Beekeeping: వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో తేనె పరిశ్రమ చాలా ముఖ్యమైంది. రైతులు కేవలం పంటల సాగుపై ఆధారపడితే వరదలు, కరువు కాటకాలతో నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే రైతులు బహుముఖ వ్యవసాయం చేయాలి. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోడితో పాటు తేనెటీగల పెంపకం కూడా చేపట్టాలి. అందరికీ ఈఅవకాశం లేకపోయినా ప్రతి గ్రామంలో పంటలు సాగు చేసే ప్రాంతాల్లో మాత్రం తేనె పరిశ్రమ నడిపించవచ్చంటున్నారు నిపుణులు. ఆవివరాలు మనం ఇప్పుడు ఏరువాకలో తెలుసుకుందాం.
2020లో ఆత్మ నిర్భర్ ద్వారా
భారత ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉంచింది. వీటి వల్ల చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ ను కూడా అందుబాటులో ఉంచింది. పలు రంగాలకు సంబంధించి ఈపథకాలు అమలులో ఉన్నాయి. వీటిల్లో జాతీయ తేనెటీగల పెంపకం , తేనె మిషన్ కూడా ఒకటి. 2020లో ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. కేవలం రైతులు మాత్రమే కాదు, ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ మిషన్ ద్వారా సాయం అందుకుని తేనె పరిశ్రమను నడిపించవచ్చంటున్నారు… గుంటూరు లాం వ్యవసాయ యూనివర్శిటీ కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు
100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ బీ బోర్డ్ తేనె పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఓపథకాన్ని అమలు చేస్తోంది. 2021 నుంచి 2023 చివరి వరకు 3 ఏళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. దేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి కోసం ఈపథకాన్ని తీసుకువచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకం. అంటే 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూరుస్తుంది. తేనెటీగల పెంపకానికి సంబంధించిన ఇతర పథకాలైన కేవీఐసీ హనీ మిషన్, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు, ఎంఎస్ఎంఈ, ఆయుష్ తదితర వాటితో కలిసి ఈ స్కీమ్ పని చేస్తుంది.
Also Read: Beekeeping: తేనెటీగల పెంపకం.!
స్వయం సహాయక గ్రూప్స్, ఎఫ్‌పీవోల భాగస్వామ్యంతో..
వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబాలకు ఆదాయం, ఉపాధి కల్పన కోసం ఈ పథకం ద్వారా తేనెటీగల పెంపకం పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. హార్టికల్చర్,వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం దీని లక్ష్యం. తేనెటీగల పెంపకం అభివృద్ధి కేంద్రం, తేనెటీగల వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు, తేనె పరీక్ష ల్యాబ్‌లు, న్యూక్లియస్ స్టాక్, ఏపీఐ-థెరపీ కేంద్రాలు వంటి వాటి రూపంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. తేనెటీగల పెంపకం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం, తేనె, ఇతర తేనె ఉత్పత్తుల మూలాన్ని గుర్తించడం కోసం బ్లాక్‌చెయిన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పలు ప్రాంతాలలో తేనె కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తిలో అగ్రి ఎంట్రప్రెన్యూర్స్, అగ్రి-స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు, తేనెటీగల పెంపకందారుల మధ్య వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహిస్తున్నారు. స్వయం సహాయక గ్రూప్స్, ఎఫ్‌పీవోల భాగస్వామ్యంతో తేనెటీగల పెంపకందారులను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.
తేనే పెంపకం ద్వారా పర్యావరణానికి అనేక ప్రయోజనాలు
జాతీయ తేనెటీగల పెంపకంలో మూడు ఉప మిషన్లు ఉన్నాయి. తేనెటీగల పెంపకం అనేది రైతులకు, ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. తేనెటీగల పెంపకం యొక్క ప్రయోజనాలు అనేకం. పరపరాగ సంపర్కం ద్వారా పండ్లు, కూరగాయలు, నూనెగింజలు వంటి తదితర ఉత్పత్తుల నాణ్యత, పరిమాణం పెరుగుతుంది. పర్యావరణం, వ్యవసాయం రంగంలో స్థిరమైన అభివృద్ధికి సహాయపడుతుంది. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తేనెటీగల పెంపకం ఎంతో నైపుణ్యంతో చేయాల్సి ఉంటుంది. అందుకే తేనెటీగల పెంపకం చేపట్టే వారు ముందుగా హైదరాబాద్ లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక్కసారి మెళకువలు నేర్చుకుంటే ఇక నెలకు ఎంత సంపాదిస్తారు అనేది తేనె పెట్టెల సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది.
Also Read: Integrated Parthenium Management: “వయ్యారిభామ” కలుపు నిర్మూలనకు సమగ్ర చర్యలు.!