Israel Olive Tree: ఇజ్రాయెల్ చెట్టు రాజస్థాన్ కు చెందిన ఓ రైతును కోటీశ్వరుడుని చేసింది. ఇలా అవుతుందని ఆ రైతు కలలో కూడా ఊహించలేదు. పదవీ విరమణ చేసిన ఎన్.యస్.జీ కమాండో… కొన్ని మొక్కలతో తన వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు లక్షల్లో ఆర్జిస్తూ మీడియాలో ఫేమస్ అయిపోయారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
ఆలివ్ సాగు రైతు జీవితాన్ని మార్చింది
రాజస్థాన్ లోని జుంజునులో మాజీ కమాండోగా చేసి రైతుగా మారిన మంజు పొలంలో 450 ఆలివ్ మొక్కలను సాగు చేపట్టారు. మన దేశంలో ఆలివ్ సాగు చేసేందుకు కనీసం మొక్కలు కూడా లభ్యంకాని రోజుల్లోనే, ముఖేష్ మంజూ ఇజ్రాయెల్ దేశం నుంచి ఆలివ్ మొక్కలను తెప్పించారు. జుంజునుకి 40 కి.మీ దూరంలో ఉన్న ఝురేలీ గ్రామంలో మంజు సాగు ప్రారంభించారు. 2014 ఆగష్టులో ముఖేష్ ఆలివ్ సాగు ప్రారంభించారు. ప్రారంభంలో పరిశోధనాత్మకంగా కొన్ని మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరగడంతో వాటిని విస్తరించారు.
ఇప్పుడు ఆయన పొలంలో 450 ఆలివ్ మొక్కలు ఉన్నాయి.
Also Read: Bio Products: ఎరువులు, పురుగు మందులతో పనిలేదు.. ఆశలు రేకెత్తిస్తున్న బయో ఉత్పత్తులు.!
వ్యవసాయం అంటే మంజుకు ఎంతో ఇష్టం
ఎన్.ఎస్.జీ కమాండోగా చేసే సమయంలోనూ ఆయన కుంటుంబం గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉండేది. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మంజు కూడా సాగు పనులు చూసుకునేవారు. ఆయనకు చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. దీంతో భిన్నంగా ఏదైనా సాగు చేయాలని ఆలోచించి ఎడారి ప్రాంతంలాంటి పొలాల్లో ఆలివ్ సాగు చేపట్టి సక్సెస్ అయ్యారు. నాలుగేళ్లు మంజు పడ్డ కష్టం పలించింది. ఆలివ్ మొక్కలు చెట్లుగా ఎదిగాయి. మంచి దిగుబడినిస్తున్నాయి. దీంతో మంజూ లక్షల్లో ఆర్జిస్తున్నారు.
నాలుగేళ్ల తరవాత మొదలైన దిగుబడులు
మంజు నాటిన ఆలివ్ మొక్కలు నాలుగేళ్ల తరవాత నేడు దిగుబడి నివ్వడం మొదలు పెట్టాయి. తొలిసారి ఆయనకు రూ.60 వేల ఆదాయం వచ్చింది. అది క్రమంగా పెరుగుతూ పోయింది. నేడు ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం తీస్తున్నారు. ఆలివ్ కాయలను కేజీ రూ.50 నుంచి రూ.60కి అమ్ముతున్నారు. అనేక కంపెనీలు ఆలివ్ కాయలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ చెట్లు వెయ్యి సంవత్సరాల వరకు దిగుబడినిస్తాయని మంజు తెలిపారు. ఎడారి ప్రాంతాల వేడిని అంటే 48 డిగ్రీల వేడిని కూడా ఆలివ్ మొక్కలు తట్టుకుంటున్నాయి. శీతాకాలంలో కనీస ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు తగ్గాలి. అప్పుడే ఆలివ్ దిగుబడినిస్తుంది. చైనా, అమెరికా, ఇజ్రాయెల్, న్యూజిలాండ్ దేశాల్లో ఆలివ్ సాగు విస్తారంగా చేపట్టారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ పంట సాగు విస్తరిస్తోంది.
Also Read: Vegetable Price Control Measures: కూరగాయల ధరలకు ఇలా కళ్లెం వేయవచ్చు.!