Telangana Farmers: తెలంగాణా రైతులకు కేసిఆర్ ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది.. రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తున్న తెలంగాణా కర్షకులకు ప్రభుత్వం అదిరిపోయే వార్తను అందించింది. రూ.లక్ష రుణమాఫీ పై తాజాగా కేసీఆర్ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతులకు ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులందరికీ అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. రైతుబంధు నిధులను వారి రుణ ఖాతాల్లో జమ చేయవద్దని ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చామని తెలిపారు..
రెన్యువల్ చేస్తూ రుణాల పంపిణీ
సచివాలయంలో వ్యవసాయశాఖపై సమీక్షించి రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఈవివరాలను తెలియజేశారు. ఇప్పటి వరకు 5,42,635 మంది రైతులకు చెందిన రూ.1,207 కోట్ల రుణాలను మాఫీ చేశామని మిగిలిన వారి కోసం 2023-24 బడ్జెట్లో రూ.6,325 కోట్లు కేటాయించామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకారమే అన్ని బ్యాంకులు రైతుల ఖాతాలను రెన్యువల్ చేస్తూ రుణాల పంపిణీని కొనసాగించాలని సూచించామని అన్నారు. రైతులకు సకాలంలో రుణాలను మంజూరు చేసి వెన్నుదన్నుగా ఉండాలని నిర్దేశించామని తెలిపారు.
Also Read: Drum Seeder Machines: రాయితీపై డ్రం సీడర్ యంత్రాలు
ఎన్నికల నేపధ్యంలో ….
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, పంట రుణాలు మాఫీ ఇంతవరకు చేయకపోవడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. పంటలలో దిగుబడులు రాక, లాభాలు లేక, మద్దతుధర కరువై అప్పుల పాలు అయిన అన్నదాతలు గత నాలుగున్నరేండ్లుగా రైతుల లోన్లు మాఫీ చేయకపోవడంతో లక్షల మంది రైతులు బ్యాంకులకు బకాయిలను చెల్లించలేదు.. ఇటువంటి పరిస్ధితులలో బ్యాంకర్లు లోన్లు చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రైతుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న దృష్ట్యా కేసీఆర్ సర్కార్ ఈనిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరో రెండు నెలల్లో రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. ఇందుకు అవసరమైన నిధులు సమీకరించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణా ప్రభుత్వపై రైతులు త్రీవ అసంతృప్తితో ఉన్నారని కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైన కేసిఆర్ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది…
Also Read: AP Speaker Tammineni Seetharam: పంటకు గరిష్ట మద్దతు ధర అందిస్తున్నది వైసీపీ సర్కార్ లోనే.!