Jafra Cultivation: జాఫ్రా. ఈ పంట గురించి చాలా మందికి తెలియదు. దీన్ని సింధూరి అని కూడా అంటారు. ఆహార పదార్థాల తయారీలో కెమికల్ కలర్స్ కు ప్రత్యామ్నాయంగా జాఫ్రా గింజల నుంచి తీసిన రంగులను వాడుతున్నారు. దీంతో ఈ పంటకు విదేశాల్లో మంచి గిరాకీ వచ్చింది. గతంలో దీని గురించి ఎవరికీ తెలిసేది కాదు. తెలంగాణ లోని భీంరెడ్డి అనే రైతు దీనిపై సమాచారం సేకరించి సాగు ప్రారంభించారు. గద్వాల్, అప్రాన్ పల్లి గ్రామానికి చెందిన భీం రెడ్డి 12 ఎకరాల్లో నాలుగేళ్ల కిందట సాగు మొదలు పెట్టి జాఫ్రా ఇప్పుడు మంచి దిగుబడులు తీస్తున్నాడు.
పురుగు మందులు, ఎరువుల తో పనిలేదు
రైతులు ఏ పంట వేసిన వెంటనే చీడపీడలు వెంటాడుతూ ఉంటాయి. జాఫ్రా మాత్రం ఎలాంటి చీడపీడలు ఆశించవు. ఇక ఎరువులు కూడా వేసే పనిలేదని భీం రెడ్డి తన అనుభవాల ద్వారా చెబుతున్నారు. సాగు ఖర్చు పెద్దగా ఏమీ లేదు. అయితే మొక్కలు కొనుగోలు చేసి జాఫ్రా సాగు చేయాలంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. అందుకే భీంరెడ్డి అర కేజీ 33 వేలు ఖర్చు చేసి నర్సరీలో మొక్కలు పెంచుకున్నారు. దీంతో ఆయనకు మొక్కల కొనుగోలు ఖర్చు తగ్గింది. లేదంటే నర్సరీ ల నుంచి మొక్కలు కొనుగోలు చేయాలంటే ఒక్కో మొక్కకు రూ.150 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే విత్తనాలు సేకరించి భీంరెడ్డి మొక్కలు పెంచుకుని పొలంలో నాటుకున్నారు.
Also Read: Gasagasalu: ఈ పంట సాగు చెయ్యాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.!
ఆదాయం ఎంత వస్తుంది
జాఫ్రా పంట రెండో ఏడాది నుంచి దిగుబడి వస్తుంది. రెండో ఏడాది ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మూడో ఏడాది ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. నాలుగో ఏడాది నుంచి ఏటా ఎకరాకు 9 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని రైతు భీం రెడ్డి వెల్లడించారు. కేజీ రూ.150 రేటుకు కొనుగోలు చేస్తున్నారని భీం రెడ్డి తెలిపారు. అయితే ఎక్కువ మంది రైతులు సాగు చేస్తే ఎంత ధరకు కొనుగోలు చేస్తారనేది చెప్పలేమని భీంరెడ్డి చెబుతున్నారు.
విదేశాల్లో మంచి గిరాకీ
అమెరికా, యూరప్ దేశాల్లో కెమికల్ రంగులు నిషేధించారు. దీంతో లిప్ స్టిక్ తయారీ, ఆహారాల రంగుల తయారీలో రంగుల కోసం జాఫ్రా గింజలను ఉపయోగిస్తున్నారు. ఈ పంటను రాజమండ్రిలో కొందరు నర్సరీ యజమానులు కొనుగోలు చేస్తున్నారని భీం రెడ్డి తెలిపారు. ఏటా ఎకరాకు రూ.15వేల ఖర్చు వస్తుంది. నాలుగో ఏడాది నుంచి ఎకరాకు రూ.లక్షా 25 వేల ఆదాయం సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందులు,ఎరువుల ఖర్చు లేకపోవడంతో రైతులు ఈ పంట సాగుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు.
Also Read: Essential Commodities: నిత్యావసర సరుకులు తక్కువ ధరకు పంపిణీ..