వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. సాగు కోసం రైతులు పెట్టే పెట్టుబడి ఖర్చులో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లలో రెండు దఫాలుగా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 2018 – 19 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి ప్రస్తుతం వరకు ఆరుమార్లు రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. పెట్టుబడి సాయం ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కాలంలో రైతులు వారి వారసత్వంగా ఉన్న భూములకు పట్టాదారులుగా మారడం, ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా రైతుబంధు సాయాన్ని సక్రమంగా అందిస్తోంది. ప్రతి రైతుకూ పరిమితితో సంబంధం లేకుండా ప్రభుత్వం నగదు సాయం పథకాన్ని అమలు చేస్తోంది. మొదటి సంవత్సరం రెండు దఫాల్లో ఎకరాకు రూ.4 వేలు చొప్పున అందించగా.. రెండు విడతలుగా అందించిన తర్వాత ఈ సాయాన్ని ఎకరాకు రూ. 5 వేలకు పెంచింది. దీంతో ఎక్కువ మంది రైతులు వారసత్వంగా ఉన్న భూములను పట్టాలుగా మార్చుకుని పాసు పుస్తకాలు పొందుతున్నారు. పథకం ప్రారంభంలో 1,34,580 మంది రైతులు లబ్ధిదారులుగా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,56,597 మందికి చేరింది. దీంతో ప్రభుత్వం రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లను సాయంగా మంజూరు చేస్తోంది. మున్ముందు రైతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.