Telangana Rains: సంవత్సరంతా కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. ఏకధారగా కుంభవృష్టి వర్షం కురుస్తునే ఉంది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల మొత్తం జలమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి లక్ష్మీదేవిపేటలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతమని వెల్లడించింది.
గతంలో 2013 జూలై 19న వాజేడులో 51.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం వర్షం కురిసింది. హైదరాబాద్లో గత 6 గంటల్లో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ సీజన్లో ఇప్పటి వరకూ 60 శాతం అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. సగటు సాధారణ వర్షపాతం కంటే ఇది 60 శాతం అధికమని పేర్కొంది.
Also Read: Minister Niranjan Reddy: 24 గంటలు కరెంటు ఉందంటే అది తెలంగాణ మాత్రమే.!
బీజీబీజీగా అన్నదాతలు
ఈఏడాది అనుకున్న స్ధాయి కంటే వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో అన్నదాతల సాగు పనులు జోరందుకున్నాయి. అందరికి అన్నం పెట్టే అన్నదాత వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నాడు. జూన్లో కొంత తగ్గుముఖం పట్టినా జూలైలో ఏకధాటిగా వాన పడుతోంది. ఫలితంగా కర్షకులు పనుల్లో బిజీబిజీగా మారిపోయారు. పత్తి, సోయా, మక్క, కందులు, పెసర్లు, మినుము పంటలు వేయగా పక్షం రోజుల్లో నాట్లు కూడా పూర్తికానున్నాయి. రాష్ట్ర సర్కారు పూర్తిస్థాయిలో సహకరిస్తుండడంతో రైతులు ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఆధికార యంత్రాగం రైతులకు అందుబాటులో విత్తనాలు ఉంచడంతో అన్నదాతలు సమాయత్తం ఆవుతున్నారు. ప్రస్తుతం చెరువులు, ప్రాజెక్టుల కింద రైతులు నాట్లు వేస్తున్నారు. అంతేకాకుండా అంచనాలకు మించి వరి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
అందుబాటులో ఉంచిన ఎరువులు
సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులన్ని చక్కచక్క సాగిపోతున్నాయి. వర్షాలు కూడా రికార్డుస్థాయిలో కురవడంతో ఎవరి పనుల్లో వాళ్లు తలమూనకలవుతున్నారు. మరో పక్షం రోజుల్లో నాట్లు కూడా పూర్తయ్యే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. . ఈనెల మొదటి వారం నుంచి పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 45 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని ముందుగానే అంచనా వేసి అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు అవసరమైన ఎరువులు పంపిణీ చేసి, మిగతా వాటిని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. అయితే ఆధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్శపాతం నమోదైంది. 24గంటల్లో ములుగుజిల్లాలో 64 సెంమీ వర్షపాతం కురిసింది.