటల్లో కాలువలోతు నీళ్లు ఉండిపోయాయి. ముందు నీటిని బయటకు తీసివేయాలని అధికారులు చెబుతున్నారు. కలుపును తొలగించడం వల్ల మొక్కల పెరుగుదల బాగుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వరి: వరి సాగులో ఇప్పటి వరకు నార్లు పోసుకొని ఉన్న రైతులు దమ్ము చేసిన పొలాల్లో స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేసుకుని నేరుగా విత్తనం వెదజల్లు కోవాలి. ఒకవేళ తప్పనిసరిగా నార్లు పోసుకోవాలనుకునే రైతులు జేజీఎల్ 24423, కేఎన్‌ఎం 118, జేజీఎల్ 18047, ఎంటీయూ 1010, సన్న గింజల రకాలు.. ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్ 962 రకాలను ఎంపిక చేసుకొని ఎకరానికి 20-25 కిలోల వరి విత్తనాన్ని ఉపయోగించి నారు పెంచి 20-25 రోజుల వయస్సు గల నారుతో నాట్లు పూర్తి చేసుకోవాలి. కొత్తగా వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి 800 గ్రాముల కార్బొఫ్యూరాన్ 3జి గుళికలను ఇసుకలో కలిపి నారుమడిలో చల్లుకోవాలి. ముదురు నారుతో నాట్లు వేసినట్లయితే ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించాలి.
పత్తి: పత్తి విత్తుకునే సమయం పూర్తిగా దాటిపోయింది. అందువల్ల ఇప్పుడు పత్తి వేయవద్దు. ఇప్పుడు వేస్తే సరైన పెరుగుదల లేక పూత వచ్చి దిగుబడులు తగ్గిపోతాయి. అంతేకాకుండా అధిక వర్షాలతో నేలలో తేమ ఎక్కువగా ఉండి ఆంథోసయనిన్ పిగ్మేంట్ గాఢత పెరగడం వల్ల ఆకులు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. ఇది చూడడానికి మెగ్నీషియం ధాతువు లోపం లాగా కనబడుతుంది. వర్షం వల్ల పంట దెబ్బతింటే మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిసేటట్లు పిచికారి చేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పై పాటుగా మొక్కలకు 3-5 సెం.మీ. దూరంలో అంతే లోతులో వేసి మట్టితో కప్పాలి.
కంది: గత సంవత్సరంతో పోలిస్తే ప్రసుత్తం కంది విస్తీర్ణం 1.5 లక్షల ఎకరాల్లో తక్కువగా ఉంది. దేశంలో 15లక్షల ఎకరాల్లో సాగు లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం కంది పంటకు ధర అధికంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రస్తుతం కంది పంటను విత్తుకోవచ్చు. మధ్య, స్వల్పకాలిక కంది రకాలైన వరంగల్ 97 లాంటి రకాలను ఎంపిక చేసుకొని మొక్కల మధ్య ఎడం తగ్గించి ప్రస్తుత సమయంలో విత్తుకోవచ్చు.
నువ్వులు: నీటి వసతి ఉన్న ప్రాంతాలు, కాలువ ద్వారా నీరు వచ్చే ప్రాంతాల రైతులు ఆగస్టు 31 వరకు శ్వేత, జేసీఎస్1020, జేసీఎస్ 2454, హిమ రకాలను ఎంపిక చేసుకొని విత్తుకోవచ్చు. పంటను చీడపీడల నుంచి రక్షించుకునేందుకు కిలో విత్తనానికి 3 గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్, 13 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మందును వేసుకోవాలి.
చెరుకు: అధిక వర్షాలకు చెరుకు గడలు / మొక్కలు నేల రాలకుండా నివారించడానికి ఎండిన ఆకులతో మొక్కలను జడలు అల్లుకోవాలి. వానలు తగ్గిన తర్వాత ఎకరాకు 50కిలోల పోటాష్ మరియు 50కిలోల యూరియా మొక్కల మొదళ్ళ దగ్గర వేసి గుంటలు చేసి కప్పుకోవాలి. ఈసంవత్సరం కేంద్రం మద్దతు ధరలను పెంచింది. కాబట్టి రైతులు పంటను కాపాడుకోవాలి.
మొక్కజొన్న: 95 నుంచి 105 రోజుల మధ్యకాలిక సంకరాలైన డీహెచ్‌ఎం 117, 90-95 రోజుల పంటనిచ్చే డీహెచ్‌ఎం 121 లేదా స్వల్పకాలిక సంకరాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో విత్తిన మొక్కజొన్న పైరులో కత్తెర పురుగు ఆశించే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి నివారణకు 6.0 మి.లీ. సయాంట్రానిలిప్రోల్, థయోమిథాక్సాం మందును కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవాలి. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత కూడా పంటను బట్టి ఎరువులను పిచికారీ చేసుకోవాలి. పంటలో కత్తెర పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున, లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.
Also Read: