China’s Engagement in Agriculture: చైనాలో నిరుద్యోగం తాండవిస్తోంది. డ్రాగన్ కంట్రీ అమెరికాను దాటిపోతుందని చంకలు గుద్దుకుంటోన్న సమయంలో ఆ దేశంలో కంపెనీల ముందు వేలాడుతోన్న నో వెకెన్సీ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ముఖ్యంగా హాకాంగ్ సమీపంలోని మేన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఉన్న గ్వాంగ్డోంగ్ ప్రావిన్స్ లో ఎక్కడ చూసినా కంపెనీల ముందు నో వెకెన్సీ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. అసలు చైనాలో నిరుద్యోగం ఇంతలా పెరిగిపోయిందా. ప్రపంచానికి కనిపించే చైనా కాకుండా మరో చైనా ఉందా అనే అనుమానం కలుగుతోంది.
యువతా వ్యవసాయం చేసుకో
చైనాలో యువత పెద్ద ఎత్తున పట్టణాల భాట పట్టింది. డిగ్రీలు చదివి ఉద్యోగ వేటలో వారు పట్టణాలు చేరుతున్నారు. ఏదొక ఉద్యోగం దొరక్క పోతుందా అని వారు ప్రధాన పట్టణాలకు వలస వెళుతున్నారు. అక్కడ కంపెనీల ముందు వేలాడుతోన్న నో వెకెన్సీ బోర్డులు చూసి యువత నిరుత్సాహ పడుతున్నారు. అలాంటి వారికి గ్వాంగ్డోంగ్ రాష్ట్రం చక్కని సలహా ఇచ్చింది. చదువుకున్న యువత అందరూ ఉద్యోగాల కోసం ఎగబడకుండా చక్కగా మీ ఊరు వెళ్లి వ్యవసాయం చేసుకోవాలన సూచించింది. దీంతో యువతకు చిర్రెత్తుకొస్తోంది. చదువుకుని ఉద్యోగం చేద్దామనుకుంటే, వీరేంటి ఇలా చెబుతున్నారంటూ వారు ఆందోళన చెందుతున్నారు.

China’s Youth Engagement in Agriculture
Also Read: Aranya Permaculture: యువతీ యువకులకు దిక్సూచిగా మారిన అరణ్య పర్మాకల్చర్.!
చైనాలో బుసలు కొడుతోన్న నిరుద్యోగం
చైనాలో నిరుద్యోగం రెండు శాతానికి చేరింది. ఎన్నడూ లేని విధంగా కోవిడ్ సమయంలో అనేక కంపెనీలు మూతపడ్డాయి. అవి నేటికీ కోలుకోలేదు. దీంతో చైనాలో నిరుద్యోగం పెచ్చుమీరిపోయింది. దీనికితోడు కోవిడ్ తరవాత అనేక దేశాలు చైనాపై ఆంక్షలు విధించాయి. దీంతో చైనాలోని తయారీ రంగ కుదేలైంది. చైనా యువతకు అండగా నిలవాల్సిన తయారీ రంగం దివాళా తీయడంతో అక్కడ నిరుద్యోగం బుసలు కొడుతోంది.

China’s Engagement in Agriculture
ఎప్పటికి పరిస్థితి చక్కబడుతుంది
చైనాలో ఏటా 2 కోట్ల మంది యువత చదువులు పూర్తి చేసుకుని జాబ్ మార్కెట్లో అడుగు పెడుతున్నారు. అయితే ఏటా కోటి మందికి కూడా ఉద్యోగాలు లభించడం కష్టంగా మారింది. దీంతో చైనాలోని చాలా రాష్ట్రాలు చదువుకున్న వారు వ్యవసాయం చేసుకుని జీవించాలని సలహా ఇస్తున్నారు. దీంతో చైనాలో గ్రామీణ ప్రాంతాలకు యువత పయనమవుతోంది. అనేక గ్రామాల్లో యువత వ్యవసాయం చేసుకునేందుకు సిద్దం అవుతోంది. చాలా మంది చదువులు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో చేసేది లేక సాగుబాట పట్టారు.దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పన్నులు తక్కువగా ఉండటం, ప్రభుత్వం కూడా వ్యవసాయరంగానికి పెద్ద ఎత్తున రాయతీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇవన్నీ చైనా యువత వ్యవసాయంరంగంలోకి మళ్లేందుకు సహాయపడుతున్నాయి. ఈ విధంగా చైనా నిరుద్యోగం తగ్గంచే ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: Minister Niranjan Reddy: ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లా యువ రైతులు – మంత్రి