Finger Millet Cultivation: రాగి చిరుధాన్యాలలో ముఖ్యమైన ఆహారపు పంట. రాగి పిండిని అనేక ఆహారపు వంటకాలలో వాడుతారు. దీని నుండి ప్రత్యేకమైన తినుబండారాలైన చాకొలేట్లు, లడ్డూలు, దోసెలు, పాయసం, అనేక ఇతర తిను బండారాల తయారీలో వాడుతారు. ఆహారపు పంటలు అన్నిటిలో కన్నా రాగిలో కాల్షియం ఎక్కువగా లభించడం వలన రాగి మాల్ట్ రూపంలోనూ, చిన్న పిల్లల ఆహారాల తయారీలోనూ వాడుతారు.
చక్కర వ్యాధిని అధికం కాకుండా ఉంచడానికి రాగిని దేశ వ్యాప్తంగా వాడుతున్నారు. రాగిని కొన్ని ప్రాంతాలలో పశువుల ఆహారంగా కూడా వాడుతారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రాగి పంటని 1.13 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, మహబూబ్ నగర్, విజయ నగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి 49 వేల టన్నులుగా వస్తుంది. ఎకరానికి 4.35 క్వింటాళ్ళ దిగుబడి పండిస్తున్నారు. భారతదేశంలో కర్ణాటక, ఒడిశా, బీహారు, ఉత్తర ప్రదేశ్, తమిళ నాడు రాష్ట్రాలలో కూడా రాగి పంటని పండిస్తున్నారు.
ఉత్తరకోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ముందుగా పడిన వర్షాలను ఆధారం చేసుకొని వరి పండించే పంట పొలాలలో అదనంగా ఒక పంటగా “రాగి పంటని” పండిస్తున్నారు. వరి కోసిన తర్వాత మాగాణి నేలలలోనూ, తోట భూములలోనూ కొద్ది పాటి నీటి పారుదల క్రింద రాగి పంటని రెండవ పంటగా సాగు చేస్తున్నారు..
విత్తనం: 2.5 కిలోల విత్తనంతో ఐదు సెంట్ల పొలంలో పెంచిన నారు ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది. పంపిణీ పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం కావాలి.
విత్తన శుద్ధి: కిలో విత్తనాన్ని రెండు గ్రాముల కార్బండిజం లేదా మూడు గ్రాముల మాంకోజబ్తో కలిపి విత్తన శుద్ధి చేయాలి.
విత్తనాలు వితే పద్దతి: తేలిక పాటి దుక్కి చేసి విత్తనం చల్లి, పట్టె తోలాలి. నారు పోసి నాటు కోవాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం గల నేలల్లో నాటు కోవాలి.
Also Read: Solar Powered Fan to Grill Corn: 75 సంవత్సరాల మహిళ అద్భుతమైన ఆలోచన..
నాటడం: 85-90 రోజుల స్వల్ప కాలిక రకాలకు 21 రోజుల వయసు కల్గిన మొక్కలను, 105-125 రోజుల దీర్ఘ కాలిక రకాలకు 30 రోజుల వయసు కలిగిన మొక్కలను నాటు కోవాలి. ఎకరాకు దీర్ఘ కాలిక రకాలకు లక్ష ముప్పై మూడు వేల మొక్కలు వరకు, స్వల్ప కాలిక రకాలకు రెండు లక్షల అరవై ఆరు వేల మొక్కలు వరకు ఉంచాలి.
విత్తే దూరం: స్వల్ప కాలిక రకాలకు వరుసల మధ్య 15 సెంటి మీటర్ల దూరం, వరుసలో 10 సెంటి మీటర్ల దూరం ఉండాలి. దీర్ఘ కాలిక రకాలకు వరుసల మధ్య 15-20 సెంటి మీటర్ల దూరం, వరుసలో 15 సెం.మీ దూరం పాటించి విత్తుకోవాలి.
ఎరువులు:
నారుమడి దశలో 5 సెంట్ల నారుమడి ఎకరాకు సరిపోయే నారును ఇస్తుంది. 640 గ్రాముల నత్రజని, 640 గ్రాముల భాస్వరం, 480 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాల్సి ఉంటుంది.
ప్రధాన పొలంలో వేయవలసిన ఎరువులు: ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియ దున్నాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ నాటేటప్పుడు వేయాలి. నాటిన 30 రోజులకు మరో 12 కిలోల నత్రజనిని పై పాటుగా వేసుకోవాలి.
విత్తనం వెదజల్లే పద్ధతి: బాగా మెత్తగా తయారైన భూమిలో విత్తనాని సమానంగా చల్లు కోవాలి. విత్తనం చల్లిన తరువాత బల్లతో గాని, చెట్టు కొమ్మ తో గాని, నేలను చదును చేయాలి. లేకపోతే విత్తనానికి తగినంత తేమ లభించక మొలక శాతం తగ్గుతుంది.
కలుపు నివారణ/ అంతర కృషి:
విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తుగా పెరిగిన మొక్కలను తీసివేయాలి. విత్తనం వేయడానికి, నారు నాటడానికి ముందు పెండిమిథాలిన్ 30% ఎకరాకు 600 మిల్లీ లీటర్ల, 200 మిలీ నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును నివారించ వచ్చు. నాటిన 25,30 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు 400 గ్రాముల 2,4, డి సోడియం సాల్ట్ 80% పొడి మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
నీటి యాజమాన్యం : నాటిన పైరు బాగా పేర్లు తొడిగిన తర్వాత పది రోజులు నీరు పెట్టరాదు. పూత, గింజ పాలు పోసుకునే దశల్లో పైరు
ఎక్కువ నీటికి గురి కాకుండా చూడాలి.
అంతర పంటలు: రాగితో కందిని 8:2 నిష్పత్తిలో సాగు చేయవచ్చు. దీనిలో రాగి వరుసల మధ్య దూరం 30 సెంటి మీటర్ , మొక్కల మధ్య దూరం 10 సెంటి మీటర్, కంది వరుసల మధ్య దూరం 60 సెంటి మీటర్, మొక్కల మధ్య దూరం 20 సెంటి మీటర్లు పాటించాలి. రాగితో చిక్కుడును 8:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. వరుసల మధ్య దూరం 30 సెంటి మీటర్, వరుసల్లో రాగి మొక్కల మధ్య దూరం 10 సెంటి మీటర్, చిక్కుడు మొక్కల మధ్య దూరం 20 సెంటి మీటర్లు పాటించాలి.
Also Read: Ginger (Green) Mandi Prices: ఈ ప్రాంతంలో కిలో అల్లం 400 రూపాయలు..